Share Market Opening Today: మూడు రోజుల నష్టాలకు తెర - బుల్ రంకెతో బలం చూపిన మార్కెట్లు
మార్కెట్ ప్రారంభ సమయంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 1% పెరిగింది. US నాస్‌డాక్‌లో, టెక్ స్టాక్స్‌లో వచ్చిన అద్భుతమైన రికవరీ ఇండియాలోనూ ప్రతిబింబించింది.
Stock Market News Today in Telugu: ఎలుగుబంట్ల పంజా దెబ్బకు మూడు రోజులు విలవిల్లాడిన ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 19 జనవరి 2024) కోలుకున్నాయి. వారంలో చివరి ట్రేడింగ్ రోజున, దలాల్ స్ట్రీట్‌లో ఎద్దుల రంకెలు వినిపించడంతో ఎలుగుబంట్లు పరారయ్యాయి. బుల్స్ మద్దతుతో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్ & నిఫ్టీ బలం ప్రదర్శిస్తున్నాయి. లోయర్ లెవెల్స్‌లో కొనుగోళ్లు పుంజుకోవడం, కోలుకున్న గ్లోబల్ మార్కెట్ల పాజిటివ్ సిగ్నల్స్ నుంచి కూడా ఇండియన్ మార్కెట్లకు సపోర్ట్ దొరికింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (గురువారం) 71,187 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 600 పాయింట్లు లేదా 0.84 శాతం భారీ జంప్‌తో 71,786.74 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. గురువారం 21,462 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 153 పాయింట్లు లేదా 0.71 శాతం బలంతో 21,615.20 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 390 పాయింట్లు లేదా 0.85 శాతం లాభంతో 46,103.50 స్థాయిలో స్టార్ట్ అయింది.
బ్రాడర్ మార్కెట్‌లో... BSE మిడ్ క్యాప్ సూచీ 0.8 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.9 శాతం పెరిగాయి.
ఇవాళ్టి రికవరీలో లార్జ్ క్యాప్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. ఓపెనింగ్ ట్రేడ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లోని 28 స్టాక్స్ గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్ మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయి.
మార్కెట్ ప్రారంభ సమయంలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 1% పెరిగింది. US నాస్‌డాక్‌లో, టెక్ స్టాక్స్‌లో వచ్చిన అద్భుతమైన రికవరీ ఇండియాలోనూ ప్రతిబింబించింది. టెక్ మహీంద్ర దాదాపు 2.20 శాతం బలపడింది. విప్రో, HCL టెక్, ఇన్ఫోసిస్, TCS కూడా తలో 1 శాతం పైగా లాభపడ్డాయి. టైటన్, యాక్సిస్ బ్యాంక్, NTPC, బజాజ్ ఫైనాన్స్, ICICI బ్యాంక్, JSW స్టీల్, ITC, భారతి ఎయిర్‌టెల్, కోల్ ఇండియా షేర్లు కూడా 1-2 శాతం వరకు పెరిగాయి.
నిఫ్టీ ఐటీతో పాటు నిఫ్టీ ఫైనాన్షియల్స్, నిఫ్టీ మీడియా ఇండెక్స్‌లు కూడా 1 శాతం పైగా గెయిన్ అయ్యాయి.
నోయిడాలోని డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్‌లో 'డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్' సోదాలు చేసిందన్న వార్తలతో ఈ స్టాక్ దాదాపు 4 శాతం పడిపోయింది.
ఈ రోజు ఉదయం 10.30 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 687.12 పాయింట్లు లేదా 0.97% పెరిగి 71,873.98 దగ్గర; NSE నిఫ్టీ 203.05 పాయింట్లు లేదా 0.95% పెరిగి 21,665.30 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
గురువారం నాటి ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్‌లో మంచి రికవరీ కనిపించింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 200 పాయింట్లకు పైగా బలపడింది. టెక్నాలజీ స్టాక్స్ ఉండే నాస్‌డాక్ ఇండెక్స్ కూడా 200 పాయింట్లకు పైగా బలపడింది. S&P 500లో 42 పాయింట్ల రికవరీ కనిపించింది.
వారం చివరి రోజు ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు పటిష్టంగా కనిపిస్తున్నాయి. ప్రారంభ సెషన్‌లో జపాన్‌కు చెందిన నికాయ్ 1.4 శాతం ర్యాలీలో ఉంది. టోపిక్స్ కూడా దాదాపు 1 శాతం పెరిగింది. దక్షిణ కొరియాలోని కోస్పిలో 1.15 శాతం, కోస్‌డాక్‌లో 1.37 శాతం పెరుగుదల కనిపించింది. హాంగ్ కాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ దాదాపు 1 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి