Pension Scheme: NPSలో భారీ మార్పులకు సర్వం సిద్ధం!, మీకు ఎంత పెన్షన్ వస్తుందంటే?
Guaranteed Pension Scheme: పింఛను విషయంలో పాత విధానాన్నే మళ్లీ అమలు చేయాలన్న డిమాండ్ దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వినిపిస్తోంది.
Old Pension Scheme: ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాలు 'పాత పెన్షన్ విధానం' తిరిగి అమలు చేయడంతో 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' (National Pension System) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 'ఓల్డ్ పెన్షన్ స్కీమ్'ను తిరిగి అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, పాత పెన్షన్ విధానం (OPS) వెనక్కు తీసుకురాకుండా, జాతీయ పింఛను విధానాన్నే (NPS) మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం, వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ప్రస్తుతం అమలవుతున్న పింఛను విధానాలను ఇప్పటికే పరిశీలించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చివరి జీతంలో కనీసం సగం మొత్తాన్ని (50 శాతానికి తగ్గకుండా) పెన్షన్‌గా ఇవ్వాలని భారత ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని ఊహిస్తున్నారు. ఇటీవల, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కూడా దీనిపై మాట్లాడారు. అంతేకాదు, 2023 మార్చిలోనే, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేసింది. NPSను ఆకర్షణీయంగా మార్చడానికి కొన్ని సిఫార్సులు చేసింది.
పాత పింఛను విధానం అమలు చేయరు!
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. జీతానికి, పెన్షన్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ దిశగా, పాత పెన్షన్ "తరహా" విధానాన్ని తిరిగి తీసుకురాబోతోంది. OPS కింద, ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత, తమ చివరి జీతంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా పొందుతారు. NPSలో, ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) నుంచి 10 శాతం కట్ అవుతుంది. ప్రభుత్వం కూడా 14 శాతం డబ్బు కాంట్రిబ్యూట్ చేస్తుంది. వీటన్నింటినీ మిక్స్ చేసి, NPSలోనే OPS లాంటి ప్రయోజనాలను అందించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
కార్పొరేట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్‌పైనా పరిశీలన
దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను తిరిగి ప్రారంభించడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళనగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. OPS డిమాండ్లను తగ్గించడానికి, NPS కింద, 25 నుంచి 30 సంవత్సరాలు పని చేసిన ఉద్యోగులకు గ్యారెంటీగా 50 శాతం జీతాన్ని పెన్షన్‌గా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించొచ్చు. ఇది కాకుండా, కార్పొరేట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనాలను పొందే సంస్థలు ఈ ఫండ్‌ను నిర్వహిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ పెన్షన్ మోడల్
సోమనాథన్ కమిటీ, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పెన్షన్ వ్యవస్థలను అధ్యయనం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, వైఎస్ జగన్ హయాంలో ప్రతిపాదించిన 'గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్'ను (GPS) కేంద్ర ప్రభుత్వంలోనూ అమలు చేస్తే ఉద్యోగులు OPS డిమాండ్‌ను మర్చిపోతారని సూచించింది. పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించడానికి మోదీ ప్రభుత్వం మొగ్గు చూపడం లేదు కాబట్టి, NPSలోనే మార్పులు చేసి ప్రకటించే ఛాన్స్ ఉంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో వేడి పెంచిన పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి