Paytm: ఫాస్టాగ్ నుంచి పేటీఎం ఔట్ - వేరే బ్యాంక్‌కు ఇలా మార్చుకోండి!
దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మంది ఫాస్టాగ్ యూజర్లు ఉంటే, ఇందులో మేజర్ షేర్ పేటీఎందే.
Paytm Payments Bank Outh From FASTag Banks List: వరుస దెబ్బలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు (PPBL), రిజర్వ్ బ్యాంక్ (RBI) కాస్త ఊరటనిచ్చింది. డిపాజిట్ల స్వీకరణ, వాలెట్లు, ఫాస్టాగ్ వంటి టాప్‌అప్స్ విషయంలో మరో 15 రోజుల గడువు ఇచ్చింది. ఖాతాదార్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, గతంలోని గడువును 29 ఫిబ్రవరి 2024 నుంచి 15 మార్చి 2024 వరకు పొడిగించింది. ఈ గడువులోగా నగదు స్వీకరించవచ్చు, టాప్‌అప్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్‌ను ఖాళీ చేసేందుకు, మార్చి 15 తర్వాత కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే, మార్చి 15 తర్వాత కొత్తగా నగదు స్వీకరణ, టాప్‌అప్‌లకు అనుమతి ఉండదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఆటో డెబిట్, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌కు (NCMC) కూడా ఇదే వర్తిస్తుంది.
ఫాస్టాగ్ బ్యాంక్‌ల లిస్ట్ నుంచి ఔట్
ఫాస్టాగ్ కొనుగోలు కోసం అనుమతించిన బ్యాంక్‌ల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (Indian Highways Management Company Limited - IHMCL) తొలగించింది. హైవే మీద ఉన్న సమయంలో యూజర్లు ఇబ్బంది పడకుండా ఉండాలంటే... పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ మినహా మిగిలిన 32 బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ కొనుగోలు చేయాలని సూచించింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మంది ఫాస్టాగ్ యూజర్లు ఉంటే, ఇందులో మేజర్ షేర్ పేటీఎందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన ఫాస్టాగ్ యూజర్ల వాటా, మొత్తం యూజర్లలో సుమారు 30%.
ఒకవేళ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌ను మీరు వినియోగిస్తుంటే, 2024 మార్చి 15 తర్వాత కూడా దానిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఇది ఎలాంటి ఆటంకం లేకుండా మీ ప్రయాణం కొనసాగుతుంది. అయితే, మార్చి 15 తర్వాత మీరు దానిని రీఛార్జ్ చేయలేరు. కాబట్టి, మీ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయే లోగా వేరే బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది. లేదంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ కేర్‌తో మాట్లాడి రిఫండ్ అడగండి. లేదా ఫాస్టాగ్‌ను పోర్ట్ చేయండి.
ఫాస్టాగ్‌ని పోర్ట్ చేయడం ఎలా? (How to port FASTag?)
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి మీ ఫాస్టాగ్‌ను మార్చుకోవాలంటే, ఆ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మాట్లాడండి.
ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫాస్టాగ్‌ను వేరే బ్యాంక్‌కు బదిలీ చేసుకుంటామని రిక్వెస్ట్ చేయండి.
కస్టమర్ కేర్ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత, నిబంధనల ప్రకారం, కస్టమర్ కేర్ అధికారి మీ ఫాస్టాగ్‌ను పోర్ట్ చేస్తారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌ను కూడా మార్చి 15 వరకే మీరు రీఛార్జ్ చేయగలరు. ఆ తర్వాత, అందులోని బ్యాలెన్స్ ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు. మార్చి 15 తర్వాత NCMCని రీఛార్జ్ చేయడం కుదరదు. ప్రయాణ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూదనుకుంటే, వేరే బ్యాంక్ నుంచి NCMC తీసుకోవాలి. NCMCలో ఉన్న బ్యాలెన్స్‌ను వేరే కార్డ్‌కు బదిలీ చేయడం కుదరదు. మీకు డబ్బులు వెనక్కు కావాలంటే, రిఫండ్ కోసం PPBLను సంప్రదించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: పేమెంట్స్ బ్యాంక్‌పై మీ అన్ని అనుమానాలకు RBI సమాధానాలు, ఇదిగో FAQs లిస్ట్