FM Sitharaman: 'నేను హర్ట్ అయ్యాను మన్మోహన్ జీ- మీరు ఇలా అంటారని ఊహించలేదు'
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ద్రవ్యోల్బణం రెండంకెల్లో ఉండేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
నరేంద్ర మోదీ సర్కార్‌పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ద్రవ్యోల్బణాన్ని భారీగా పెంచిన ప్రధానిగా మన్మోహన్ సింగ్‌ను గుర్తుపెట్టుకుంటామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కరోనా సంక్షోభంలోనూ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని రాజకీయాల కోసం మన్మోహన్ సింగ్ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని నిర్మలా ఆరోపించారు.
మన్మోహన్ విమర్శలు
నకిలీ జాతీయవాదాన్ని భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. దేశాన్ని విభజన రాజకీయాల వైపు భాజపా నడిపిస్తుందన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ తరఫున నిన్న వర్చువల్‌గా ప్రచారం నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కూడా మన్మోహన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతి విషయానికి దేశ చరిత్రను, పూర్వ ప్రధానులను నిందించడం ప్రధాని మోదీకి తగదని మన్మోహన్ హితవు పలికారు.
" కరోనా సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం తప్పుడు పాలసీలను అమలు చేసింది. ఓవైపు పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఏడున్నర ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ సామాన్యుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించలేక నెహ్రూపై నిందలు వేస్తోంది. "