e-RUPEE: ఆర్‌బీఐ ఈ-రూపీ యాప్ వచ్చేసిందోచ్ - ఎలా డౌన్‌లోడ్ చేయాలి, పేమెంట్ ప్రాసెస్ ఏంటీ?
వాలెట్ టు వాలెట్ ట్రాన్జాక్షన్స్‌కు ఉపయోగించే ఫ్లాట్‌ఫామ్ ఇది.
RBI e-RUPEE: ఆర్‌బీఐ తీసుకొచ్చిన ఈ-రూపీ లేదా డిజిటల్ రూపీ ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్ కింద రన్ అవుతోంది. ప్రస్తుతం అందరికీ యాక్సెస్ ఇవ్వలేదు, కొందరికే ఆ ఛాన్స్ దొరికింది. అయితే, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది. UPI తరహాలోనే దీనిని కూడా చాలా సింపుల్ ఉపయోగించవచ్చు.
ఈ-రూపీ అంటే ఏంటి?
ఈ-రూపీ అంటే డిజిటల్ ఫార్మాట్‌లో ఉన్న డబ్బు. ఇది క్రిప్టో కరెన్సీ కాదు. క్రిప్టో అసెట్స్‌లా దీనిని ట్రేడ్ చేయలేం. ఈ-రూపీ విలువ మారదు. మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బునే డిజిటల్ రూపంలో ఈ-రూపీ వాలెట్‌లోకి మార్చుకోవచ్చు. తద్వారా, QR కోడ్/ఫోన్ నంబర్ ఉపయోగించి ఎవరికైనా ఈజీగా డబ్బు పంపొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అయితే, ఒక ఈ-రూపీ వాలెట్ నుంచి మరొక ఈ-రూపీ వాలెట్‌కు మాత్రమే డబ్బు వెళ్తుంది, బ్యాంక్ అకౌంట్‌కు వెళ్లదు. అంటే, వాలెట్ టు వాలెట్ ట్రాన్జాక్షన్స్‌కు ఉపయోగించే ఫ్లాట్‌ఫామ్ ఇది.
ఇప్పటి వరకు, NPCIతో (National Payments Corporation of India) 21 బ్యాంక్‌లు టై-అప్ అయ్యాయి. ఈ 21 బ్యాంకుల కస్టమర్లు ఈ-రూపీ వాలెట్‌ను వినియోగించుకోవచ్చు.
ఈ-రూపీ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ-రూపీ అని సెర్చ్ చేస్తే, ప్రతి బ్యాంక్‌కు ఒక ఈ-రూపీ వాలెట్ కనిపిస్తుంది. మీ బ్యాంక్ ఈ-రూపీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు, సిమ్ నంబర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత యాప్ లాగిన్ పిన్ సెట్ చేయాలి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వొచ్చు. ఇతర డిటైల్స్ పూర్తి చేసిన తర్వాత, వాలెట్ ఎమ్‌పిన్ (mPIN) సెట్ చేయాలి. ఆ తర్వాత, మీ బ్యాంక్ అకౌంట్‌తో వాలెట్‌ను లింక్ చేయాలి. ఇక్కడితో యాప్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ముగుస్తుంది.
వాలెట్ ద్వారా డబ్బులు ఎలా పంపాలి?
యాప్ హోమ్ పేజీలో మీ పేరు, వాలెట్ బ్యాలెన్స్ కనిపిస్తాయి. వాటితో పాటే "సెండ్", "కలెక్ట్", "లోడ్", "రిడీమ్" ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలంటే "సెండ్" ఆప్షన్ ఉపయోగించాలి. దాని మీద క్లిక్ చేస్తే ఫోన్ నంబర్, QR కోడ్ బటన్స్ కనిపిస్తాయి. ఫోన్ నంబర్ ద్వారా లేదా అవతలి వ్యక్తి వాలెట్‌కు సంబంధించిన QR కోడ్‌ను స్కాన్ చేసి డబ్బులు పే చేయవచ్చు. వాలెట్ ఎమ్‌పిన్ ఎంటర్ చేస్తే పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. రిసీవర్‌కు కూడా ఈ-రూపీ వాలెట్ ఉంటేనే ఈ ట్రాన్జాక్షన్ సక్సెస్ అవుతుంది.
డబ్బులు ఎలా రిసీవ్ చేసుకోవాలి?
ఒకవేళ మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవాలనుకుంటే, మీ వాలెట్ QR కోడ్ ద్వారా తీసుకోవచ్చు. హోమ్ పేజీలో కనిపించే ప్రొఫైల్ బటమ్ మీద క్లిక్ చేస్తే, మీ వాలెట్ QR కోడ్ కనిపిస్తుంది. ఈ కోడ్‌ను అవతలి వ్యక్తికి షేర్ చేయవచ్చు. ఆ కోడ్‌ను అవతలి వ్యక్తి స్కాన్ చేసి మీ వాలెట్‌కు డబ్బులు పంపుతారు. మీరు డబ్బులు తీసుకోవడానికి "కలెక్ట్" బటన్ కూడా ఉపయోగించవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే, ఎంత రిసీవ్ చేసుకోవాలో అడుగుతుంది. ఉదాహరణకు మీరు రూ.100 ఎంటర్ చేసి జనరేట్ QR మీద ప్రెస్ చేస్తే, ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దానిని అవతలి స్కాన్ చేస్తే మీ వాలెట్‌లోకి 100 రూపాయలు వస్తాయి.
వాలెట్‌లోకి డబ్బులు ఎలా లోడ్ చేయాలి?
హోమ్ పేజీలో కనిపించే "లోడ్" ఆప్షన్ ద్వారా ఈ-రూపీ వాలెట్‌లోకి డబ్బులు లోడ్ చేయొచ్చు. వాలెట్‌తో మీ బ్యాంక్ అకౌంట్‌ను ఆల్రెడీ లింక్ చేశారు కాబట్టి, లోడ్ బటన్ నొక్కగానే, ఎంత డబ్బు లోడ్ చేయాలో అడుగుతుంది. మీ అవసరాన్ని బట్టి వాలెట్‌లోకి డబ్బులు పంపుకోవచ్చు. ఇక్కడ, అన్ని కరెన్సీ డినామినేషన్లలో డబ్బులు లోడ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఒక రూపాయి, 50 పైసల్ని కూడా లోడ్ చేయవచ్చు. అంతకన్నా తక్కువ మొత్తానికి అనుమతి లేదు. వాలెట్‌లో డబ్బులు యాడ్ కాగానే, ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది.
వాలెట్ బ్యాలెన్స్‌ను తిరిగి బ్యాంక్ అకౌంట్‌లోకి మళ్లించవచ్చా?
వాలెట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ను తిరిగి బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ కూడా చేయవచ్చు. దీనికోసం, హోమ్ పేజీలో "రిడీమ్" ఆప్షన్ ఉపయోగించాలి. బ్యాంక్ అకౌంట్‌కు పంపాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేసి, ఎంపిన్ కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు, డబ్బు వాలెట్ నుంచి మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చి చేరుతుంది.
గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ వాడినట్లే ఈ-రూపీ యాప్‌ను కూడా వాడుకోవచ్చు. కాకపోతే, బ్యాంక్ నుంచి బ్యాంక్‌కు డబ్బులు పంపలేం, వాలెట్ నుంచి వాలెట్‌కు మాత్రమే డబ్బులు పంపగలం.
ట్రాన్జాక్షన్స్‌కు ఛార్జ్ చేస్తారా?
ఈ-రూపీ వాలెట్‌లో చేసే లావాదేవీలు ప్రస్తుతానికి పూర్తి ఉచితం. డబ్బులు లోడ్ చేయడానికి, సెండ్ చేయడానికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ యాప్‌లో మీ రీసెంట్ ట్రాన్జాక్షన్స్/ట్రాన్జాక్షన్స్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. అయితే, ఆన్‌లైన్ మోసాలు జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి, ఫేక్ యాప్స్ &లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ బ్యాంక్ లాంచ్ చేసిన అధికారిక యాప్ మాత్రమే ఉపయోగించండి.
మరో ఆసక్తికర కథనం: ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ - లీజ్ హోల్డ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏది కొనాలి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial