Gas Cylinder Leakage: గ్యాస్ సిలిండర్ లీక్ అయితే వెంటనే ఇలా చేయండి, లేకపోతే ఇల్లు పేలిపోతుంది
LPG Cylinder Leakage: గ్యాస్ సిలిండర్ లీకేజీ సమయంలో సురక్షితంగా ఉండడానికి సహజ వాయువు మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలను జారీ చేసింది. వాటిని పాటిస్తే మీ ఇల్లు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉంటారు.
LPG Gas Cylinder Safety Measures: మన దేశంలోని కోట్లాది ఇళ్లలో వంట కోసం ఎల్‌పీజీ సిలిండర్ ఉపయోగిస్తున్నారు. భారత్‌లో వంట గ్యాస్ లేని ఇళ్లు బహు అరుదు అని చెప్పినా అతిశయోక్తి కాదు. గ్యాస్ సిలిండర్ వచ్చాక వంట పని చాలా తేలికైంది. ముఖ్యంగా మహిళకు చాలా సమయం ఆదా అయింది. అంతేకాదు, కట్టెల పొయ్యి/కిరోసిన్ స్టవ్ నుంచి వచ్చే పొగ అనారోగ్యాస నుంచి నుంచి విముక్తి దొరికింది. వంట విషయంలో గ్యాస్ సిలిండర్ ఒక వరంగా మారినప్పటికీ, మరోవైపు చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. సిలిండర్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి అవి మనుషుల ప్రాణాలు కూడా తీస్తాయి.
గ్యాస్ లీకేజీ వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం, సిలిండర్ పేలిపోవడం వంటి సంఘటనలను అప్పుడప్పుడు వార్తల్లో చదువుతున్నాం, వింటున్నాం. అలాంటి ఘటనల్లో ఇంటికి మంటలు అంటుకోవడం, ఇల్లు కూలిపోవడంతో పాటు కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతోంది. గ్యాస్ సిలిండర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా ప్రమాదకరమని అలాంటి సంఘటనలు నిరూపిస్తుంటాయి. అందుకే, గ్యాస్ సిలిండర్‌ను "వంటింట్లో పెట్టుకున్న బాంబ్" అని కూడా వ్యాఖ్యానిస్తుంటారు.
పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ హెచ్చరిక
గ్యాస్ సిలిండర్ లీకేజీలపై ప్రజల్లో అవగాహన & ప్రమాదాల నివారణ కోసం కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తుంది, ప్రజలను అప్రమత్తం చేస్తుంది. తాజాగా, కొంత సమాచారాన్ని మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంటే ప్రజలు ఏం చేయాలో చెప్పే వీడియోను విడుదల చేసింది. దీంతో పాటు, తక్షణ సాయం కోసం సంప్రదించాల్సిన ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్ గురించి వెల్లడించింది.
#SafetyTip
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) June 25, 2024
In case of LPG leakage, stay calm and act fast!
Here’s what to do:
- Switch off the regulator immediately.
- Call the Gas Leakage Emergency Service at 1906.
Rest assured, complaints are resolved to satisfaction within two to four hours.
#1906 #LPGHelpline… pic.twitter.com/3BblQ11uIU
ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్ 1906
ఇంట్లో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంటే, ఆ పరిస్థితిలో భయపడకూడదు. భయపడితే, ఆ టెన్షన్‌లో మరో తప్పు జరగవచ్చు. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందని గమనించగానే గాభరా పడకుండా ప్రశాంతంగా ఉండాలి. వెంటనే గ్యాస్ సిలిండర్ దగ్గరకు వెళ్లి రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. దీనివల్ల సిలిండర్ నుంచి గ్యాస్ బయటకు రావడం ఆగిపోతుంది. అంతేకాదు, ఆ సమయంలో మీ ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేయకూడదు, మంట వెలిగించకూడదు. కనీసం అగ్గిపుల్లను కూడా వెలిగించకూడదు. ఇప్పుడు.. వంటగది తలుపులు, ఇంటి తలుపులు పూర్తిగా తెరిచి, ఇంట్లోకి గాలి వచ్చేలా చూడాలి. దీనివల్ల, అప్పటి వరకు లీక్ అయిన గ్యాస్ బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ గది నుంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు, గ్యాస్ లీకేజ్ ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్ 1906కి కాల్ చేయాలి.
పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ చెప్పిన ప్రకారం, ఎమర్జెన్సీ నంబర్ 1906కు కాల్ చేసిన రెండు నుంచి నాలుగు గంటల్లో గ్యాస్ కంపెనీ ప్రతినిధి మీ ఇంటికి వస్తాడు, లీకేజీ సమస్యను పరిష్కరిస్తాడు.
మరో ఆసక్తికర కథనం: పీపీఎఫ్ పెట్టుబడిదార్లు గుడ్‌న్యూస్ వినొచ్చు - ఈ నెల 28న నిర్ణయం!