Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
PDS Rice: ఏపీలో బియ్యం స్మగ్లింగ్ కేసులో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. తాజాగా పేర్ని నాని భార్యకు చెందిన గోడౌన్ లో బియ్యం మాయం చేశారని ఆమెపై అధికారులు ఫిర్యాదు చేశారు.
Perni Nani name came out in rice scam: ఆంధ్రప్రదేశ్ రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని విషయంలో ఫిర్యాదు రావడం సంచలనంగా మారింది. పేర్ని నాని సతీమణి పేరుపై ఉన్న గోడౌన్లలో పౌరసరఫరాల శాఖ పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచింది. అయితే ఆ బియ్యం మాయమైంది. ఏమయిందో ఎవరికీ తెలియలేదు. బియ్యం పోయాయని కావాలంటే డబ్బులు ఇస్తామని పేర్ని నాని అధికారులకు లేఖ రాశారు. దీంతో కావాలని ఆయనే మాయం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భార్య పేరుతో గోడౌన్లు నిర్మించి పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చిన పేర్ని నాని
పేర్ని నానిగా అందరూ పిలిచే పేర్ని వెంకట్రామయ్య మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే. మంత్రిగా పని చేశారు. ఆయన భార్య జయసుధ పేరుతో ఆయన గోడెన్లను నిర్మించారు. దీనిని పౌర సరఫరాల శాఖకు బఫర్ గోడౌన్‌గా ఆయన అద్దెకు ఇచ్చారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా పది రోజుల క్రితం పేర్ని జయసుధకు చెందిన గోడౌన్‌ను పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. గోడౌన్‌లో నిల్వ ఉన్న సరుకులో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ఆ క్రమంలో 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు పౌరసరఫరాల ఉన్నతాధికారులు గుర్తించారు.
Also Read : విశాఖలో గూగుల్ ఆఫీస్- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
బియ్యం మాయం కావడంతో పేర్ని జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ పైకేసులు
దీంతో పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేర్ని నాని సతీమణి జయసుధతోపాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై సై కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బియ్యం మాయం కాలేదని పేర్ని నాని, ఆయన భార్య చెబుతున్నారు. వేబ్రిడ్జ్ సరిగ్గా పని చేయక పోవడం వల్లే సరుకు నిల్వలో షార్టేజ్ వచ్చిందని వాదిస్తున్నారు. షార్టేజ్‌కి సంబంధించి ధాన్యం విలువ ఎంత అయితే అంత ప్రభుత్వానికి చెల్లిస్తామని అధికారులకు పేర్ని జయసధ అధికారులకు లేఖ రాశారు.
బియ్యం మొత్తానికి విలువ కడితే డబ్బులిస్తామన్న పేర్ని నాని
పేర్ని నాని వ్యవహారంపై దుమారం రేగుతోంది. గోడౌన్లు ఆయన భార్య పేరు మీద ఉండటంతో ఆయన కేసులు తప్పించుకున్నారు. అయితే వే బ్రిడ్జి సరిగ్గా పని చేయకపోతే ఏదో కొంత తేడా వస్తుంది కానీ ఏకంగా 185 టన్నులు తేడా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు ఇచ్చేందుకు సిద్దపడ్డారంటే కావాలనే బియ్యం మాయం చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బియ్యం ఎక్కడకు తరలించాలన్న విషయాన్ని దర్యాప్తు చేసే అవకాశం ఉంది.