DGCI Notice: టాటా 1mg, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు నోటీసులు - మ్యాటర్ సీరియస్
నోటీసుకు సమాధానం చెప్పడానికి ఆయా సంస్థలకు రెండు రోజుల గడువు ఇచ్చింది.
DGCI Notice: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 20 ఈ-ఫార్మా కంపెనీలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (Drug Controller General of India - DCGI) నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940ని ఉల్లంఘించినందుకు నోటీసులు పంపింది. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిషేధించాలని కోరుతూ వివిధ కోర్టుల్లో అనేక కేసులు ఉన్నాయని డీజీసీఐ వీజే సోమాని ఆ నోటీసులో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయా కంపెనీల మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని కోరారు.
ఏయే కంపెనీలకు నోటీసులు?
నిబంధనలను ఉల్లంఘిస్తే టాటా 1ఎంజీ (Tata 1mg), ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ (Flipkart Health+), అమెజాన్ (Amazon) సహా 20 కంపెనీలకు డీజీసీఐ షోకాజ్ నోటీసు (Show Cause Notice) జారీ చేసింది. ఆ నోటీసు విషయం గురించి ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు.
చెల్లుబాటు అయ్యే DGCI లైసెన్స్ లేకుండా ఆన్‌లైన్, ఇంటర్నెట్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఔషధాల విక్రయం లేదా నిల్వ చేయడం లేదా ప్రదర్శించడం లేదా పంపిణీకి ఆఫర్ చేయడం వల్ల డ్రగ్స్ నాణ్యతపై చెడు ప్రభావం ఉంటుందని, ప్రజల ఆరోగ్యానికి అది ప్రమాద కారణంగా మారుతుందని డ్రగ్ రెగ్యులేటర్‌లో తన నోటీసులో పేర్కొంది. సొంతంగా మందులు ఆర్డర్ చేసి వాడడం వల్ల ఔషధాల దుర్వినియోగం అవుతాయని, విచక్షణారహిత వినియోగం పెరుగుతుందని వివరించింది.
రెండు రోజుల్లో సమాధానం
ఆన్‌లైన్, ఇంటర్నెట్ ద్వారా మందులను విక్రయించిన 20 కంపెనీలకు నోటీసులు పంపిన DCGI, ఆ నోటీసుకు సమాధానం చెప్పడానికి ఆయా సంస్థలకు రెండు రోజుల గడువు ఇచ్చింది. డీజీసీఐ ఇచ్చిన నోటీసుపై ఈ రెండు రోజుల గడువులోగా సదరు సంస్థలు స్పందించకపోతే, అడిగిన విషయం గురించి వాటి వద్ద సమాధానం లేదని డీజీసీఐ భావించవచ్చు. తర్వాత చట్ట ప్రకారం డీజీసీఐ తగిన చర్యలు తీసుకుంటుందని సోమానీ చెప్పారు.
డీజీసీఐ ద్వారా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ తీసుకోకుండా ఈ మూడు ఈ-ఫార్మసీలు ఆన్‌లైన్ ద్వారా మందులను విక్రయిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం దిల్లీ హైకోర్టు గుర్తించింది, ఈ విషయంలో చర్య తీసుకోవాలని డ్రగ్ కంట్రోలర్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలను కూడా డీజీసీఐ తన నోటీసులో పేర్కొంది.
ఇ-ఫార్మసీలకు పంపిన నోటీసు కాపీలో "లైసెన్సు లేకుండా ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయించిన కారణంగా మీపై నిషేధం విధించాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆన్‌లైన్ అమ్మకాలను తక్షణమే ఆపేయాలని ఆదేశిస్తున్నాం" అని ఉంది. దిల్లీ హైకోర్టు ఆదేశాలను పాటించాలని తాము సూచించిన తర్వాత కూడా ఈ-ఫార్మసీలు లైసెన్స్ లేకుండా ఆన్‌లైన్‌లో మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించామని DGCI తెలిపింది.
డ్రగ్స్ రూల్స్, 1945లోని రూల్ 62 ప్రకారం, ఒక ఔషధాన్ని ఒకటి కంటే ఎక్కువ చోట్ల విక్రయించాలని లేదా నిల్వ చేయాలని భావిస్తే, దానికి సంబంధించిన లైసెన్స్ కోసం లైసెన్సింగ్ అథారిటీకి విడిగా దరఖాస్తు చేసుకోవాలని DCGI తన లేఖలో సూచించింది.
భారతదేశంలో ఔషధాలను ఆన్‌లైన్ ద్వారా గానీ, ఆఫ్‌లైన్ ద్వారా గానీ విక్రయించాలంటే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌ను పొందడం తప్పనిసరి.