(Source: ECI/ABP News/ABP Majha)
18 Carat Gold: 24k, 22k వద్దట - 18 క్యారెట్ల నగలే ముద్దట!
Today's Gold Rates: పెళ్లి నగలది మొత్తం మార్కెట్‌లో దాదాపు 50-55% వాటా.
18 Carat Gold Price in India: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం, బంగారు ఆభరణాల కొనుగోళ్లలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం ఇండియా. మన మార్కెట్‌లో గోల్డ్ జ్యువెలరీకి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆభరణాల మీద అధిక మోజు చూపే దేశాల్లో చైనాది ఫస్ట్ ప్లేస్.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్క ప్రకారం, సాదా (ఎక్కువ నగిషీలు లేని) బంగారు ఆభరణాలు మన దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. మొత్తం మార్కెట్‌లో వాటి వాటా దాదాపు 80 -85%. అంటే, సగటున 100 ఆభరణాల్లో దాదాపు 85 ఆభరణాలు సాదా డిజైన్‌తోనే ఉంటున్నాయి. వీటిలోనూ ఎక్కువ భాగం 22 క్యారెట్ల (22k gold) బంగారానిది. సంప్రదాయకంగా 22 క్యారెట్ల బంగారాన్ని ప్రజలు ఎక్కువగా కొంటుంటారు. 18 క్యారెట్ల (18k gold) నగల మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. రోజూ ధరించే నగల మార్కెట్‌లో ఇప్పుడు వీటి వాటా దాదాపు 40-45%కు చేరింది. ఇక, పెళ్లి నగలది మొత్తం మార్కెట్‌లో దాదాపు 50-55% వాటా.
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో లెక్కిస్తారు. 24 క్యారట్ల (24k gold) బంగారం అంటే సంపూర్ణ స్వచ్ఛమైనదని అర్ధం. అందులో బంగారం తప్ప వేరే ఏ లోహం కలవలేదని అర్ధం. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ఖరీదు ఎక్కువ. 24 క్యారెట్ల బంగారంలో ఏ ఇతర లోహం కలవదు కాబట్టి అది మృదువుగా ఉంటుంది. అందువల్ల ఆభరణాల తయారీకి దానిని ఉపయోగించరు. నాణేలు, కడ్డీలు, బిస్కట్ల రూపంలోనే వాటిని ఉంచుతారు.
22 క్యారెట్ల బంగారు ఆభరణాల్లో 22 భాగాలు బంగారం, మిగిలిన రెండు భాగాల్లో వెండి, రాగి, జింక్, నికెల్ వంటి ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారాన్ని 916 బంగారం అని కూడా అంటారు. అంటే, ప్రతి 100 గ్రాముల్లో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం, మిగిలిన భాగంలో ఏదైనా ఇతర లోహం ఉంటుంది.
23 క్యారెట్ల (23k glod) గోల్డ్ కూడా ఉంటుందని చాలా మందికి తెలీదు. ఇది 958 బంగారం. ప్రతి 100 గ్రాముల్లో 95.8 గ్రాముల స్వచ్ఛమైన బంగారం, మిగిలిన భాగంలో ఇతర లోహం కలిసి ఉంటుంది. అంటే, 23 పాళ్లు బంగారం, మిగిలిన ఒక పాలు ఇతర ఏదైనా లోహం ఉంటుంది.
18 క్యారెట్ల బంగారం మీద పెరిగిన మక్కువ
18 క్యారెట్ల బంగారం అంటే, అందులో 75% బంగారం, 25% ఇతర మెటల్స్ ఉంటాయి. ప్రతి 18 గ్రాముల 18k బంగారంలో... 13.5 గ్రాములు బంగారం ఉంటుంది. మిగిలిన 4.5 గ్రాముల్లో రాగి, వెండి లేదా నికెల్ వంటి ఇతర లోహాలు కలిసి ఉంటాయి. 18 క్యారెట్ల బంగారాన్ని 750 గోల్డ్‌గానూ వ్యవహరిస్తారు. ఇవి కాకుండా, 14k, 10k గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది.
నగ మెత్తబడకుండా, విరగకుండా ఇతర లోహాలు కలుపుతారు. దీనివల్ల ఆ ఆభరణం ఎక్కువ కాలం మన్నుతుంది. రోజువారీ ధరించడానికి 18k ఆభరణాలను ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. 22k నగలతో పోలిస్తే వాటి ధర తక్కువ కావడం, సింపుల్‌గా కనిపించడం దీనికి కారణం. ప్రత్యేక సందర్భాల కోసం 22k ఆభరణాలను ప్రజలు కొంటున్నారు.
18 క్యారెట్ల బంగారం ధర
ఈ రోజు (గురువారం, 09 నవంబర్ 2023), 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర ₹330 తగ్గి ₹45,570 వద్ద ఉంది. 10 గ్రాముల 22k గోల్డ్ రేటు ₹400 తగ్గి ₹55,700 వద్ద ఉంది. 24k బంగారం ధర ₹440 తగ్గి ₹60,760 వద్ద ఉంది.
మరో ఆసక్తికర కథనం: పండుగ ముందు భారీ పతనం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial