RBI News: ఆర్బీఐ హెచ్చరిక! లోన్స్ తీసుకునేటప్పుడు ఈ 4 విషయాలు గమనించాలని సూచన
Business News: రుణాల మంజూరు, వడ్డీ రేట్ల వసూలు, ఇతర రుణ ఛార్జీల విషయంలో దేశంలోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీలు పాల్పడుతున్న తప్పుడు పద్ధతులను సవరించుకోవాలని రిజర్వు బ్యాంక్ ఆదేశించింది.
Loans News: ఇటీవల దేశంలోని బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ సంస్థలు సైతం అనేక మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు రెగ్యులేటరీ సంస్థ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుగొంది. కొన్ని సంస్థలపై భారీగా జరిమానాలు విధించగా మరికొన్నింటి వ్యాపారాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం ఆర్‌బీఐ రుణాలు తీసుకునే వ్యక్తులకు పలు కీలక సూచనలు జారీ చేసింది.
ప్రస్తుతం దేశంలో చాలా మంది హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, గోల్డ్ లోన్స్ ఇలా అనేక రుణాలను బ్యాంకుల నుంచి పొందేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌బీఐ మార్చి 31, 2024న నిర్వహించిన ఆన్‌సైట్ ఇన్‌స్పెక్షన్‌లో, లెండింగ్ బ్యాంకుల ప్రస్తుత రుణాలు, కస్టమర్ల నుంచి వడ్డీల వసూలు పద్ధతులు పారదర్శకంగా లేవని గుర్తించింది. ఇవి చాలా మందిని విస్మయానికి గురిచేస్తున్నాయి. అందువల్ల లోన్ తీసుకునే సమయంలో ప్రతి వ్యక్తి బ్యాంకులు మోసాలకు పాల్పడే 4 ఫీజుల గురించి తప్పక తెలుసుకోవాలని హెచ్చరిస్తోంది.
- RBI జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం కొన్ని బ్యాంకులు కస్టమర్లకు రుణాల ఆమోదం తేదీ నుంచే వడ్డీని వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచే వడ్డీని వసూలు చేస్తున్నాయి. వీటి విషయంలో పారద్శకంగా ఫైనాన్స్ సంస్థలు వ్యవహరించాలని రెగ్యులేటర్ పేర్కొంది. వాస్తవంగా రుణాన్ని అందించినప్పటి నుంచే వడ్డీ లెక్కించాలని ఆదేశించింది.
- చాలా బ్యాంకులు చెక్కుల ద్వారా రుణాలను అందిస్తాయి. చెక్‌లో పేర్కొన్న తేదీ నుంచి వడ్డీని చాలా ఫైనాన్స్ కంపెనీలు లెక్కిస్తున్నాయి. దీంతో ఖాతాదారుల చేతికి చెక్కు చేరకముందే వడ్డీ వసూలు చేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ గమనించింది.
- కొన్ని సార్లు లోన్ ప్రాసెసింగ్ లేటవుతుంటుంది. ఈ క్రమంలో నెల మధ్యలో 15వ తేదీని రుణం పొందినప్పటికీ మెుత్తం నెలకు కస్టమర్ల నుంచి కొన్ని బ్యాంకింగ్ సంస్థలు పూర్తి నెలకు వడ్డీని వసూలు చేస్తున్నట్లు వెల్లడైంది. అంటే రుణాన్ని మంజూరు చేయని కాలానికి సైతం కస్టమర్ల నుంచి కొన్ని సంస్థలు వడ్డీని పిండుతున్నాయని గుర్తించబడింది.
- కొన్ని బ్యాంకులు రుణాన్ని పంపిణీ చేయడానికి ముందు రెండు వాయిదాల డబ్బును వసూలు చేస్తుంటాయి. అయితే వీటి విషయంలో పూర్తి మొత్తంపై వడ్డీని లెక్కిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. ఇలా వడ్డీ వసూలు విషయంలో న్యాయబద్ధమైన పద్ధతులను రుణ సంస్థలు అవలంబించటం లేదని సెంట్రల్ బ్యాంక్ గమనించింది. వాస్తవానికి ఇలాంటి పాలసీల్లో ఫైనాన్స్ సంస్థలకు ఉన్న స్వేచ్ఛను అవి దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించబడింది. రుణాల విషయంలో బ్యాంకులు ఇలాంటి మోసాలకు పాల్పడుతూ ఖాతాదారుల నుంచి అధిక సొమ్మును వసూలు చేస్తున్నాయని గమనించబడింది. అందువల్ల రుణాలను తీసుకునే సమయంలోనే వీటికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా అడిగి తెలుసుకోవటం ఉత్తమం.
ఫైనాన్స్ సంస్థల పనితీరును గమనించేందుకు ఆర్బీఐ నియమించిన బృందాలు చేపట్టిన ఆడిట్ సమయంలో ఈ విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫైనాన్స్ సంస్థలను రుణాల పంపిణీకి చెక్కులకు బదులుగా ఆన్‌లైన్ బదిలీ పద్ధతిని వినియోగించాలని రిజర్వు బ్యాంక్ ఆదేశించింది. రుణ సంస్థలు సైతం నిజాయితీగా లావాదేవీలను నిర్వహించాలని ఆదేశించింది. ఇకనైనా సంస్థలు తాము ఫాలో అవుతున్న లోన్ జారీ, వడ్డీ వసూలు, సర్వీస్ ఛార్జీలకు సంబంధించిన విధానాలను సమీక్షించాలని.. అవసరమైన మార్పులను ప్రవేశపెట్టాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది.