FASTag: ఫాస్టాగ్ వసూళ్లలో ఫాస్టెస్ట్ రికార్డ్ - ఒక్కరోజులో ₹193 కోట్లు కట్టిన వాహనదార్లు
టోల్ గేట్ల వద్ద 'ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్' (RFID) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
FASTag Toll Collection: భారతదేశంలో టోల్ గేట్ వసూళ్లు రోజురోజుకు రికార్డులు సృష్టిస్తున్నాయి. మంగళవారం NHAI (National Highways Authority of India) విడుదల చేసిన డేటా ప్రకారం, ఫాస్టాగ్ (FASTag) నుంచి వచ్చిన ఆదాయం గత నెల 29న (29 ఏప్రిల్ 2023) రికార్డు స్థాయిలో రూ. 193.15 కోట్లకు చేరుకుంది. ఆ ఒక్కరోజులోనే 1.16 కోట్ల లావాదేవీలు జరిగాయి.
2021 ఫిబ్రవరిలో, నాలుగు చక్రాలు కంటే ఎక్కువున్న ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిందని NHAI ఆ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత, ఫాస్టాగ్ ప్రోగ్రామ్ కింద టోల్ ప్లాజాల సంఖ్య 770 నుంచి 1,228 కి పెరిగింది. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ టోల్ గేట్ల వద్ద 'ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్' (RFID) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
బండి ఆపాల్సిన పని లేకుండా డిజిటల్ మార్గంలో టోల్ చెల్లింపు
'ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్' సాంకేతిక కారణంగా, వాహనదార్లు టోల్ చెల్లింపు కోసం టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం లేదు. వాహనం టోల్ గేట్ దాటుతుండగానే, అంతకుముందే ఫాస్టాగ్‌కు అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా కొన్ని సెకన్లలోనే టోల్ చెల్లింపు జరుగుతుంది. వాహదారు ఖాతా నుంచి డబ్బులు కట్ అయి, టోల్ ప్లాజా యాజమాన్యం ఖాతాలోకి వెళ్లిపోతాయి. గతంలోలాగా బండిని ఆపి టోల్ చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో, ప్లాజాలు & జాతీయ రహదార్లు మీద ట్రాఫిక్ జామ్ సమస్య కూడా తగ్గింది. ఫాస్టాగ్ విధానం వచ్చిన తర్వాత స్లిప్ ద్వారా టోల్ వసూలుకు కాలం చెల్లింది. వీటన్నింటి వల్ల వాహనదార్ల చికాకులు చాలా తగ్గాయి.
ఇప్పటి వరకు 6.9 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లు జారీ
దేశవ్యాప్తంగా, ఇప్పటి వరకు దాదాపు 97 శాతం వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్ విస్తరించింది. వినియోగదార్లకు 6.9 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లు జారీ అయినట్లు (NHAI) వెల్లడించింది. హైవే వినియోగదార్లు ఫాస్టాగ్‌ని స్థిరంగా, చురుగ్గా స్వీకరించడం వల్ల టోల్ కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడింది. అంతేకాదు, జాతీయ రహదారి ఆస్తులపై మరింత ఖచ్చితమైన మూల్యాంకనం సాధ్యమైంది. తద్వారా, భారతదేశంలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, పాత వాటి విస్తరణ, ఇతర హైవే కార్యక్రమాల వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మరింత ఎక్కువ పెట్టుబడులు సాధ్యమయ్యాయి.
పార్కింగ్ ప్రదేశాల్లోనూ ఫాస్టాగ్ సాంకేతికత
ఫాస్టాగ్ కార్యక్రమాన్ని టోల్ ప్లాజాలకే పరిమితం చేయకుండా, పార్కింగ్ స్థలాలకు కూడా విస్తరించారు. ఈ సాంకేతికతను దేశంలోని 50కి పైగా నగరాల్లోని 140 కి పైగా పార్కింగ్ స్థలాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల, ఇబ్బందులు లేని & సురక్షితంగా పార్కింగ్ రుసుముల చెల్లింపు సులభతరం అయిందని NHAI తెలిపింది.
మన దేశంలో, ప్రయాణ అవాంతరాలు లేని మరింత సమర్థవంతమైన టోల్ వ్యవస్థ కోసం (free-flow tolling system) 'గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్' (GNSS) ఆధారిత వ్యవస్థను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వెల్లడించింది.