Currency note: కరెన్సీ నోటుపై రాతలుంటే ఆ నోటు చెల్లదా, RBI ఏం చెబుతోంది?
మరికొందరు ప్రజలు రకరకాల గుర్తులు వేస్తుంటారు, పేర్లు రాస్తుంటారు.
RBI Clean Note Policy: ఆర్‌బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచి తళతళలాడుతూ బయటకు వచ్చే కరెన్సీ నోట్లు, మార్కెట్‌లోకి వచ్చి నాలుగు చేతులు మారాక, వాటి రూపురేఖలు కాస్త మారుతుంటాయి. కరెన్సీ నోటు మీద ఉంటే తెల్లటి ఖాళీ స్థలంలో ఏదో ఒకటి రాయడం చాలా మందికి ఉన్న దురలవాటు. ముఖ్యంగా, కరెన్సీ నోట్లను లెక్కించే ఉద్యోగాలు చేస్తున్నవాళ్ల దగ్గర ఇలాంటి అలవాటును ఎక్కువగా చూస్తుంటాం. ఒక నోట్ల కట్టలో ఎన్ని నోట్లు ఉన్నాయో గుర్తు పెట్టుకోవడానికి, నోట్ల సంఖ్య లేదా మొత్తం విలువను ఆ కట్టలోని పై నోటుపై రాస్తుంటారు. మరికొందరు ప్రజలు రకరకాల గుర్తులు వేస్తుంటారు, పేర్లు రాస్తుంటారు.
ఇలా, కరెన్సీ నోట్ల ఏమైనా రాసి ఉంటే, ఆ నోట్లు చెల్లవా అనే ప్రశ్న అందరి మనస్సుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొత్త నోటుపై ఏదైనా రాస్తే అది చెల్లుబాటు కాదని ఆ మెసేజ్‌లో ఒక హెచ్చరిక ఉంది. కొత్త నోటుపై ఏదైనా రాస్తే ఆ నోటు విలువ సున్నా అయిపోతుందని, అలాంటి నోటు కేవలం కాగితం ముక్కగానే మిగిలిపోతుందని, మార్కెట్‌లో మార్చడానికి ఇక పనికిరాదని (Invalid Notes) ఆ సందేశంలో ఉన్న సారాంశం.
US డాలర్‌పై ఏదైనా రాస్తే అది చెల్లదని, అదే విధంగా భారతీయ కరెన్సీపై కూడా ఏదైనా రాస్తే అది చెల్లదని, ఇవి RBI కొత్త మార్గదర్శకాలుగా (RBI Guidelines for Indian Note) వైరల్ అవుతున్న సందేశంలో ఉంది.
రాతలు, గీతలున్న నోటు నిజంగానే చెల్లదా?
ఈ పరిస్థితిలో.. రాతలు, గీతలు ఉన్న నోటు కలిగి ఉన్న వ్యక్తి నష్టపోవలసిందేనా?. అసలు, సోషల్ మీడియాలో తిరుగుతున్న మెసేజ్‌లో నిజమెంత?, నిజంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఆ సందేశాన్ని విడుదల చేసిందా, జనాన్ని భయపెట్టడానికి ఎవరైనా ఆకతాయి సృష్టించిన సందేశమా? నిజానిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సదరు వార్తను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తనిఖీ చేసింది. ఆ తనిఖీలో, ఆ వార్త పూర్తిగా అబద్ధం అని PIB గుర్తించింది. ఇదే విషయంపై ట్వీట్ చేసింది. ఆర్బీఐ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ వార్త తప్పని ఆ ట్వీట్‌లో తెలిపింది. కరెన్సీ నోటుపై ఏదైనా రాసినా అది చెల్లుతుందని చెప్పింది.
Does writing anything on the banknote make it invalid❓#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) February 24, 2023
✔️NO, Bank notes with scribbling are not invalid & continue to be legal tender
✔️Under the Clean Note Policy, people are requested not to write on the currency notes as it defaces them & reduces their life pic.twitter.com/rZj3vgkzMv
కరెన్సీ నోట్ మీద రాయడం మానుకోమని విజ్ఞప్తి
క్లీన్ నోట్ విధానం ప్రకారం, కరెన్సీ నోట్లపై ఏమీ రాయవద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రజలను కోరింది. ప్రజల కష్టార్జితానికి ప్రతిరూపం ఆ కరెన్సీ నోట్లు. అలాంటి వాటిపై ఏదైనా రాస్తే, ఆ నోట్ల జీవితకాలం తగ్గిపోతుంది, అవి త్వరగా పాడైపోతాయి. అటువంటి పరిస్థితిలో, RBI వాటిని త్వరగా వెనక్కు తీసుకుని, మళ్లీ కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారీ జరగడం వల్ల ప్రజాధనం వృథా అవుతుంది.