Women Entrepreneur: థింక్ డిఫరెంట్- ఇదే నేటి మహిళ ఆలోచన
ఈ మధ్య చాలా మంది వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకరి కింద పని చేయకూడదనే ఉద్దేశంతోపాటు తమ కాళ్ల మీద తాము నిలబడాలనే తపన కూడా ఉంది.
ఒకప్పుడు మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ కాలానుగుణంగా కొద్ది కొద్దిగా ఈ పరిస్థితి మెరుగు పడుతూ వస్తోంది. పూర్తిగా చదువులేని స్థితి నుంచి చదువుకోవడం, ఉన్నత చదువులకు వెళ్లడం, ఆపై మెల్లిగా ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం తమంతట తాము సొంతంగా వ్యాపారాలు కూడా పెడ్తున్నారు. పెద్ద పెద్ద కొలువుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అందులోనూ ఒకరి కింద పని చేయకూడదనే ఉద్దేశంతో చాలా మంది మహిళలు వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. 2021, 2022 నుంచి వ్యాపారం చేసే మహిళల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని లింక్డ్ ఇన్ చెప్తోంది. ఇందుకు సంబంధించిన డాటాను కూడా రివీల్ చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను బుధవారం విడుదల చేసింది.
రెండేళ్ల నుంచి పెరుగుతున్న మహిళా వ్యాపారులు..
గత రెండేళ్లుగా అంటే 2020, 21, 22లో మహిళా వ్యవస్థాపక వృద్ధి రేటు అత్యధికంగా ఉందని లింక్డ్ ఇన్ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తోంది. 2016తో పోలిస్తే 20.68 శాతం ఈ వాటా పెరిగినట్లు అర్థం అవుతోంది. అలాగే పురుష వ్యవస్థాపకు వాటాతో పోలిస్తే ఇది దాదాపు 1.79 రెట్లు ఎక్కువగా ఉంది. 2022 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన లింగ సమానత్వం, లింగ అవాంతరాల నివేదికలో ఉన్న డేటాను బట్టి ఈ వివరాలను తెలిపారు. మన దేశ నాయకత్వంలో మహిళలకు అసమానమైన ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ... పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలు వ్యాపార రంగం వైపే మొగ్గు చూపుతున్నారు.
2020 నుంచి మహిళా వ్యాపారులు పెరుగుతున్నప్పటికీ.. 2021లో ఈ రేటు అత్యధికంగా ఉందని లింక్డ్ ఇన్ నివేదిక వివరిస్తోంది. ఇది చెప్పుకోదగ్గ విషయమే అయినప్పటికీ మరో బాధాకరమైన విషయాన్ని కూడా ఈ నివేదిక చెప్తోంది. పురుషులతో పోలిస్తే అంతర్గతంగా మహిళలకు నాయకత్వం ఇవ్వడం లేదని తెలుస్తోంది. మహిళల కంటే పురుషుల్లో నాయకత్వ స్థానాల్లో పదోన్నతి పొందే అవకాశం 42 శాతం ఉందని నివేదిక వెల్లడిస్తోంది.
అందుకే మహిళలు వ్యాపారం వైపు..!
అలాగే పని ప్రదేశాల్లో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని.. లింక్డ్ ఇన్ లోని ఇండియా టాలెంట్ అండ్ లర్నింగ్ సొల్యూషన్స్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ తెలిపారు. అందువల్లే మహిళలు ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పారు. వ్యాపారం చేస్తున్న మహిళలు.. ఎక్కువగా సాటి ఆడవాళ్లకు పని ఇచ్చేందుకే ఆసక్తి చూపిస్తున్నారని కూడా రుచీ ఆనంద్ వివరించారు. ఎనిమిది ఏళ్ల డాటాను పరిశీలిస్తూ వస్తే.. గతంలో కంటే కూడా నాయకత్వ స్థానాల్లో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నారని చెప్పారు.
2015లో నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య 1.36గా ఉంటే ఈ ఏడు 24 శాతానికి చేరిందని వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఉన్నత స్థానాల్లో, నాయకత్వం వహించే స్థానాల్లో కూడా మహిళలు ఉంటారని రుచీ ఆనంద్ స్పష్టం చేశారు.