రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో ఈ అలజడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్. సభలో రొటీన్ చెక్‌లో భాగంగా అన్ని చోట్లా తనిఖీలు చేస్తుండగా ఓ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలు దొరికాయని షాకింగ్ విషయం చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ సీట్‌లోనే ఈ కరెన్సీ కట్టలు కనిపించాయని వెల్లడించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సభలో అలజడి రేగింది. ఈ విషయం తన నోటీస్‌కి వచ్చిందని, దీనిపై కచ్చితంగా విచారణ చేపడతామని స్పష్టం చేశారు రాజ్యసభ ఛైర్మన్. అయితే...ఇది నిజమా కాదా తేలక ముందే ఎంపీ పేరుని ఎలా బయటపెడతారంటూ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. విచారణ పూర్తయ్యేంత వరకూ ఆయన పేరుని బయటపెట్టకూడదని ఛైర్మన్‌కి రిక్వెస్ట్ చేసుకున్నారు. ఈ వివాదంపై అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. రాజ్యసభకి వచ్చిన సమయంలో తాను కేవలం 500 రూపాయలు మాత్రమే తెచ్చుకున్నానని వెల్లడించారు. అసలు సభలో ఎక్కువ సేపు లేనని, పార్లమెంట్ క్యాంటీన్‌లోనే కూర్చున్నానని వివరించారు. ఇక ఈ వ్యవహారంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. తప్పు జరిగింది కాబట్టే.. రాజ్యసభ ఛైర్మన్ సీట్ నంబర్‌తో పాటు ఆ ఎంపీ పేరు కూడా చెప్పారని..ఇందులో తప్పేముందని ఖర్గేని ప్రశ్నించారు.