Train Journey Rules: రైలు బయలుదేరడానికి ఎంత సమయం ముందు ఎక్కాల్సిన స్టేషన్‌ను మార్చుకోవచ్చు?
Train Boarding Station: కొంతమంది, టిక్కెట్ బుక్ చేసుకున్న స్టేషన్‌లో రైలు ఎక్కలేకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం, బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంది.
Train Boarding Station Changing Rules: భారతీయ రైల్వే (Indian Railways) ప్రపంచంలో నాలుగో అతి పెద్ద రైల్వే వ్యవస్థ. రష్యా, అమెరికా, చైనా తర్వాతి స్థానం మనదే. ఒక అంచనా ప్రకారం, మన దేశంలో, రోజుకు సగటున 2.5 కోట్ల మంది రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. రైళ్లలో రద్దీ కారణంగా, ఎక్కువ మంది ప్రయాణికులు ముందస్తుగా టిక్కెట్ రిజర్వేషన్ (Train Ticket Reservation) చేసుకున్న తర్వాతే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. రిజర్వేషన్ కోచ్‌లో జర్నీ చేసే వాళ్లకు అనేక సౌకర్యాలు లభిస్తాయి.
సాధారణంగా, మనం ఏ స్టేషన్‌లో రైలు ఎక్కుతామో అదే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేస్తుంటాం. ట్రైన్ టిక్కెట్ బుక్ (Train Ticket Booking) చేసిన తర్వాత, కొన్నిసార్లు పరిస్థితి మారిపోవచ్చు. టిక్కెట్ బుక్ చేసిన స్టేషన్ నుంచి కాకుండా మరో ప్రాంతంలో ఉన్న స్టేషన్‌లో రైలు ఎక్కాల్సిరావచ్చు. అంటే, బోర్డింగ్ స్టేషన్‌ను (Train Boarding Station) మార్చుకోవలసిన పరిస్థితి రావచ్చు. అలాంటి సిట్యుయేషన్‌లో, మీరు మీ బోర్డింగ్ స్టేషన్‌ను నిరభ్యంతరంగా మార్చుకోవచ్చు. ఇండియన్ రైల్వే రూల్స్ (Indian Railway Rules) దీనికి అంగీకరిస్తాయి. అయితే, దీనికి నిర్దిష్ట సమయం ఉంటుంది, ఆ సమయంలోగా బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవాలి.
ఎంత సమయం ముందు బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలి?
ఉదాహరణకు, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నారనుకుందాం. అంటే, మీరు హైదరాబాద్ స్టేషన్‌లో రైలు ఎక్కాలి. కానీ, ఆ సమయానికి మీరు మౌలాలిలో ఉంటారనుకుందాం. అప్పుడు, మీరు మీ బోర్డింగ్ స్టేషన్‌ను హైదరాబాద్ నుంచి మౌలాలికి మార్చుకోవచ్చు. ఇలా చేసేటప్పుడు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం... ఒరిజినల్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు మాత్రమే మీరు మీ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు.
రైలు బోర్డింగ్ స్టేషన్‌ను ఎలా మార్చాలి? (How to change train boarding station?)
మీ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చడానికి, IRCTC అధికారిక వెబ్‌సైట్ irctc.co.in లోకి వెళ్లాలి. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి లాగిన్ కావాలి. ఇప్పుడు, బుకింగ్ టికెట్ హిస్టరీపై క్లిక్ చేయాలి. మీరు రైలు స్టేషన్, రైలు నంబర్, బయలుదేరే సమయాన్ని ఎంటర్ చేయాలి. దీనికి దిగువన, బోర్డింగ్ పాయింట్‌ను మార్చే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒక డ్రాప్ డౌన్ మెను మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో, మీ ట్రైన్ ప్రయాణించే దారిలో ఉండే స్టేషన్ల పేర్లు కనిపిస్తాయి. మీరు రైలు ఎక్కాలనుకునే స్టేషన్‌ను గుర్తించి, దానిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. అంతే, మీ బోర్డింగ్ స్టేషన్ మారుతుంది. ఈ ప్రాసెస్, రైలు బయలుదేరడానికి 24 గంటల ముందే పూర్తి కావాలి.
మరో ఆసక్తికర కథనం: ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్షన్ - నిరాశ చెందొద్దు, న్యాయం జరిగే దారుంది