MSCI Index: పేటీఎంకు గట్టి దెబ్బ - యెస్ బ్యాంక్, జొమాటో సహా 18 స్టాక్స్‌కు లాభం
Stock Market Updates: పేటీఎంతో పాటు బెర్జర్ పెయింట్స్, ఇంద్రప్రస్థ గ్యాస్ షేర్లను MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ నుంచి మినహాయించారు.
MSCI Global Standard Index: ప్రపంచ స్థాయి పెట్టుబడిదార్లు ట్రాక్ చేసే "మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్" (MSCI) ఇండెక్స్‌ల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. దీని ఫలితంగా మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో భారత్ నుంచి 13 షేర్లకు చోటు దక్కింది. పేటీఎంతో సహా మూడు షేర్లను నిష్క్రమించాయి.
ఈ 13 స్టాక్స్‌కు ఎంట్రీ పాస్
MSCI సూచీల్లో మే నెలలో జరిగే మార్పుల కోసం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్ల కోసం అనేక సూచీలను జారీ చేస్తుంది. గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ వాటిలో ప్రధానమైనది. MSCI సూచీల ఆధారంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫండ్ హౌస్‌లు/ ఇతర ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. ఇండెక్స్‌లో చేరిన స్టాక్స్‌లోకి FIIs నుంచి పెట్టుబడులు వస్తాయి, ఫలితంగా షేర్ ధరలు పెరుగుతాయి. ఇండెక్స్‌లో స్థానం కోల్పోయిన స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు వెళతాయి, ఫలితంగా వాటి షేర్ ధరలు తగ్గుతాయి.
సమీక్ష తర్వాత... కెనరా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్‌హెచ్‌పీసీ, ఇండస్ టవర్స్, ఫీనిక్స్ మిల్స్, PB ఫిన్‌టెక్, సుందరం ఫైనాన్స్, బాష్, జిందాల్ స్టెయిన్‌లెస్, సోలార్ ఇండస్ట్రీస్, టొరెంట్ పవర్, మ్యాన్‌కైండ్ ఫార్మా, థర్మాక్స్ షేర్లు మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో కొత్తగా చోటు దక్కించుకున్నాయి.
నిష్క్రమించిన కంపెనీలు
పేటీఎంతో పాటు బెర్జర్ పెయింట్స్, ఇంద్రప్రస్థ గ్యాస్ షేర్లను MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ నుంచి మినహాయించారు.
ఈ మార్పు తర్వాత పేటీఎం, బెర్జర్ పెయింట్స్, ఇంద్రప్రస్థ గ్యాస్ నుంచి FII పెట్టుబడులు బయటకు వెళ్లిపోతాయి. కెనరా బ్యాంక్, JSW ఎనర్జీ, NHPC, ఇండస్ టవర్స్, ఫీనిక్స్ మిల్స్, PB ఫిన్‌టెక్, సుందరం ఫైనాన్స్, బోష్, జిందాల్ స్టెయిన్‌లెస్, సోలార్ ఇండస్ట్రీస్, టోరెంట్ పవర్, మ్యాన్‌కైండ్ ఫార్మా, థర్మాక్స్ స్టాక్స్‌లోకి ఇన్ ఫ్లోస్ పెరుగుతాయి.
బరువు పెరిగిన 5 షేర్లు
ఇప్పటికే ఇండెక్స్‌లో కొనసాగుతున్న యెస్ బ్యాంక్, సుజ్లాన్ ఎనర్జీ, వేదాంత, జొమాటో, పాలిక్యాబ్ షేర్ల వెయిటేజీని పెంచారు. ఈ మార్పు వల్ల ఈ 5 స్టాక్స్ ప్రయోజనం పొందుతాయి, మునుపటి కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తాయి.
ఓవరాల్‌గా చూస్తే... మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ మే నెల సమీక్ష కారణంగా భారత్ ప్రయోజనం పొందబోతోంది. ఈ ఇండెక్స్ నుంచి 3 షేర్లు తొలగించినా, కొత్తగా 13 కంపెనీలకు చోటు దక్కడంతో వెయిటేజీ పెరిగింది. ఈ విధంగా భారతీయ స్టాక్ మార్కెట్‌లోకి విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతుంది. ఈ మార్పుల కారణంగా.. ఇండియన్ ఈక్విటీల్లోకి అదనంగా 2.5 బిలియన్ డాలర్లు వస్తాయని అంచనా.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: డయాగ్నోస్టిక్ హెల్త్‌కేర్‌లో రిలయన్స్ కొత్త ఆట, మంచి కంపెనీ కోసం వేట