Gold At Home: ఇన్‌కమ్ టాక్స్ రూల్ ప్రకారం ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు?
పసిడికి సంబంధించి ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో కొన్ని రూల్స్ ఉన్నాయి.
Gold At Home - Income Tax Rule: భారతదేశంలో బంగారం అంటే కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, అవసరానికి అక్కరకొచ్చే పెట్టుబడి కూడా. మన ఆచారాల్లో పసుపు లోహం ఒక భాగం. పసిడి కొంచమైనా లేకుండా ఏ ఇంట్లోనూ శుభకార్యం జరగదు. పెట్టుబడుల విషయానికి వస్తే, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ (Investment in gold) ఒక సురక్షిత మార్గం. చాలామంది నగలు, బంగారపు బిస్కట్లు, కడ్డీల రూపంలో బంగారాన్ని కొన్ని దాచుకుంటారు.
బంగారాన్ని ఏ రూపంలో ఇంట్లో నిల్వ చేసినా, దానికి కచ్చితంగా లెక్క ఉండాల్సిందే. పసిడికి సంబంధించి ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో కొన్ని రూల్స్ ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్న బంగారం మీద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కన్ను పడకుండా ఉండాలంటే, మీరు రూల్స్ పాటించాలి.
అసలు, ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు?. నగల రూపంలో ఎంత ఉండాలి, బిస్కట్స్/కడ్డీల రూపంలో ఎంత హోల్డ్ చేయవచ్చు? ఇలాంటి విషయాల్లో ఆదాయ పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు?
వాస్తవానికి, ఇళ్లలో బంగారం దాచుకునే విషయంలో ఎలాంటి సీలింగ్ లేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సర్క్యులర్ ప్రకారం, ఒక కుటుంబం/వ్యక్తి బంగారు ఆభరణాలు కలిగి ఉండటానికి ఎలాంటి గరిష్ట పరిమితి విధించలేదు. అయితే, ఒక కండిషన్ అప్లై అవుతుంది. మీరు ఎంత బంగారం దాచుకున్నా పర్లేదు, అది ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం లెక్క చెప్పాల్సి ఉంటుంది. అంటే, మీరు కొన్న నగలు/బిస్కట్స్‌కు బిల్స్ కచ్చితంగా ఉండాలి. అంతేకాదు, ఆ గోల్డ్ కొనడానికి డబ్బు ఎలా వచ్చిందో కూడా సోర్స్ చూపించాలి. అన్నీ పక్కాగా ఉంటే మీకు ఎలాంటి చిక్కు ఉండదు. కొన్న బంగారానికి రసీదు లేకపోయినా, ఇన్వెస్ట్ చేసిన డబ్బును మీరు ఎలా ఆర్జించారో చెప్పలేకపోయినా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కన్నెర్ర చేస్తుంది.
ఒక చిన్న ఉదాహరణతో ఇంకా సింపుల్‌గా చెప్పుకుందాం. ఒక వ్యక్తి నెలకు 50 వేలు సంపాదిస్తుంటే, అతని ఏడాది ఆదాయం 6 లక్షల రూపాయలు అవుతుంది. ఐటీ రైడ్ జరిగినప్పుడు అతని ఇంట్లో రూ. 60 లక్షల విలువైన బంగారం దొరికిందనుకోండి. అప్పుడు అతని ఆదాయానికి-ఖర్చుకు పొంతన లేనట్లేగా. అప్పుడు, అంత బంగారం కొనడానికి డబ్బు ఎలా వచ్చిందో ఐటీ అధికారులకు లెక్క చెప్పాలి. ఇన్‌కమ్ సోర్స్‌కు రుజువులు చూపించలేకపోతే, ఆ గోల్డ్‌ను బ్లాక్ మనీతో కొన్నాడనో, మరొకరికి బినామీగా ఉన్నాడనో డిపార్ట్‌మెంట్ భావిస్తుంది. బంగారాన్ని సీజ్ చేసి అతనిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటుంది.
లెక్కలు చెప్పడంలో మహిళలకు మినహాయింపు
బంగారం మన మత ఆచారాలతో ముడి వేసుకున్న బంధం. కాబట్టి, రూల్స్ రూపకల్పనలో ఆచారాలను కూడా దృష్టిలో పెట్టుకున్నారు. మన దేశంలో, ఒక వివాహిత మహిళ 500 గ్రాములు/అర కేజీ బంగారం వరకు దాచుకోవచ్చు, ఐటీ డిపార్ట్‌మెంట్‌కు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అవివాహిత మహిళ 250 గ్రాములు/ పావు కేజీ గోల్డ్ దగ్గర పెట్టుకోవచ్చు. పురుషుడి విషయంలో ఈ పరిమితి 100 గ్రాములు. ఒక కుటుంబంలోని బంగారం ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా ఒక తరం నుంచి మరొక తరానికి అందుతూ వస్తుంటుంది కాబట్టి ఈ మినహాయింపు ఇచ్చారు.
మీకు బంగారం బహుమతిగా వస్తే, దానిని కొన్నవాళ్ల నుంచి రసీదులు తప్పనిసరిగా తీసుకుని దాచుకోండి. వారసత్వంగా వచ్చినట్లయితే, ఫ్యామిలీ సెటిల్‌మెంట్ డీడ్‌ను ప్రూఫ్‌గా చూపించండి.
మరో ఆసక్తికర కథనం: రైలు ప్రయాణీకులకు బిగ్ రిలీఫ్, ₹10 లక్షల ఇన్సూరెన్స్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial