Indian Economy: ఇజ్రాయెల్ యుద్ధంతో ఇండియన్ ఎకానమీపై ప్రభావం ఎంత, స్టాక్ మార్కెట్లు పడతాయా?
వివాదాలు ఏర్పడినప్పుడల్లా మార్కెట్లలో పెట్టుబడిదార్ల మధ్య బేరిష్ సెంటిమెంట్ పుడుతోంది.
Israel - Hamas War Effect on Indian Economy: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రాణనష్టంతో పాటు జీవనోపాధిని కూడా దెబ్బతింది. ఒక సంవత్సరానికి పైగా ఈ రెండు దేశాల మధ్య పోరాటం కొనసాగుతోంది. ఇప్పుడు, గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనా మిలిటెంట్లు (హమాస్) ఇజ్రాయెల్‌పై దాడికి దిగారు. ఇజ్రాయెల్ మీదకు దాదాపు 5,000 రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ గ్రూప్ ప్రకటించింది.
"మేము యుద్ధంలో ఉన్నాం" అని ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించడం పరిస్థితిత తీవ్రతకు నిదర్శనం.
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి కారణంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి, లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలారు. కరోనా తర్వాత, మాద్యం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తరుణంలో ఇరుగుపొరుగు దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వాతావరణాన్ని అవి మరింత దెబ్బతీస్తున్నాయి. యుద్ధాల కారణంగా మార్కెట్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు ఆవిరికావచ్చు.
బేరిష్ సెంటిమెంట్‌తో సంపద ఆవిరి
చరిత్రను తిరగేస్తే... వివాదాలు ఏర్పడినప్పుడల్లా మార్కెట్లలో పెట్టుబడిదార్ల మధ్య బేరిష్ సెంటిమెంట్ పుడుతోంది. 2022 ఫిబ్రవరి 24న, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పుడు, ఆ వారంలో మాస్కో MOEX సూచీ దాదాపు 9% పడిపోయింది. సూచీలు కోలుకోవడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది, ఈ సమయంలో ఇన్వెస్టర్లు వందల మిలియన్ డాలర్లు కోల్పోయారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం... ఇంధనం, ఆహార ధరలపై వివరీతమైన ప్రభావం చూపింది, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిడిని వేగంగా పెంచింది. కమొడిటీ మార్కెట్ల ద్వారా ఏర్పడి స్థూల ఆర్థిక ప్రభావాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడి కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మాంద్యం పరిస్థితుల్లోకి తీసుకెళ్లాయి.
కొవిడ్ సంక్షోభం నుంచి రష్యా-ఉక్రెయన్ యుద్ధం వరకు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆహారం, నివాసం, ఉద్యోగాల మొదలు ప్రాథమిక అవసరాల వరకు అన్ని విధాలా ఇబ్బందులు, కొరత ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ, యుద్ధానికి ముందు ఉన్న దానిలో మూడో వంతుకు తగ్గిపోయింది. దాడికి దిగిన రష్యా పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటోంది, ఇది దాని ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది.
ప్రస్తుత యుద్ధం ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య సమస్యను పరిష్కరిస్తుందా?
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, శనివారం, హమాస్ గ్రూప్‌పై యుద్ధం ప్రకటించారు. ఇజ్రాయెల్ దళాలు రాత్రింబవళ్లు భీకర పోరాటం చేస్తున్నాయి, హమాస్ స్థావరాలపై బాంబులు, రాకెట్లతో విరుచుకుపడుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే రెండు వైపులా దాదాపు వెయ్యి మంది మరణించారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం 20వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైంది. ప్రపంచంలో శాశ్వతమైన ఘర్షణల్లో ఇది ఒకటి. అరబ్ దేశాలు-ఇజ్రాయెల్ మధ్య వివాదాలతో పాటు, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతి ప్రక్రియ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి, అవేమీ ప్రయత్నించలేదు.
2014లో, ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఏడు వారాల పాటు కొనసాగిన యుద్ధంలో, ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ 3.5 బిలియన్ షెకెళ్లు (shekel) దెబ్బతింది, పర్యాటక రంగానికి దాదాపు అంతే మొత్తంలో నష్టం కలిగిందని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది.
ఇండియన్ మార్కెట్లకు నష్టం!
ఈ రెండు దేశాల మధ్య యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కరోజులోనే 5% వరకు పెరిగాయి. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థలకు ఇది పిడుగుపాటు. దీనివల్ల దిగుమతి బిల్లులు పెరుగుతాయి, ఫారెక్స్ నిల్వలు తగ్గుతాయి. ఫలితంగా వాణిజ్య లోటు పెరుగుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్లు (FPIలు) కూడా పెట్టుబడులను వెనక్కు తీసుకునే అవకాశం ఉంటుంది. చరిత్రలోకి చూస్తే, ముడి చమురు రేట్లు పెరిగిప్పుడల్లా ఇండియన్ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి.
పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇతర కమొడిటీల మీద కూడా ప్రభావం చూపొచ్చు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2023లో గ్లోబల్ ఎకానమీ 2.9% వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనా వేసింది. ఇప్పుడు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల వాణిజ్యం దెబ్బతింటుంది. ఇంధన ధరలు కూడా పెరిగాయి కాబట్టి, 2.9% వృద్ధి సాధ్యమవుతుందో, లేదో చూడాలి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial