ఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ
రాజ్యసభలో నోట్లకట్టల వ్యవహారం దుమారం రేపుతోంది. స్వయంగా రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ ఈ ప్రకటన చేయడం సంచలనం సృష్టించింది. రొటీన్ సెక్యూరిటీ చెకప్‌లో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ సీట్‌లో నోట్ల కట్టలు కనిపించాయని చెప్పారు ధన్‌కర్. దీనిపై మల్లికార్జున్ ఖర్గే తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే ఈ అంశం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. అయితే..ఈ వివాదంపై అభిషేక్ మనుసింఘ్వీ తీవ్రంగా స్పందించారు. 12.57కి సభలోకి వెళ్లానని, ఆ తరవాత ఒంటిగంటకు బయటకు వచ్చి ఒకటిన్నర వరకూ క్యాంటీన్‌లో కూర్చున్నానని వివరించారు. కేవలం సభలో మూడు నిముషాలు మాత్రమే ఉన్నానని తేల్చి చెప్పారు. ఈ సమయంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఎంపీ సీట్‌లో ఎవరైనా ఏదైనా పెట్టి వెళ్లిపోయే అవకాశముందని ఆరోపించారు. అంతే కాదు. ఇలాంటివి జరగకూడదంటే..ఇకపై ఎంపీలు తమ సీట్‌లకు తాళం వేసుకుని..ఆ కీస్‌ని ఇంటికి తీసుకెళ్లడం మంచిదేమో అని సెటైర్లు వేశారు. లేదంటే ఎవరు పడితే వాళ్లు వచ్చి సీట్‌లపై ఏవేవో పెట్టి ఇలాంటి ఆరోపణలు చేసే ప్రమాదముందన అన్నారు. ఏదేమైనా ఈ అంశంపై లోతైన విచారణ జరిగి తీరాలని, నిజానిజాలేంటో అందరికీ తెలియాలని తేల్చి చెప్పారు.