Market Next Week: ఈవారం మార్కెట్ల దారెటు? సూచీల దిశ నిర్ణయించే అంశాలివే
Market News: క్యూ4 ఫలితాల ప్రకటన నుంచి అంతర్జాతీయ పరిణామాలు, కీలక గణాంకాలను పరిగణలోకి తీసుకుని ఈవారం మార్కెట్ల పనితీరుపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Stock Market Telugu News: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కొంత ఒడిదొడుకుల్లో కొనసాగిన సంగతి తెలిసిందే. రికార్డు గరిష్ఠాలకు చేరుకున్న సూచీలు ఒక్కసారిగా వారాంతంలో రివర్స్ గేర్ వేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. వాస్తవానికి ఇండెక్స్ సూచీల్లో ఎక్కువ వెయిటేజ్ కలిగి ఉన్న కంపెనీల్లో కొనసాగిన పతనం మార్కెట్లను ఎరుపెక్కించింది. దలాల్ స్ట్రీట్ బుల్ రంకెల నుంచి బేర్స్ చేతిలోకి జారిపోయిన ఘటన చూసిందే. అయితే ఈవారం మార్కెట్లు ఎలా ఉండనున్నాయి, వాటిని ప్రభావితం చేయగలిగిన విషయాల గురించి ఇన్వెస్టర్లు తెలుసుకుని మార్కెట్లలో ఎలా వ్యవహరించాలనే ప్లానింగ్ చేసుకోవటం ఉత్తమం.
ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో అన్నింటి కంటే ముఖ్యమైనది కార్పొరేట్ కంపెనీలు ప్రకటిస్తున్న మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు. వాస్తవానికి మార్కెట్లను ఎక్కువగా మార్గనిర్థేశకం చేసే అంశాల్లో ఇది ముఖ్యమైనది. దీని తర్వాత ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, స్థూల ఆర్ధిక డేటా ఈవారం మార్కెట్లకు దిశానిర్థేశం చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో రూపాయి మారకపు విలువ, క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కార్యకలాపాలను మార్కెట్లోని ఇన్వెస్టర్లు ట్రాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి నేరుగా మార్కెట్ల పనితీరుకు అద్ధం పడుతుంటాయి.
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ ప్రకారం.. ఈవారం మార్కెట్లో తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న బీపీసీఎల్, ఎల్ అండ్ టి, హీరో మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీల క్యూ4 ఫలితాలు పెద్ద ప్రభావాన్ని సృష్టిస్థాయని అన్నారు. ఇదే క్రమంలో మరో బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ ప్రకారం.. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోల్లో మార్పులు చేర్పులు చేసే విషయాన్ని నాలుగో త్రైమాసిక ఫలితాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇదే క్రమంలో యూరో ప్రాంతంలోని జీడీపీ వివరాలతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ సమీక్షపై చాలా మంది కన్నేసి ఉంచుతారని అన్నారు.
వీటికి తోడు ఇన్వెస్టర్లు ఎల్లప్పుడూ పరిశీలింతే కీలకమైన PMI డేటా, మార్చి నెల పారిశ్రామికోత్పత్తి ఈవారం వెల్లడికానున్నాయి. అలాగే యూఎస్ జాబ్ డేటా, గతవారం మార్కెట్లోకి రిలీజ్ అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్, అవెన్యూ సూపర్ మర్ట్ డీమార్ట్ ఆర్థిక ఫలితాలు మార్కెట్లలో కీలకంగా వ్యవహరిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా అన్నారు. రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్-రీసెర్చ్ అజిత్ మిశ్రా సైతం ఇండియన్ మార్కెట్లోని ఇన్వెస్టర్లు గోబల్ మార్కెట్ల పనితీరు, యూఎస్ మార్కెట్ పనితీరు, క్వార్టర్లీ రిజల్ట్స్ వంటివి పరిగణలోకి తీసుకుంటారని అన్నారు.
గతవారం మార్కెట్లు మంచి పురోగతిని సాధించినప్పటికీ రికార్డు గరిష్ఠాల వల్ల నిలవలేకపోయాయి. దీనికి నిపుణులు చెబుతున్న కారణాన్ని గమనిస్తే.. సూచీల రికార్డు ర్యాలీని చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు కొంత మేర ఉపయోగించుకున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈవారం సైతం మార్కెట్ సూచీల్లో ర్యాలీ ఉంటుందని నిపుణులు ఆశాజనకంగా ఉన్నారు. అయితే గ్లోబర్ మార్కెట్ల పనితీరు దీనికి తోడ్పాడు అందించాలని వారు అంటున్నారు.