Salman Khan: సల్లూ భాయ్ లగ్జరీ హోటల్, 19 అంతస్తుల బిల్డింగ్ ప్లాన్ వింటే వావ్ అంటారు
హోటల్ నిర్మించనున్న స్థలం సల్మాన్ ఖాన్ తల్లి సల్మాఖాన్ పేరిట ఉంది.
Salman Khan Mumbai Hotel: సినిమా నటులు నటనతో పాటు వివిధ రంగాల్లోనూ వ్యాపారం చేయడం మామూలే. కాసిని ఎక్కువ డబ్బులు సంపాదించే ప్రతి సినిమా నటుడుకి వేరే వ్యాపారాలు ఉంటాయి. బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. సినిమాలతో పాటు మరికొన్ని వ్యాపారాలపై కూడా శ్రద్ధ పెడుతున్నాడు సల్లూ భాయ్. అతని వ్యాపార పుస్తకంలో మరో కొత్త అధ్యాయం చేరబోతోంది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, త్వరలోనే ఈ కొత్త హోటల్ ప్రారంభించబోతున్నాడీ కండల వీరుడు.
19 అంతస్తుల్లో హోటల్ భవనం
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, సల్మాన్ ఖాన్ ముంబైలోని ఖరీదైన ప్రదేశంలో ఒక హోటల్ నిర్మించనున్నాడు. ఆ హోటల్‌ను 19 అంతస్తుల్లో కట్టబోతున్నాడు. కార్టర్ రోడ్‌లో సముద్రం ఒడ్డున హోటల్ నిర్మించే ప్రతిపాదనకు BMC ఆమోదం తెలిపిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. హోటల్ నిర్మించనున్న స్థలం సల్మాన్ ఖాన్ తల్లి సల్మాఖాన్ పేరిట ఉంది.
ఇంతకుముందు, ఆ భూమి స్టార్లెట్ సీహెచ్‌ఎస్ రెసిడెన్షియల్ సొసైటీలో భాగంగా ఉంది. దీనిని సల్మాన్ ఖాన్ కుటుంబం కొనుగోలు చేసింది. స్టార్‌లెట్ సీహెచ్‌ఎస్‌ను పునర్నిర్మించి నివాస సముదాయంగా అభివృద్ధి చేయాలనేది ముందుగా అనుకున్న ప్లాన్. ఇప్పుడు ఆ ప్లాన్ మారింది, హోటల్‌కు షిఫ్ట్ అయింది.
ఏ అంతస్తులో ఏం ఉంటుంది?
ముంబై డెవలప్‌మెంట్ కంట్రోల్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్ ప్రకారం, ఆర్కిటెక్ట్ కంపనీ సప్రే & అసోసియేట్స్ సల్లూ భాయ్ కొత్త భవనం ప్రణాళికను సిద్ధం చేసింది. బ్లూప్రింట్ ప్రకారం... ఈ 19 అంతస్తుల భవనం 69.90 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది పూర్తిగా కమర్షియల్ బిల్డింగ్, సెంట్రల్డ్ ఏసీతో ఉంటుంది. 19 అంతస్తుల్లో, మొదటి & రెండో అంతస్తుల్లో ఒక కేఫ్, రెస్టారెంట్ నిర్మించడానికి ప్రణాళిక ఉంది. మూడో అంతస్తులో జిమ్, స్విమ్మింగ్ పూల్ నిర్మించాలనేది బ్లూప్రింట్ ప్రతిపాదన. భవనంలోని నాలుగో అంతస్తును సర్వీస్ ఫ్లోర్ కింద కేటాయిస్తారు. ఐదు & ఆరు అంతస్తుల్లో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. భవనంలోని 7 నుంచి 19వ అంతస్తు వరకు హోటల్‌గా ఉపయోగించుకుంటారు. ఈ హోటల్ నుంచి చూస్తే సముద్ర దృశ్యం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందట. ఖాన్ భాయ్ హోటల్‌లో అన్ని లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.
సల్లూ భాయ్‌కి చాలా ఆస్తులు
సల్మాన్ ఖాన్‌కు ముంబైలో ఇప్పటికే చాలా కమర్షియల్ అసెట్స్ ఉన్నాయి. ఏప్రిల్‌లో, బాంద్రా వెస్ట్‌లో ఓ ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నాడు. ఆ ఫ్లాట్‌కు ప్రతినెలా దాదాపు రూ. 1.5 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు. అతనికి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఇల్లు ఉంది, అక్కడే నివసిస్తున్నాడు. ఇంకా, పావైల్‌లో ఒక ఫామ్‌హౌస్, గోరైలో బీచ్ ప్రాపర్టీ కూడా సల్మాన్ ఖాన్ సొంతం.
ఇది కూడా చదవండి: ఫారిన్ వెళ్తున్నారా?, ఏ ఖర్చులు ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి వస్తాయో ముందు తెలుసుకోండి