Stocks To Watch 13 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' TCS, HCL Tech, Patanjali
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 13 July 2023: ఇవాళ (గురువారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 3 పాయింట్లు లేదా 0.02 శాతం రెడ్ కలర్‌లో 19,562 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ రిలీజ్ చేయనున్న కంపెనీలు: విప్రో, ఫెడరల్ బ్యాంక్, ఏంజెల్ వన్ ఇవాళ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తాయి. కాబట్టి, ఈ స్టాక్స్ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
TCS: టాటా గ్రూప్‌లోని టెక్నాలజీ కంపెనీ టీసీఎస్, బుధవారం సాయంత్రం Q1 రిజల్ట్స్ విడుదల చేసింది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ. 11,074 కోట్ల నికర లాభాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ. 9,478 కోట్లతో పోలిస్తే ఈసారి 17 శాతం వృద్ధి సాధించింది. ఆపరేషన్స్ రెవెన్యూ YoY ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ. 59,381 కోట్లకు చేరుకుంది. ఒక్కో షేరుకు రూ. 9 డివిడెండ్‌ను ఈ కంపెనీ ప్రకటించింది. ఇందుకు జులై 20ని రికార్డు తేదీగా ఫిక్స్ చేసింది. గతేడాది ఈ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 115 డివిడెండ్‌గా ప్రకటించింది.
పతంజలి ఫుడ్స్: బాబా రామ్‌దేవ్ నేతృత్వంలో నడిచే FMCG కంపెనీ పతంజలి ఫుడ్స్ ఆఫర్ ఫర్ సేల్ (OFS) స్కీమ్‌ను ప్రకటించింది. ఈ కంపెనీ ప్రమోటర్లు 9 శాతం వాటాను OFSలో విక్రయిస్తారు. ఇందుకు, ఒక్కో షేర్‌కు ఫ్లోర్ ప్రైస్‌గా రూ. 1,000 డిసైడ్ చేశారు.
HCL టెక్: ఐటీ సర్వీసెస్ కంపెనీ HCL టెక్నాలజీస్ కూడా ఏప్రిల్- జూన్ త్రైమాసికం ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేషన్ ప్రాతిపదికన రూ. 3,534 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 3,283 కోట్ల లాభంతో పోలిస్తే ఈసారి 7.6% వృద్ధి కనిపించింది. ఏకీకృత ఆదాయం రూ. 23,464 కోట్ల నుంచి YoYలో 12 శాతం పెరిగి రూ. 26,296 కోట్లకు చేరింది. మార్చి త్రైమాసికంలోని ఆదాయం రూ. 26,606 కోట్లతో పోలిస్తే మాత్రం 1.2% తగ్గింది. నిర్వహణ మార్జిన్ 16.9 శాతంగా నమోదైంది. మార్చి త్రైమాసికంలోని 18.25 శాతంతో పోలిస్తే ఇది కూడా తగ్గింది.
దీప్ ఇండస్ట్రీస్: రూ.130 కోట్ల విలువైన ప్రాజెక్టును ఈ కంపెనీ దక్కించుకుంది. ONGC నుంచి లెటర్ ఆఫ్ అవార్డు (LoA) అందుకుంది.
స్పైస్‌జెట్: స్పైస్‌జెట్ ప్రమోటర్ & MD అజయ్ సింగ్, ఈ బడ్జెట్ క్యారియర్ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ముందుకు వచ్చారు. స్పైస్‌జెట్‌లో సుమారు రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆఫర్ చేశారు.
డాక్టర్ రెడ్డీస్: తన ప్రతిపాదిత బయోసిమిలర్ రిటుక్సిమాబ్ క్యాండిడేట్ DRL_RI కోసం పెట్టుకున్న బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్‌కు (BLA) US FDA నుంచి ఆమోదం లభించిందని డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది.
ఆటో స్టాక్స్: ఎంట్రీ లెవల్ యుటిలిటీ వెహికల్స్‌కు బలమైన డిమాండ్‌తో, జూన్ నెలలో ప్యాసింజర్ వెహికల్స్ హోల్‌సేల్ అమ్మకాలు 2% పెరిగి 3,27,487కు చేరినట్లు సియామ్ ప్రకటించింది. గత ఏడాది జూన్‌లో అమ్మిన 3,20,985 యూనిట్లను కంపెనీలు విక్రయించాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొత్తం 9,95,974 ప్యాసింజర్ వెహికల్స్ సేల్ అయ్యాయి, 2022 ఇదే కాలంలో అమ్మిన 9,10,495 వాహనాల కంటే ఇది 9% అధికం.
రిలయన్స్ ఇండస్ట్రీస్: దివాలా తీసిన ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (FEL) కొనుగోలు రేసులో రిలయన్స్ రిటైల్ సహా 3 కంపెనీలు నిలిచాయి. రెజల్యూషన్ ప్లాన్ సమర్పించేందుకు RP షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లలో రిలయన్స్ రిటైల్, జిందాల్ (ఇండియా), జీబీటీఎల్ ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 24 కల్లా ఈ మూడు కంపెనీలు రెజల్యూషన్ ప్లాన్ సమర్పించాలి.
ఇది కూడా చదవండి: టీసీఎస్ గుడ్‌న్యూస్! 12-15% జీతాలు పెంచిన ఐటీ దిగ్గజం!! ప్రమోషన్లూ..!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial