Reserve Bank of India: ఆర్‌బీఐ ఎంపీసీ సర్‌ప్రైజ్ మీటింగ్, ద్రవ్యోల్బణంపై కేంద్రానికి సమాధానం చెప్పాలట!
సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. ఆగస్టులోని 7 శాతం నుంచి ఇది పెరిగింది.
Reserve Bank of India: నవంబర్ 3న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ (MPC) అదనపు సమావేశం జరగబోతోంది. దేశంలో ద్రవ్యోల్బణ స్థాయి మీద ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపు ఎందుకు అదుపు చేయలేకపోయిందో కేంద్ర ప్రభుత్వానికి RBI సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికలో నివేదించాల్సిన అంశాల మీద చర్చించడానికి MPC మీటింగ్ జరగబోతోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 45ZN నిబంధన ప్రకారం, RBI మానిటరీ పాలసీ కమిటీ & మానిటరీ పాలసీ ప్రాసెస్ రెగ్యులేషన్ 2016 ప్రకారం MPC అదనపు సమావేశం నవంబర్ 3, 2022న జరుగుతుంది అని RBI తెలిపింది. సెక్షన్ 45ZN ప్రకారం... ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత లక్ష్యం లోపు నియంత్రించడంలో వరుసగా మూడు త్రైమాసికాల పాటు ఆర్‌బీఐ విఫలమైతే, అందుకు కారణాలను ఈ బ్యాంకర్స్ బ్యాంక్ ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. 2016లో పరపతి విధాన కమిటీ విధానం అమల్లోకి వచ్చాక, కేంద్ర ప్రభుత్వానికి RBI సమాధానం చెప్పుకోవాల్సి రావడం ఇదే తొలిసారి. దేశంలో అధిక స్థాయిలో ఉన్న ధరలను అదుపు చేసేందుకు పరిష్కార మార్గాలను కూడా తన నివేదికలో RBI సూచిస్తుంది.
9 నెలలుగా 6%పైనే ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణానికి సంబంధించి RBI సౌలభ్య స్థాయి (కంఫర్ట్ రేంజ్) 2-6 శాతంగా ఉంది. అయితే... సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. ఆగస్టులోని 7 శాతం నుంచి ఇది పెరిగింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. ఆహార పదార్థాల ధరలు పెరగడంతో సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. 2021 సెప్టెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతంగా నమోదైంది. అక్కడి నుంచి పెరుగుతూనే వస్తోంది. RBI హయ్యర్ మార్జిన్ 6 శాతం కంటే ఎక్కువగా CPI ఇన్‌ఫ్లేషన్ నమోదు కావడం వరుసగా ఇది తొమ్మిదో నెల.
RBI రేట్ సెట్టింగ్ ప్యానెల్ (మానిటరీ పాలసీ కమిటీ) చివరిసారిగా 2022 సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమావేశమైంది. MPC సిఫార్సుల ప్రకారం... సెప్టెంబర్ 30న, పాలసీ రెపో రేటును 0.5 శాతం లేదా 50 బేసిస్ పాయింట్లు (bps) RBI పెంచింది. ఈ ఏడాది మే నెల నుంచి రెపో రేటును పెంచడం ఇది నాలుగోసారి. మే నుంచి సెప్టెంబర్ వరకు 1.9 శాతం లేదా 190 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.9 శాతానికి చేరింది. ఇది మూడేళ్ల గరిష్ఠ స్థాయి + కరోనా ముందున్న స్థాయి. RBI రెపో రేట్లను పెంచడం వల్ల, అన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ఫలితంగా.. కార్, పర్సనల్, హోమ్ లోన్ వంటి అన్ని రకాల రుణాలు ప్రియమై, సామాన్యులపై భారం పెరిగింది.
ఈ సంవత్సరం మే నెలలో 40 బేసిస్ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు, ఆగస్టులో 50 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటును కేంద్ర బ్యాంక్ పెంచింది.
మళ్లీ డిసెంబర్‌లో..
ఈ ఏడాది డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో RBI MPC సమావేశం కానుంది. ఈ దఫా వడ్డీ రేట్లు ఎంత పెంచాలో ఆ భేటీలో చర్చిస్తారు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇదే చివరి భేటీ అవుతుంది.