Edible Oil Prices: నెలలో 26 శాతం పెరిగిన వంటనూనె ధరలు - టైమ్ చూసి పెట్టిన వాత ఇది
Import Duty Hike On Edible Oils: ఇటీవల, కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఆ వేడికి వంట నూనెలు మరగడం, ధరలు పెరగడం ప్రారంభమైంది.
Edible Oil Rates Increases In Festive Season: ఈ పండుగ సీజన్‌లో ప్రశాంతంగా నాలుగు అరిశలు, బూరెలు వండుకోవడానికి & తినడానికి ఆలోచించాల్సి వస్తోంది. దసరా, దీపావళి వంటి కీలక పండుగల సమయంలో ఎడిబుల్ ఆయిల్ రేట్లు భారీగా పెరగడం ఫెస్టివ్ మూడ్‌ను పాడు చేసింది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, ఈ నెల రోజుల్లో ఆవనూనె ధరలు 9.10 శాతం, పామాయిల్ ధరలు 14.16 శాతం పెరిగాయి.
ఆన్‌లైన్ స్టోర్లలో ధరలు 26 శాతం జంప్
ఈ నెల రోజుల్లో, ఆవనూనె ధర ఇటు రిటైల్ మార్కెట్‌లో & అటు ఆన్‌లైన్ కిరాణా కంపెనీల పోర్టల్స్‌లో 26 శాతం పెరిగింది. నెల రోజుల క్రితం ఆన్‌లైన్ కిరాణా పోర్టల్‌లో లీటరు ఆవనూనె రూ.139 కి లభించగా, ఇప్పుడు దీని ధర లీటరుకు రూ.176 కి చేరుకుంది. అంటే గత నెలలో ధరలు 26.61 శాతం పెరిగాయి. మస్టర్డ్ ఆయిల్‌ను ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వంటనూనెగా ఉపయోగిస్తారు.
ప్రభుత్వ డేటా కూడా అదే చెబుతోంది
ప్రభుత్వ లెక్కలు కూడా ఎడిబుల్ ఆయిల్ ధరల పెరుగుదల నిజమేనని చెబుతున్నాయి. కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల శాఖకు చెందిన ధరల పర్యవేక్షణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల క్రితం, 25 ఆగస్టు 2024న లీటరు ఆవాల నూనె రూ.139.19 కి లభించగా, ఇప్పుడు రూ.151.85 కి అందుబాటులో ఉంది. లీటరు ఆవనూనె దిల్లీలో రూ.165, ముంబయిలో రూ.183, కోల్‌కతాలో రూ.181, చెన్నైలో రూ.167 పలుకుతోంది.
దక్షిణ భారతదేశంలోనూ రేట్ల మంట
సాధారణంగా, దక్షిణ భారతదేశంలో వంటనూనెలుగా ఉపయోగించే పొద్దుతిరుగుడు పువ్వుల నూనె, పామాయిల్, సోయా ఆయిల్ రేట్లు కూడా పెరిగాయి. నెల రోజుల క్రితం, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రేటు రూ.119.38 గా ఉండగా, ప్రస్తుతం లీటరు రూ.129.88 కి లభిస్తోంది. నెల క్రితం లీటరు రూ.98.28 గా ఉన్న పామాయిల్ ఇప్పుడు లీటరుకు రూ.112.2 కి చేరింది. సోయా ఆయిల్ ధరలు కూడా నెల రోజుల్లో లీటరుకు రూ.117.45 నుంచి రూ.127.62 కి పెరిగింది. వెజిటబుల్ ఆయిల్ ధర లీటరుకు రూ.122.04 నుంచి రూ.129.04 కి ఎగబాకింది.
వంటనూనెల ధరలు ఎందుకు పొంగుతున్నాయి?
ఎడిబుల్ ఆయిల్‌ల దిగుమతి సుంకాన్ని పెంచుతూ (Import Duty Hike On Edible Oils) కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనివల్లే ఎడిబుల్ ఆయిల్‌ల దిగుమతులు ఖరీదయ్యాయి. క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ పామాయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 0 నుంచి 20 శాతానికి; రిఫైన్డ్ ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిపై సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల పామాయిల్ నుంచి సోయా వరకు అన్ని రకాల వంటనూనెల ఖరీదయ్యాయి. దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దిగుమతి సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, రేట్ల పెంపు ప్రభావం నేరుగా సామాన్య జనంపై పడింది. నూనెలను ఎక్కువగా వినియోగించే పండుగ సీజన్‌లో, సరైన టైమ్ చూసి సర్కారు దెబ్బకొట్టింది.
మరో ఆసక్తికర కథనం: వ్యాపారం మీది, పెట్టుబడి ప్రభుత్వానిది - ఏ పథకం నుంచి ఎంత డబ్బు వస్తుంది?