Nifty @ 19,000: నిఫ్టీ 19,000 మార్క్‌ను చేరడం వెనుక విదేశీ హస్తం!
కేవలం మూడు నెలల్లోనే (ఏప్రిల్-జూన్) FIIల కొనుగోలు మొత్తం 10.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Nifty @ 19,000: ప్రపంచ దేశాలపై ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం కారుమేఘాలు కమ్ముకుంటుంటే, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ప్రకాశవంతంగా మెరుస్తోంది. దీంతో, ఫారిన్ ఫోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (FII) టన్నుల కొద్దీ డాలర్లను తెచ్చి దలాల్ స్ట్రీట్‌లో అన్‌లోడ్ చేస్తున్నారు. FY24లో ఇప్పటివరకు, FIIల పెట్టుబడులు 10 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటాయి. అవే నిఫ్టీని 19,000 మార్క్ అందుకునేలా చేశాయి.
10.5 బిలియన్ డాలర్ల ఇన్‌ఫ్లోస్
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2021-22, 2022-23) నెట్ సెల్లర్స్‌గా ఉన్న ఫారిన్ మోతుబరులు, 2023 మార్చి నుంచి భారతదేశ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. 2023 ఏప్రిల్‌లో, విదేశీయులు 1.4 బిలియన్ డాలర్ల విలువైన ఇండియన్ ఈక్విటీస్ కొనుగోలు చేశారు. మే నెలలో షాపింగ్ ఖర్చును ఏకంగా 5.3 బిలియన్ డాలర్లకు పెంచారు. ఈ నెలలో (జూన్ 2023) మరో 3.7 బిలియన్ డాలర్లతో నెట్ బయ్యర్స్‌గా కంటిన్యూ అవుతున్నారు. ఈ మొత్తం కలిపితే, కేవలం మూడు నెలల్లోనే (ఏప్రిల్-జూన్) FIIల కొనుగోలు మొత్తం 10.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
జూన్‌లో, మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్ల కంటే ఇండియాలోకే ఎక్కువ ఫారిన్ పెట్టుబడులు వచ్చి పడ్డట్లు తాజా డేటాను బట్టి తెలుస్తోంది.
ఓవైపు ఫారినర్లు కొంటూ పోతుంటే, మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదార్లు (DIIలు) లాభాలు బుక్ చేసుకునే పనిలో పడ్డారు. DIIలు మే నెలలో నెట్ సెల్లర్స్‌గా ఉన్నారు. FY24లో ఇప్పటి వరకు, DIIల కొనుగోలు ఖర్చు కేవలం రూ. 1,785 కోట్లు.
ఇండియన్ మార్కెట్ల పరుగుకు కారణం ఇది
ఎఫ్‌ఐఐల ఈక్విటీ ఇన్ ఫ్లోస్ బలంగా ఉండడం, మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ఫ్లోస్‌లో పికప్, ముడి చమురు ధరలు తగ్గడం, గ్రామీణ డిమాండ్ పెరగడం, క్యాపెక్స్ సైకిల్ రికవరీ, పెరిగిన GDP గ్రోత్ అంచనాలు, మోదీ అమెరికా పర్యటనతో ఇండియన్ ఈక్విటీలకు భారీ బూస్ట్ దొరికింది. దీంతో, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పాటు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను కూడా ఇండియన్ మార్కెట్లు క్రాస్ చేసి ముందుకెళ్లాయి.
లార్జ్ క్యాప్ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్ & స్మాల్ క్యాప్ స్టాక్స్ గత కొన్ని నెలలుగా మంచి ర్యాలీ చేస్తున్నాయి. మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కనిపిస్తున్న ఈ ఎక్సైట్‌మెంట్‌కు ప్రత్యేక కారణం ఏమీ లేదని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ చెబుతోంది.
ఇండియన్ ఈక్విటీస్ దీర్ఘకాలిక సగటు PE 18.4 రెట్లయితే, ప్రస్తుతం 19.5 రెట్ల PE వద్ద ట్రేడవుతున్నాయి. అయినా, ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్ పెద్ద ఎక్స్‌పెన్సివ్‌గా కనిపించడం లేదన్నది కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయం. చౌకైన వాల్యుయేషన్‌లు, హెడ్‌లైన్ సూచీల మొత్తం లాభాలకు బ్యాంకుల నుంచి అందిన బిగ్ కాంట్రిబ్యూషన్ కారణంగా వాల్యుయేషన్స్‌ను తక్కువగా కనిపిస్తున్నాయని చెబుతోంది.
మరో ఆసక్తికర కథనం: గురువారం బ్యాంకులకు సెలవు, మీ ప్రాంతంలో పరిస్థితేంటో తెలుసుకోండి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial