(Source: ECI/ABP News/ABP Majha)
RBI: EMI భారం నుంచి మరో ఉపశమనం, జూన్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్న ఆర్‌బీఐ
జూన్‌లో జరిగే ద్వైమాసిక సమీక్షలో రెండు ప్రధాన అంశాలపై సెంట్రల్ బ్యాంక్ దృష్టి పెడుతుంది.
RBI MPC Meet: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), ప్రజలకు మరోసారి ఉపశమనాన్ని ప్రకటించవచ్చు. ఈ ఏడాది జూన్ నెలలో ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) సమావేశంలో కూడా, రెపో రేటు పెంపును రిజర్వ్ బ్యాంక్ నిలిపివేయవచ్చు. ఈ నెల ప్రారంభంలో, 3-6 తేదీల్లో జరిగిన సమావేశం కూడా రెపో రేటును కేంద్ర బ్యాంక్ పెంచలేదు, 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది.
దేశంలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి గత ఏడాది మే నెల నుంచి ఆర్‌బీఐ వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు పెంచింది. ఈ పెంపు సరిపోతుందని, ఇక కొత్తగా పెంచాల్సిన అవసరం లేదని భారత రెపో రేటును నిర్ణయించే ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, జూన్ సమావేశంలో కూడా రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయకుండా సెంట్రల్ బ్యాంక్ స్థిరంగా ఉంచుతుందని మార్కెట్ భావిస్తోంది.
రెండు ప్రధాన అంశాలు
జూన్‌లో జరిగే ద్వైమాసిక (రెండు నెలలకు ఒకసారి) సమీక్షలో రెపో రేటు పెంచకుండా ఉండాలంటే, రెండు ప్రధాన అంశాలపై సెంట్రల్ బ్యాంక్ దృష్టి పెడుతుంది.
1. అసంపూర్తి రుతుపవనాల కారణంగా పంట దిగుబడులు తగ్గి ఆహార ఉత్పత్తుల ధరలు పెరగకూడదు
2. ముడి చమురు ధరలు పెరకూడదు
అంటే, రెపో రేటును నిలకడగా ఉంచడంలో రుతుపవనాలు, ముడి చమురు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు.
ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని అంచనా
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కనిపించవచ్చని భారత వాతావరణ విభాగం గతంలోనే హెచ్చరించింది. అంటే, వర్షపాతం తగ్గి ఎండలు మండిపోతాయి. దాని ప్రభావం పంట దిగుబడులపై పడుతుంది. రుతుపవనాల లోపం వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావంతో ద్రవ్యోల్బణం ఎక్కువ స్థాయిలోనే ఉండవచ్చన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆరుగురు సభ్యుల MPC అభిప్రాయం. అయితే, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని పంట ఉత్పత్తి తగ్గకపోయినా లేదా ఆహార పదార్థాల ధరలు పెరగకపోయినా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని అంచనా.
ఒక సంవత్సరం క్రితం గరిష్ట స్థాయులకు చేరిన కమొడిటీల ధరలు ఇప్పుడు బాగా దిగవచ్చాయి. దీనివల్ల.. వస్తు తయారీ కంపెనీలపై పెట్టుబడి వ్యయాల భారం బాగా తగ్గింది. ఫలితంగా వస్తు ధరలు తగ్గుతాయి. రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంది. కాబట్టి, జూన్ సమావేశంలో కూడా రెపో రేటు పెంచకుండా అడ్డుపడే పరిస్థితులు ప్రస్తుతానికి సానుకూలంగానే ఉన్నాయి.
2.5 శాతం పెరిగిన రెపో రేటు
గత ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు, గత 11 నెలల్లో జరిగిన ఆరు విధాన సమీక్షల్లో రెపో రేటు మొత్తంగా 2.5 శాతం లేదా 250 బేసిస్ పాయింట్లు RBI పెంచింది. గత ఏడాది మే నెల నాటికి ఉన్న 4 శాతం నుంచి ఇప్పుడు 6.5 శాతానికి చేరింది.