IEX: 'పపర్' తగ్గిన ఐఈఎక్స్, రెండ్రోజుల్లో 23% ఆవిరి - ఏం జరుగుతోంది?
మనం షేర్లు కొనడానికి, అమ్మడానికి ఎలాగైతే ఆర్డర్లు పెడతామో, IEXలోకి కూడా విద్యుత్ కొనడానికి, అమ్మడానికి ఆర్డర్లు వస్తాయి.
IEX Share Price: ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) షేర్లకు పవర్ కట్ అయింది. ఇవాళ (శుక్రవారం, 09 జూన్ 2023) కూడా ఈ కౌంట్ 15% నష్టపోయి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 116కి పడిపోయింది. నిన్న (గురువారం) ఈ స్టాక్ 8% పైగా క్షీణించింది. దీంతో, ఈ రెండు రోజుల్లోనే దాదాపు 23% విలువ ఆవిరైంది.
ఐఈఎక్స్ షేర్ల పతనం వెనుక ఉన్న కథ
ఐఈఎక్స్ షేర్ల పతనం వెనుకున్న ముఖ్య కారణం దాని బిజినెస్ మోడల్. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ అనేది విద్యుత్ కొనుగోలుదార్లు - అమ్మకందార్లను కలుపుతున్న ఒక ఫ్లాట్‌ఫామ్. జీరోధ, ఏంజెల్ వన్, 5పైసా వంటి ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా మనం షేర్లు కొనడానికి, అమ్మడానికి ఎలాగైతే ఆర్డర్లు పెడతామో, IEXలోకి కూడా విద్యుత్ కొనడానికి, అమ్మడానికి ఆర్డర్లు వస్తాయి. బయ్యర్, సెల్లర్ ఆర్డర్ మ్యాచ్ అయితే, ఒక నిర్ణీత ధర దగ్గర అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ధరను నిర్ణయించేది కూడా ఐఈఎక్సే. అసలు దీనికున్న బలమే స్పాట్ ప్రైస్ డిటర్మినేషన్. (spot price determination). మిగిలిన ఎక్సేంజీల నుంచి IEXను వేరు చేస్తోంది ఇదే.
ఇప్పుడు, ఆ ప్రైసింగ్ పవర్ IEX చేతుల్లోంచి వెళ్లిపోయే పరిస్థితులు వచ్చాయి. మార్కెట్ కప్లింగ్/స్పాట్ ప్రైస్ నిర్ణయించడం కోసం ఒక కేంద్రీకృత వ్యవస్థను రూపొందించాలని, పవర్ ఎక్సేంజీల రెగ్యులేటర్ CERCని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మార్కెట్ కప్లింగ్ అమల్లోకి వస్తే, IEX ఆర్డర్లను మాత్రమే మ్యాచ్ చేస్తుంది తప్ప ప్రైసింగ్ నిర్ణయించలేదు. అన్ని పవర్ ఎక్స్ఛేంజీల నుంచి బయ్, సెల్ ఆర్డర్‌లను మార్కెట్ కప్లర్ సేకరిస్తుంది. ఆపై ఆ ప్లాట్‌ఫామ్స్‌తో సంబంధం లేకుండా అన్ని ఎక్స్ఛేంజీల్లో ఒకే మార్కెట్ క్లియరింగ్ ప్రైస్‌ను తీసుకువస్తుంది. అంటే, ప్రైసింగ్ పవర్‌ను IEX కోల్పోతుంది, ఇతర ఎక్సేంజీల్లాగే మారిపోతుంది. IEXకు ఈ పరిస్థితి ఎదురవుతుందని చాలాకాలం నుంచి ఊహిస్తున్నా, కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. అయితే, మార్కెట్ కప్లర్‌ను అమల్లోకి తీసుకురావడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కాలం పట్టే అవకాశం ఉంది.
'రెడ్యూస్' రేటింగ్ ఇచ్చిన నోమురా
ఈ నేపథ్యంలో, బ్రోకరేజ్ సంస్థ నోమురా, ప్రస్తుత పరిస్థితిని "IEXకి పెద్ద ప్రతికూలం"గా పేర్కొంది. ఈ స్టాక్ రేటింగ్‌ను 'రెడ్యూస్'కు డౌన్‌గ్రేడ్ చేసింది. బ్రోకరేజ్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ రూ.127.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయానికి IEX షేర్లు 9.93% శాతం నష్టంతో రూ. 122.90 వద్ద కదులుతున్నాయి.
గత 12 నెలల కాలంలో ఈ స్టాక్ 33% పైగా క్షీణించింది. అదే కాలంలో 14% రాబడిని అందించిన నిఫ్టీ50 ఇండెక్స్‌తో పోలిస్తే అండర్‌పెర్ఫార్మ్ చేసింది. గత ఆరు నెలల కాలంలో 15%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 13% మేర IEX కౌంటర్ నష్టపోయింది.
IEX స్టాక్‌కు దూరంగా ఉండాలని మార్కెట్ ఎక్స్‌పర్ట్ సందీప్ సబర్వాల్ పెట్టుబడిదార్లకు సూచించారు.
మరో ఆసక్తికర కథనం: కిచెన్ ఖర్చు నుంచి ఊరట, తగ్గిన వంట నూనెల రేట్లు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.