PRS Oberoi: భారత అతిథ్యానికి వెలుగు రేఖ ఒబెరాయ్ ఇక లేరు, ఆయన జీవిత విశేషాలు, ఘనతలు ఇవి
PRS Oberoi Passed Away: ఒబెరాయ్ గ్రూప్ వ్యాపారమే కాదు, ఇండియన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కూడా కొత్త పుంతలు తొక్కింది. భారత ఆతిథ్యం, సరిహద్దులను అధిగమించి ప్రపంచ దేశాలకు విస్తరించింది.
Oberoi Group Chairman PRS Oberoi Passes Away: లగ్జరీ హోటల్స్ చైన్ 'ది ఒబెరాయ్ గ్రూప్' ఛైర్మన్ పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్(PRS Oberoi ) ఇక లేరు. మంగళవారం ఆయన మరణించారు. పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్, PRS ఒబెరాయ్‌గా, అంతకుముంచి 'బికీ'గా (Biki) ఇండస్ట్రీకి సుపరిచితుడు. భారత ఆతిథ్య రంగానికి (Indian Hospitality Industry) బంగారు దారి చూపిన మార్గదర్శి బికి. ఆయన వయస్సు 94 సంవత్సరాలు.
"ఒబెరాయ్ గ్రూప్ చైర్మన్ పీఆర్‌ఎస్ ఒబెరాయ్ ఈ రోజు (మంగళవారం) ఉదయం ప్రశాంతంగా చివరి శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియజేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆయన మరణం ఒబెరాయ్ గ్రూప్‌నకు, భారత ఆతిథ్య రంగానికి తీరని లోటు" అని ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది.
ఆతిథ్య రంగానికి సరైన మార్గం చూపిన మార్గదర్శి (Pioneer Of Indian Hospitality)
ఒబెరాయ్ గ్రూప్ చైర్మన్‌గా PRS ఒబెరాయ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఒబెరాయ్ గ్రూప్ వ్యాపారమే కాదు, ఇండియన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కూడా కొత్త పుంతలు తొక్కింది. భారత ఆతిథ్యం, సరిహద్దులను అధిగమించి ప్రపంచ దేశాలకు విస్తరించింది.
భారతదేశంలో హోటల్ బిజినెస్ ఔట్‌లుక్‌ను మార్చిన వ్యక్తిగా పేరు సంపాదించిన PRS ఒబెరాయ్, దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో చాలా లగ్జరీ హోటళ్లను ప్రారంభించారు. తద్వారా, అంతర్జాతీయ లగ్జరీ ట్రావెలర్స్ మ్యాప్‌లో ఒబెరాయ్ హోటళ్లకు గుర్తింపు తెచ్చిపెట్టారు.
ఒబెరాయ్ పుట్టుక, చదువు (PRS Oberoi Birth date, Education)
ది ఒబెరాయ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, దివంగత రాయ్ బహదూర్ MS ఒబెరాయ్ (founder of The Oberoi Group Rai Bahadur MS Oberoi) కుమారుడు PRS ఒబెరాయ్. 3 ఫిబ్రవరి 1929న న్యూదిల్లీలో జన్మించారు. భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్‌లో చదువుకున్నారు. ఈ గ్రూప్ అభివృద్ధి చెందుతున్న దశలో, EIH లిమిటెడ్‌కి చాలా కాలం పాటు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ అయ్యారు. దూరదృష్టి, సామర్థ్యంతో తాను తీసుకున్న నిర్ణయాలతో ఒబెరాయ్ హోటల్స్‌ను ఆకాశమంత ఎత్తులో నిలిపారు. దేశంలో ఏ ప్రముఖుడైనా, విదేశీ అతిథులైనా.. బస చేయాలంటే ఒబెరాయ్ హోటల్ మాత్రమే గుర్తుకు వచ్చేలా వ్యాపారాన్ని తీర్చిదిద్దారు. గొప్ప మార్గదర్శకత్వాన్ని తన తర్వాతి తరానికి అందించి తనదైన ముద్ర వేశారు.
ఒబెరాయ్ కృషికి లభించిన పురస్కారాలు (Awards to PRS Oberoi)
పర్యాటకం & ఆతిథ్యంలో దేశానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా పద్మ విభూషణ్‌తో సహా అనేక దేశీయ, అంతర్జాతీయ పురస్కారాలు, ప్రశంసలు పీఆర్ఎస్ ఒబెరాయ్‌కి లభించాయి. ఆయన అద్భుత నాయకత్వం, ఆలోచన తీరుకు మరింత వన్నె తీసుకొచ్చేలా ILTM (International Luxury Travel Market) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో (Lifetime Achievement Award) సత్కరించారు. అమెరికాకు చెందిన HOTELS మ్యాగజైన్, ఒబెరాయ్‌కి 'కార్పొరేట్ హోటల్‌యర్ ఆఫ్ ది వరల్డ్' (Corporate Hotelier of the World) అవార్డు ఇచ్చింది. బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2008, ఎర్నెస్ట్ & యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫర్ మేనేజ్‌మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్‌లో చాలా ఉన్నాయి.
PRS ఒబెరాయ్ మరణం పట్ల దేశ, విదేశీ వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. నిజమైన లెజెండ్‌ను కోల్పోయామని ట్వీట్లు చేశారు. పీఆర్‌ఎస్ ఒబెరాయ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు కపషేరాలోని ఒబెరాయ్ ఫామ్‌లోని భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో జరిగాయి.
ఇది కూడా చదవండి: సహారా చీఫ్ సుబ్రతా రాయ్ కన్నుమూత- ప్రముఖుల సంతాపం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial