Smartphone: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై బోలెడన్ని డిస్కౌంట్‌లు - ఎక్కడ కొనాలంటే?
China Subsidies: దేశీయ వినియోగాన్ని పెంచేందుకు స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌ఫోన్లపై సబ్సిడీ ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. కార్లు, గృహోపకరణాలపై ఇప్పటికే ఇక్కడ రాయితీలు అందుతున్నాయి.
Chinese Government Subsidies On Smartphones And Smartwatches: జేబులో స్మార్ట్ ఫోన్, చేతికి స్మార్ట్ వాచ్.. యువత నుంచి వృద్ధుల వరకు ఈ పరికరాలు అవసరంగా మారాయి. కమ్యూనికేషన్, హెల్త్, రిమైండర్స్ సహా చాలా రకాల అవసరాలకు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు, పొరుగు దేశం చైనాలో స్మార్ట్‌ఫోన్‌లు & స్మార్ట్‌వాచ్‌లు కొనుగోలు చేయడం మరింత చకవగా మారింది.
వాస్తవానికి, కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇతర దేశాల కంటే చైనా చాలా ఆలస్యంగా కోలుకుంది. వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చయి, అప్పుల పాలైన చైనీయులు.. అన్నపానీయాలకు తప్ప ఇతర అవసరాల కోసం వ్యయం చేయడానికి వెనుకాడారు. దీంతో డ్రాగన్ కంట్రీ వృద్ధి రేటు అథమ స్థాయికి పడిపోయింది. ఈ సమస్యను అధిగమించేందుకు పారిశ్రామిక ఉద్దీపన ప్యాకేజీలను చైనా ప్రభుత్వం ప్రకటిస్తోంది. తాజాగా, స్మార్ట్‌ఫోన్‌లు & ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై సబ్సిడీ ఇస్తోంది. దేశీయ వినియోగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం, చైనాలో కార్లు & గృహోపకరణాలపై సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం, చైనా ప్రభుత్వం సబ్సిడీల పరిధిని పెంచి.. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఉత్పత్తులకు విస్తరించింది. ఈ నిర్ణయం వల్ల ఆయా కంపెనీలు విక్రయాలను పెంచుకోగలవని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
చాలా కాలం ఒకే స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న చైనీయులు
కరోనా దెబ్బకు కంగారు పడిన చీనీ ప్రజలు అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి, ఎక్కువ కాలం పాటు ఒకే స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఫోన్ కింద పడి పలిగిపోతే రబ్బర్ బ్యాండ్లు వేసుకుని వాడుకుంటున్నారు తప్ప కొత్త ఫోన్లు కొనట్లేదట. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లపై సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల షావోమి (Xiaomi), హువావే (Huawei) వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీల అమ్మకాలను పెంచడమే కాకుండా, అలీబాబా (Alibaba), జేడీ (JD) వంటి ప్లాట్‌ఫారమ్‌ల వ్యాపారాన్ని కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
కష్టాలు పెంచిన అమెరికా ఆంక్షలు
ప్రపంచ వాణిజ్య రంగంపై ఆధిపత్యం కోసం.. చైనా, అమెరికా మధ్య చాలా కాలంగా వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో, చాలా చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో చైనీయుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడింది. స్మార్ట్‌ఫోన్‌లపై సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించడం ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంగా మార్కెట్ పరిగణిస్తోంది.
Huawei భారీ డిస్కౌంట్లు
ప్రీమియం సెగ్మెంట్‌లో విక్రయాలు పెంచుకునేందుకు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హువావే, తన మోడల్స్‌పై భారీ తగ్గింపులు అందిస్తోంది. Huawei ప్రీమియం ఫోన్ Pura 70 Ultra (1TB) ఇప్పుడు దాదాపు రూ. 1.06 లక్షలకు అందుబాటులో ఉంది, లాంచ్ చేసిన సమయంలో దీని ధర రూ. 1.28 లక్షలు. అదే విధంగా, ఫోల్డబుల్ ఫోన్ Mate X5పై 19 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది, డిస్కౌంట్ తర్వాత దాని ధర రూ. 1.23 లక్షలకు తగ్గింది.
చైనాలో, ప్రీమియం ఫోన్‌ల సెగ్మెంట్‌లో ఆపిల్ (Apple)ది ప్రథమ స్థానం. ఆ తర్వాత, 33 శాతం మార్కెట్ వాటాతో Huawei రెండో అతి పెద్ద కంపెనీ.
మరో ఆసక్తికర కథనం: దొంగచాటుగా మాటలు విన్న 'సిరి' దొరికిపోయింది - రూ.800 కోట్లు ఇచ్చేందుకు ఆపిల్ 'సై'