Araku Coffee: న్యూయార్క్‌లో అరకు కాఫీ ఔట్ లెట్ - ఇప్పటికే ప్యారిస్‌లో - ఆనంద్ మహింద్రా ప్రకటన
Araku Coffee outlet: అరకు కాఫీ ఔట్ లెట్ త్వరలో న్యూయార్క్ లో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆనంద్ మహింద్రా ప్రకటించారు.

Next New York Araku Coffee outlet: మన్యం అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచంలోనే సూపర్ బ్రాండ్‌గా మారుతోంది. ఆరకు కాఫీ.. ప్రపంచవ్యాప్తంగా తన సుగంధాన్ని వ్యాపింపజేస్తూ మరో మైలురాయిని అడుగుపెట్టింది. ఆరకు ఒరిజినల్స్ (Araku Coffee) ప్రపంచంలోనే తమ ఆరో ఔట్‌లెట్‌ను బెంగళూరులో ఘనంగా ప్రారంభించింది. అశోక్ నగర్‌లోని కమిషనరేట్ రోడ్డులో ఈ కొత్త కేఫ్ ప్రారంభమయింది.
ప్యారిస్‌లో మూడు, ముంబైలో ఒకటి, బెంగళూరులో ఇప్పటికే ఒకటి ఉండగా.. ఇది బెంగళూరులో రెండో ఔట్‌లెట్ కావడం విశేషం. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆరు ఆరకు కేఫ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. త్వరలో న్యూయార్క్ లో ఔట్ లెట్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు.
We at @arakucoffeein just hit a six…
— anand mahindra (@anandmahindra) November 29, 2025
The Sixth Araku Coffee outlet and cafe in the world.
At Commissariat Road, Ashok Nagar, Bengaluru
After three in Paris, one in Mumbai, and now the second in Bengaluru.
Next—New York. pic.twitter.com/GxJ4esemqB
ఆంధ్రప్రదేశ్ ఆరకు వేలీలో గిరిజన రైతులు పండించే 100% ఆర్గానిక్ అరేబికా కాఫీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యుత్తమ రుచి గల కాఫీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్‌ను 2018 నుంచి ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి భారత్ వరకు.. త్వరలో అమెరికా వరకు విస్తరిస్తోంది.
బెంగళూరు కొత్త ఔట్‌లెట్‌లో ఆరకు సిగ్నేచర్ బ్లెండ్స్, సింగిల్ ఎస్టేట్ కాఫీలు, హ్యాండ్‌క్రాఫ్టెడ్ డెజర్ట్స్, గిరిజన ఆర్ట్‌తో అలంకరించిన ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. "ఆరకు కాఫీ అంటే కేవలం కాఫీ కాదు.. అది ఒక గిరిజన సమాజం ఆర్థిక స్వావలంబన కథ. ప్రతి కప్పులోనూ ఆరకు పర్వతాల సుగంధం, గిరిజన రైతుల కష్టం ఉంటాయి" అని ఆరకు టీమ్ తెలిపింది.
న్యూయార్క్ ఔట్‌లెట్ ప్రణాళికలు ఇప్పటికే ప్రారంభమైనట్టు సమాచారం. 2026లో అక్కడ తమ మొదటి అమెరికన్ కేఫ్ తెరవనున్నట్టు ఆరకు ఒరిజినల్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్యారిస్‌లో ఆరకు కేఫ్‌లు సెలబ్రిటీలు, కాఫీ కానస్యూర్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఇక బెంగళూరు, ముంబై తర్వాత.. న్యూయార్క్‌లో ఆరకు సుగంధం వ్యాపించడం ఖాయం!
2004లో స్థాపించిన నాంది ఫౌండేషన్‌కు అనంద్ మహీంద్ర చైర్మన్ , లైఫ్ ట్రస్టీగా ఉన్నారు. ఈ సంస్థ ఆరకు వ్యాలీలోని గిరిజనులకు వ్యవసాయ శిక్షణ, సహజ వనరుల నిర్వహణ ఇచ్చి, కాఫీ పంటను ప్రోత్సహించింది. 25 సంవత్సరాల ప్రయత్నాలతో 1 లక్ష మంది గిరిజనులు ఆర్థికంగా స్థిరపడటానికి దారితీసింది. నాంది నేతృత్వంలో ఆరకు కాఫీని బ్రాండ్‌గా రూపొందించారు.
2017లో అరకు గ్లోబల్ హోల్డింగ్స్ స్థాపనకు మహీంద్ర ముఖ్య పాత్ర పోషించారు. ఇందులో ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ కృష్ణ గోపాలకృష్ణన్, డా. రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సోమా ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ మగంటి వంటి వ్యాపారవేత్తలు భాగస్వాములు. ఈ వెంచర్ ప్యారిస్‌లో మొదటి రిటైల్ స్టోర్ తెరిచి, ఐరోపాలో విస్తరించింది. ప్రస్తుతం ఆరకు ఒరిజినల్స్ బోర్డు చైర్మన్‌గా మహీంద్ర కొనసాగుతున్నారు. అరకు కాఫీ అంటే భారతదేశం ఉత్తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందించగల సామర్థ్యానికి ఉదాహరణ అని మహీంద్ర ఎప్పుడూ చెబుతుంటారు.





















