Bank Locker: బ్యాంక్ లాకర్‌లో డబ్బు దాస్తున్నారా, RBI కొత్త రూల్ గురించి తెలుసా?
లాకర్ వినియోగించుకుంటున్న ఖాతాదార్లతో "కొత్త నిబంధనలతో కూడిన ఒప్పందాలను" బ్యాంకులు కుదుర్చుకోవాలి.
Bank Locker: మీకు బ్యాంక్ లాకర్ ఉండి, మీరు సంబంధిత బ్యాంక్‌తో ఇంకా కొత్త అగ్రిమెంట్ చేసుకోకపోతే తక్షణం ఆ పని పూర్తి చేయండి. బ్యాంక్ లాకర్ కొత్త నిబంధనలకు సంబంధించిన అగ్రిమెంట్ గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల పొడిగించింది.
బ్యాంక్ లాకర్లకు సంబంధించి, 2021 ఆగస్టు 8న రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసింది. లాకర్ వినియోగించుకుంటున్న ఖాతాదార్లతో "కొత్త నిబంధనలతో కూడిన ఒప్పందాలను" బ్యాంకులు కుదుర్చుకోవాలి. ఇందుకు రూ.200 స్టాంప్ పేపర్లపై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాలని ఖాతాదార్లకు RBI సూచించింది. దీనికి, 2023 జనవరి 1ని గడువుగా గతంలో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అయితే... కొత్త ఒప్పందంపై పెద్ద సంఖ్యలో కస్టమర్లు సంతకాలు చేయలేదని తేలడంతో, కొత్త అగ్రిమెంట్ చేసుకోవాల్సిన గడువును 2023 డిసెంబరు 31కి పొడిగించింది. ఇందుకోసం, దశల వారీ కార్యక్రమాన్ని బ్యాంకులను సూచించింది.
లాకర్ ఒప్పందాలపై దశల వారీ కార్యక్రమం:
కొత్త అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరాన్ని 2023 ఏప్రిల్ 30 లోపు ప్రతి ఖాతాదారుకు బ్యాంక్‌లు తెలియజేయాలి.
2023 జూన్ 30 కల్లా 50 శాతం లాకర్ వినియోగదార్లతో బ్యాంకులు ఒప్పందాలు పూర్తి చేయాలి.
2023 సెప్టెంబరు 30 నాటికి 75 శాతం మందితో ఒప్పందాలు పూర్తి కావాలి.
2023 డిసెంబరు 31 నాటికి 100 శాతం ఒప్పందాలు పూర్తి కావాలి.
లాకర్ నిబంధనల మార్పు గురించి కస్టమర్లకు SMS, ఇతర మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయాలి.
లాకర్ కొత్త ఒప్పందంలో ఏం ఉంది?
కొత్త ఒప్పందం ప్రకారం.. లాకర్‌లో వినియోగదారు దాచుకున్న వస్తువులు పాడైతే బ్యాంకుదే బాధ్యత. ఏదైనా నష్టం జరిగితే బ్యాంకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు మోసం వల్ల ఖాతాదారు నష్టపోతే, లాకర్ అద్దెకు 100 రెట్లు బ్యాంకుకు చెల్లించాలి. బ్యాంకులు ఖాతాదారులకు ఖాళీ లాకర్ల జాబితా, వెయిటింగ్ లిస్ట్‌ను చూపించాలి. లాకర్లు ఉంచే చోట సరైన భద్రత ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలి. లాకర్ తీసుకున్న కస్టమర్ మరణిస్తే, నామినీకి ఆ లాకర్ సౌకర్యం లభిస్తుంది.
లాకర్‌లో ఏవి దాయకూడదు?
కస్టమర్‌కే కాదు, ప్రభుత్వాలకు & బ్యాంక్‌లకు అనుకూలంగా కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవసరమైన సందర్భంలో లాకర్‌లోని వస్తువులను చట్టబద్ధ సంస్థలు స్వాధీనం చేసుకోవచ్చు. బ్యాంకు లాకర్‌లో డబ్బు దాచుకోవడం ఇకపై నిషిద్ధం. డబ్బుతో పాటు... ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, పాడైపోయే పదార్థాలు లేదా వస్తువులు, రేడియో ధార్మిక పదార్థాలు, బ్యాంక్ లేదా ఖాతాదార్లకు హాని లేదా ఇబ్బంది కలిగించే పదార్థాలు లేదా వస్తువులను దాచకూడదు.
బంగారం వంటి విలువైన వస్తువులు లేదా పత్రాలను ఖాతాదార్లు లాకర్లలో దాచుకోవచ్చు.
లాకర్ కేటాయించే సమయంలోనే వినియోగదార్ల పూర్తి వివరాలను నమోదు చేయాలని బ్యాంకులకు RBI సూచించింది. ఒకవేళ ఖాతాదారు పాత వ్యక్తే అయి ఉండి, అతని వివరాలు ఏమీ మారకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని బ్యాంకు తీసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం ఖాదాదారును బ్యాంకుకు పిలవాల్సిన అవసరం లేదు. ఈ-మెయిల్, రిజిస్టర్డ్ సెల్‌ఫోన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ మార్గాల్లో ఫారం తీసుకుంటే సరిపోతుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.