Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈవో రాజీనామా, పడిపోయిన మార్కెట్ షేర్
గత నెల రోజుల్లో ఈ స్టాక్ దాదాపు ఫ్లాట్‌గా ఉంది, గత ఆరు నెలల కాలంలో ఏకంగా 59% వరకు పతనమైంది.
Paytm Payments Bank CEO Surinder Chawla Resigns: ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మంగళవారం ఈ కంపెనీకి రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటిది... పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ & సీఈవో సురీందర్ చావ్లా రాజీనామా చేశారు. రెండోది... రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆంక్షల తర్వాత పేటీఎం మార్కెట్ వాటా సుమారు 2 శాతం తగ్గింది.
వరుస షాక్‌ల కారణంగా నిన్న (మంగళవారం, 09 ఏప్రిల్ 2024) పేటీఎం షేర్లు క్షీణించాయి. బీఎస్ఈలో ఈ స్టాక్ 1.95 శాతం పడిపోయి రూ.404.30 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ దాదాపు ఫ్లాట్‌గా ఉంది, గత ఆరు నెలల కాలంలో ఏకంగా 59% వరకు పతనమైంది.
సురీందర్ చావ్లా రాజీనామా
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ MD & CEO సురీందర్ చావ్లా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (One 97 Communications) మంగళవారం వెల్లడించింది. సురీందర్ చావ్లా 08 ఏప్రిల్ 2024న తన పదవికి రాజీనామా చేశారని వెల్లడించింది. స్టాక్ మార్కెట్ ముగిసిన కొన్ని గంటల తర్వాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. 26 జూన్ 2024న ఆయన బాధ్యతల నుండి రిలీవ్ అవుతారని తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో అన్ని ఒప్పందాలు ముగించుకున్నట్లు కూడా వన్97 కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. బ్యాంక్ బోర్డులో ఐదుగురు స్వతంత్ర డైరెక్టర్లు, ఒక ఛైర్మన్ ఉన్నారని, తమ కంపెనీ ప్రతినిధి ఇప్పుడు బోర్డులో లేరని వెల్లడించింది.
తగ్గిన పేటీఎం మార్కెట్ వాటా
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, 2024 ఫిబ్రవరిలో పేటీఎం మార్కెట్ వాటా 11 శాతంగా ఉంది, మార్చిలో ఇది 9 శాతానికి (Paytm Market Share) తగ్గింది. అంటే, కేవలం నెల రోజుల్లోనే 2 శాతం మార్కెట్ వాటాను పేటీఎం కోల్పోయింది. ఫిబ్రవరిలో, కంపెనీ 1.3 బిలియన్ల యూపీఐ (UPI) లావాదేవీలు నిర్వహించింది, మార్చిలో ఈ సంఖ్య 1.2 బిలియన్లకు తగ్గింది. 2024 జనవరిలో ఇది 1.4 బిలియన్లుగా ఉంది. పేమెంట్స్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించినప్పటి నుంచి ఈ సంఖ్య నెలనెలా తగ్గుతూ వస్తోంది.
పెరిగిన ఫోన్‌పే, గూగుల్ పే లావాదేవీలు
NPCI ప్రకారం, పేటీఎం పోటీ సంస్థలైన ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay) నిరంతరం వృద్ధి చెందుతున్నాయి. 2024 మార్చి నెలలో, గూగుల్ పే ద్వారా 5 బిలియన్ల లావాదేవీలు జరిగాయి, ఫిబ్రవరి నెల కంటే ఇది 6.3 శాతం ఎక్కువ. మార్చిలో ఫోన్‌పే ద్వారా 6.5 బిలియన్ల లావాదేవీలు జరిగాయి, ఫిబ్రవరిలో కంటే ఇది 5.2 శాతం ఎక్కువ.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పోస్టాఫీస్ పథకాల్లో ఎంత వడ్డీ వస్తుంది, ఏ స్కీమ్‌తో ఎక్కువ లాభం?