Air India Bid: టాటా చేతికి ఎయిర్ ఇండియా.. స్పైస్ జెట్‌తో పోటీ పడి దక్కించుకున్న టాటా సన్స్
Air India Sale Live Updates: ఎయిర్ ఇండియాను తిరిగి టాటా కంపెనీ సొంతం చేసుకుంది. టాటా సన్స్‌తో పాటు స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ సైతం ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు బిడ్ దాఖలు చేశారు.
టాటా సన్స్ అనుకున్నది సాధించారు. దాదాపు ఏడు దశాబ్దాల తరువాత ఎయిర్ ఇండియాను తిరిగి టాటా కంపెనీ సొంతం చేసుకుంది. ఇటీవల టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా రానుందని ఇటీవల బ్లూమ్ బర్గ్ పేర్కొనగా.. తాజాగా అధికారికంగా నిర్ణయం వెల్లడైంది. టాటా సన్స్‌తో పాటు స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ సైతం ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు బిడ్ దాఖలు చేశారు. రూ.18 వేల కోట్లతో టాటా సన్స్ ఎయిరిండియా సొంతం చేసుకుంది.
Talace Pvt Ltd of Tata Sons is the winning bidder at Rs 18,000 crores. The transaction is expected to close by the end of December 2021, says Tuhin Kant Pandey, Secretary, DIPAM pic.twitter.com/SvSKj3pVNw
— ANI (@ANI) October 8, 2021
వారం కిందటే ప్రచారం..
ఎయిర్ ఇండియాను టాటా సన్స్ దక్కించుకుందని ఇటీవల ప్రచారం జరిగింది. బ్లూమ్ బర్గ్ సైతం ఈ విషయాన్ని తెలపడంతో చర్చ మొదలైంది. భారీ సంక్షోభంలోకి కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోందని కథనాలు వచ్చాయి. ఆసక్తి ఉన్న సంస్థలను బిడ్లకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యంగా టాటా గ్రూప్, స్పైస్ జెట్ సహా పలు ప్రముఖ సంస్థలు బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు రూ.18 వేల కోట్ల బిడ్‌తో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read: ఇంటర్‌నెట్ లేకున్నా పేమెంట్ చేయవచ్చు.. త్వరలో ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానం..
అధికారిక ప్రకటన
టాటా సన్స్‌కు చెందిన టలెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.18000 కోట్లకు బిడ్ దక్కించుకుంది. డిసెంబర్ 2021 నాటికి ఇందుకు సంబంధించి నగదు బదిలీ అవుతుందని భావిస్తున్నామని డీఐపీఏఎం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్‌మెంట్) సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే అధికారికంగా ప్రకటనలో పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియాను స్థాపించిన టాటా..
ఎయిర్ ఇండియాను 1932లో టాటా సంస్థ స్థాపించింది. ఆపై 1953లో ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో విస్తారా విమాన సేవలను టాటా సంస్థ అందిస్తోంది. ఎయిర్ ఇండియా నష్టాలతో కూరుకుపోతుండడంతో మెజారిటీ వాటాలు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో బిడ్‌లకు కేంద్రం ఆహ్వానించినా.. వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. సుమారు 76 శాతం వాటాను విక్రయించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా వేసిన బిడ్‌లలో స్పైస్ జెట్‌తో పోటీ ఎదుర్కొని టాటా సన్స్ ఎయిరిండియాను తిరిగి దక్కించుకుంది.
Also Read: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మళ్లీ యథాతథంగానే వడ్డీ రేట్లు.. శక్తికాంతదాస్ వెల్లడి