Offline Digital Payments: ఇంటర్‌నెట్ లేకున్నా పేమెంట్ చేయవచ్చు.. త్వరలో ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానం..
ఇంటర్‌నెట్ లేకున్నా డబ్బులు చెల్లించే విధానం తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానంపై త్వరలో కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
ఆన్‌లైన్ విధానంలో డబ్బుల చెల్లింపుల విధానంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. సాంప్రదాయక చెల్లింపుల విధానానికి స్వస్తి పలకనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే దేశమంతటా ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానం తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా మన మొబైల్ ఫోన్లో ఇంటర్‌నెట్ లేకపోయినా కూడా డబ్బులు (పేమెంట్) చెల్లించవచ్చని తెలిపింది. యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ తదితర విధానాల్లో ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్లు చేసేవారికి ఇది వర్తించనుందని పేర్కొంది. ఇంటర్‌నెట్ సరిగా లేని కారణంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి పేమెంట్ల చెల్లింపులో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని ఆర్‌బీఐ తెలిపింది. దీనిని సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానంపై త్వరలో కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు.
Also Read: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆ లావాదేవీల పరిమితి పెంపు!
మారుమూల ప్రాంతాల వారికి ఉపయోగకరం..
ఇంటర్‌నెట్ తక్కువగా ఉన్నా లేదా లేకపోయినా (ఆఫ్‌లైన్ మోడ్) డిజిటల్ చెల్లింపులు చేయగలిగేలా అధునాతన టెక్నాలజీ రూపొందించినట్లు డెవలప్‌మెంట్ మరియు రెగ్యులేటరీ పాలసీ తెలిపింది. దీనిని గతేడాది ఆగస్టు 6 నుంచి పైలట్ ప్రాజెక్టుగా దేశంలోని మూడు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూన్ మధ్య తక్కువ విలువ కలిగిన లావాదేవీలను జరిపింది. ఇవి విజయవంతం కావడంతో దీనిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
ఈ విధానం ఇంటర్‌నెట్ సదుపాయం లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అమలు చేయడం ఉపయోగకరంగా ఉంటుందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ విధానంలో డిజిటల్ చెల్లింపులు చేసేలా ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. దీనిపై త్వరలో మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పైలట్ స్కీమ్ మార్గదర్శకాల ప్రకారం.. ఆఫ్‌లైన్ పేమెంట్లు చెల్లించాలంటే గరిష్ట పరిమితి రూ. 200గా ఉంది. ఆఫ్‌లైన్ విధానంలో రూ.2000 వరకు గరిష్టంగా చెల్లింపులు చేయవచ్చు. రూ. 2000 దాటితే అదనపు ధ్రువీకరణ అవసరం. కాగా.. డిజిటల్ చెల్లింపుల విధానంలో భద్రతకు రిజర్వ్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కస్టమర్ల విశ్వసనీయత, భద్రత పెంచేలా ప్రతి లావాదేవీకి.. అడిషనల్ ఫాక్టర్ ఆఫ్ అథంటిఫికేషన్ (AFA) తప్పనిసరి చేసింది.
Also Read: అమెజాన్ సేల్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్-5 ఫోన్లు ఇవే.. ఏయే ఫోన్లు ఉన్నాయంటే?
Also Read: క్రిప్టో కరెన్సీ క్రేజ్.. బిట్ కాయిన్ ఉంటే బేఫికర్.. ఈ రెస్టారెంట్లో అదిరే ఆఫర్