Interim Budget 2024: 57 నిమిషాల బడ్జెట్ ప్రసంగం - అతి పెద్ద బడ్జెట్ ప్రసంగం ఏదంటే?
Budget 2024: విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని 57 నిమిషాల్లోనే ముగించారు. ఇప్పటివరకూ చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అతి తక్కువ సమయం.
Smallest Budget Speech of Nirmala Sitharaman: దేశంలో ఎన్నికల ముందు కీలకమైన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్ - 2024ను (Interim Budget 2024) ప్రజల ముందు ఉంచారు. అయితే, నిర్మలమ్మ కేంద్ర పద్దును ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. ఈసారి బడ్జెట్ ప్రసంగాన్ని (Budget Speech) ఆమె గంటలోపే అంటే 57 నిమిషాల్లోనే ముగించారు. కాగా, ఆమె ఇప్పటివరకూ చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అతి తక్కువ సమయం. తన ప్రసంగంలో 5,246 పదాలను ఉపయోగించారు.
అదే సుదీర్ఘ ప్రసంగం
పార్లమెంటులో ఎక్కువసార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా, అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు సైతం నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ.. ఆమె ఏకంగా 162 నిమిషాల (2 గంటల 42 నిమిషాలు) పాటు ప్రసంగించారు. అయితే, ఆ సమయంలో ఆమె ఒంట్లో నలతగా ఉండడంతో మరో 2 పేజీలు మిగిలుండగానే ప్రసంగాన్ని ముగించారు. కాగా, దేశ బడ్జెట్ చరిత్రలో అదే ఇప్పటివరకూ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా కొనసాగుతోంది. అందులో కొత్త ఆదాయపు పన్ను శ్లాబులు, ఎల్ఐసీఐపీవో, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాలపై ఆమె ప్రసంగించారు. 2019 - 20 బడ్జెట్ లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతి పెద్ద బడ్జెట్ స్పీచ్ గా నిలిచింది.
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాలు
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019లో 137 నిమిషాల్లో (2 గంటల 17 నిమిషాలు) బడ్జెట్ ప్రసంగం ముగించారు.
- 2020లో 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు)
- 2021లో 110 నిమిషాలు (ఒక గంట 50 నిమిషాలు)
- 2022లో 93 నిమిషాలు (గంట 33 నిమిషాలు)
- 2023లో 87 నిమిషాలు (గంట 27 నిమిషాలు)
- 2024లో మధ్యంతర బడ్జెట్ 57 నిమిషాల్లో తన బడ్దెట్ ప్రసంగాన్ని ముగించారు.
నిర్మలమ్మ రికార్డు
2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ, పూర్తిస్థాయి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన తొలి మహిళగా ఘనత సాధించారు. అదే ఏడాది కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె ఈ రికార్డు సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970 - 71లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఇందిరా గాంధీ కీర్తి గడించారు. ఆ టైంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని మోరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ మరో రికార్డు నెలకొల్పారు.