News
News
వీడియోలు ఆటలు
X

Sadhguru Writes: వ్యవసాయంపై ఫోకస్‌ పెడితే భారతదేశం ప్రపంచానికి “అక్షయ పాత్ర కాగలదు”: సద్గురు

FOLLOW US: 

సద్గురు: మన దేశం ప్రపంచ "అన్నదాత"గా మారగల భాగ్యాన్ని కలిగి ఉంది. ఎందుకంటే, అందుకు అవసరమైన వాతావరణ, నేల, ఇంకా వాతావరణ పరిస్థితుల వైవిధ్యం మన దేశంలో పుష్కలంగా ఉంది; అన్నింటికీ మించి, మట్టిని ఆహారంగా మార్చే ఈ అద్భుత ప్రక్రియను గురించి, లోతైన అవగాహన సహజంగానే ఉన్న జనాభా మన వద్ద ఉన్నారు.

దురదృష్టవశాత్తు, మనకు అన్నం పెట్టే రైతు పిల్లలు మాత్రం ఆకలితో అలమటించడం, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చవిచూస్తున్నాం. మేము జరిపిన కొన్ని మౌలికమైన సర్వేల ద్వారా తెలిసింది ఏంటంటే, కనీసం రెండు శాతం మంది రైతులు కూడా తమ పిల్లలు వ్యవసాయం చేపట్టాలని కోరుకోవడం లేదు. ఇంకో 25 ఏళ్ల తర్వాత, అంటే వీరి తరం తరవాత, మన కోసం ఆహారాన్ని ఎవరు పండిస్తారు? ఈ దేశంలో వ్యవసాయం మనగలగాలి అంటే, మనం దాన్ని లాభదాయకంగా చేసి తీరాలి.

ఇలా చేయటానికి అతిపెద్ద ఆటంకం భూకమతాలు - వారికున్న పొలాలు చాలా చిన్నవి. ప్రస్తుతం, సగటున వారికున్న భూమి ఒక హెక్టార్ లేదా 2.5 ఎకరాలు, దానితో పనికొచ్చేదేమీ చేయలేము. రైతులను పేదరికం ఇంకా మరణం వైపు నెడుతున్న రెండు ప్రధాన సమస్యలు - నీటిపారుదల వసతుల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇంకా మార్కెట్‌లో బేరసారాలు చేయగల శక్తి లేకపోవడం. పెద్ద స్థాయిలో వ్యవసాయం చేస్తే తప్ప ఈ రెండు అంశాలూ పరిష్కారం కావు.

ప్రస్తుతం, దేశంలో అత్యంత విజయవంతమైన రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO)ల్లో ఒకటైన వెల్లియంగిరి ఉలవన్‍కు మేము సహకారం అందిస్తున్నాము. ఈ FPO సుమారు 1400 మంది రైతులను ఒకే తాటి పైకి తెచ్చింది, దాంతో వారి ఆదాయాలు అమాంతం పెరిగాయి.


ఇది మేము FPOని ప్రారంభించడానికి నాలుగు సంవత్సరాల ముందు అనుకుంటా, వక్కల వ్యాపారి తన లారీతో గ్రామానికి వచ్చేవాడు. తను వచ్చినప్పుడు, ఒక కిలో వక్కలకు, చిన్న కుప్ప ఉన్న చిన్న రైతుకు రూ. 24 చొప్పున, ఇంకొంచెం పెద్ద కుప్ప ఉన్న మధ్య స్థాయి రైతుకు రూ. 42 చొప్పున, భారీ కుప్ప ఉన్న పెద్ద వక్క రైతుకు రూ. 56 చొప్పున ఇచ్చేవాడు - అదే రోజు, అదే ఉత్పత్తికి. చిన్న రైతులు బేరం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్లు, “సరే ఉంచుకో” అని వెళ్ళిపోయే వాళ్ళు. ఈ చిన్న రైతుకు తన ఉత్పత్తిని అమ్మే మార్గం ఉండేది కాదు. తన ఉత్పత్తిని తీసుకుని మరెక్కడికో వెళ్లి అమ్మాలంటే అది మరీ ఖర్చుతో కూడుకున్న పని, అలాగే వ్యాపారులందరికీ తమ తమ పొత్తులు ఉంటాయి, ఇతని వద్ద ఎవరూ కొనరు.

కాబట్టి FPO ఏర్పడిన తర్వాత, మేము అందరి ఉత్పత్తులను ఒకే చోటకు చేర్చాము. వెంటనే రైతులకు సగటున కిలోకు రూ. 72–రూ. 73 రావడం మొదలయ్యింది. ఇది వారి జీవితాన్నే మార్చేసింది. అప్పుడు మేము విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మొదలైన వ్యవసాయానికి అవసరమైన ఉత్పత్తుల కోసం ఒక స్టోర్‍ని ప్రారంభించాము. సాధారణంగా డీలర్లు తీసుకునే ఆ కనీస 30 శాతం మార్జిన్, ఇప్పుడు నేరుగా రైతులకు వెళ్తోంది. అంటే పెట్టుబడిలో 30 శాతం తగ్గింది. మేము పరిష్కరించిన మరో విషయం - వక్క చెట్లను ఎక్కి వక్కలు కోసే వ్యక్తుల్ని గుర్తించడం. ఎవరిని పడితే వాళ్ళని చెట్లు ఎక్కమనలేం; అలా చేస్తే వారి ప్రాణానికే ప్రమాదం. ఈ నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ గుర్తించి, ప్రతి పొలానికి వాళ్ళు ఎప్పుడు వెళ్లాలో షెడ్యూల్ చేశాం. ఇక ఇప్పుడు, రైతులు వాళ్ళ కోసం తిరగాల్సిన పని లేదు. ఆ ప్రయాస అంతా పోయింది.

వ్యవసాయంలో మౌలికమైన మార్పులు తెచ్చేందుకు పరిష్కారం

ప్రభుత్వం, దేశంలో 10,000 ఎఫ్‌పిఓలు రావాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది. 10,000 FPOలు మంచి విషయమే, కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక FPOలో సామూహిక పొలం(congruent land) గల 10,000 మంది రైతులు ఉండాలి. లేకపోతే, మనం మార్కెటింగ్ ఇంకా సేకరణల విషయంలో చిన్న చిన్న ఉపాయాలు చేయవచ్చు కానీ మౌలిక విషయాలను మార్చలేము. ఎందుకు?

ప్రస్తుతం, రైతులు ప్రతిరోజూ తమ పొలాలకు వెళ్లడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తాము యజమానులని నిరూపించుకోవడం కోసం. లేదంటే, ఎవరో ఒకరు సరిహద్దు రాళ్లను కొద్దిగా జరిపి, ఆ స్థలాన్ని తమ పొలంలో కలిపేసుకుంటారు. రెండోది, నీటిపారుదల కోసం ఎలక్ట్రిక్ పంపును ఆన్ చేయడం ఇంకా ఆఫ్ చేయడం కోసం.

సామూహిక పొలం (congruent land)ఏర్పడితే, డిజిటల్ సర్వే చేసి, అందరికీ ఒకేసారి శాటిలైట్ల ద్వారా హద్దులు నిర్ణయించే కంపెనీలు ఉన్నాయి. పొలంలో ఎలాంటి మార్కింగ్ ఉండాల్సిన అవసరం లేదు, అలాగే ఇక దాన్ని ఎవరూ మార్చలేరు. ఒకసారి మనం అలా చేస్తే, అది తమ భూమి అని నిరూపించుకోవడానికి వారు ప్రతిరోజూ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనం చేయగల మరో అంశం సమగ్ర వ్యవసాయం. ప్రస్తుతం ప్రతి 2-5 ఎకరాలకూ ఒక బోరు బావి, విద్యుత్‌ కనెక్షన్‌, ఇంకా ముళ్ల కంచె ఉన్నాయి. ఇది వనరులను భయంకరంగా వ్యర్థం చేయడమే. 10,000–15,000 ఎకరాలు ఒకటిగా అయితే, నీటిపారుదల సమర్దవంతమైన పద్ధతిలో చేయవచ్చు. వివిధ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు తమ సేవలను అద్దె ప్రాతిపదికన అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. అంటే రైతు పెట్టుబడి పెట్టాల్సిన పని కూడా లేదు, నీళ్లు వందల బోరు బావుల నుంచి రావాల్సిన అవసరం లేదు. బహుశా 10-25 బోరు బావులతో మొత్తం ప్రదేశానికి నీరందించవచ్చు.

ఈ రెండు విషయాలను మనం పరిష్కరిస్తే - రైతు వెళ్లి, అది తమ భూమి అని నిరూపించుకోవాల్సిన అవసరం లేకుంటే, ప్రతిరోజూ వెళ్లి నీటి పంపును ఆన్ చేయనవసరం లేకుంటే - అప్పుడు రెండు పంటలు సమర్థవంతంగా పండించటానికి, రైతు తన పొలానికి సంవత్సరంలో కేవలం 60-65 రోజులు వెళ్తే సరిపోతుంది. దేశంలోని 6 కోట్లకు పైగా ప్రజల చేతులకు కనీసం 300 రోజుల పాటు ఖాళీ సమయం దొరుకుతుంది. అప్పుడు అనుబంధ పరిశ్రమ గొప్పగా ఉంటుంది.

అనేక విధాలుగా, వెల్లియంగిరి ఉలవన్ వ్యవసాయ కుటుంబాలలోని మహిళలకు చాలా వరకూ ఖాళీ సమయం దొరుకుతోంది, ఎందుకంటే అనవసరంగా గ్రామంలోకి వెళ్లి పనులు నిర్వహించడం తగ్గింది. అందుకే ఈ ఆడవాళ్ళంతా కలసి మసాలాలు(condiments)చేయడం మొదలుపెట్టారు. ఆ మసాలా(condiments) వ్యాపారం విలువ ఇప్పుడు దాదాపు వ్యవసాయ ఉత్పత్తులకు సమానంగా ఉంది.

వ్యవసాయం కోసం తమ జీవితాలను పణంగా పెట్టేవాళ్లు, కనీసం పట్టణంలో ఒక డాక్టరు, లాయరు, లేదా ఇంజనీరు సంపాదించేంత సంపాదించగలగాలి అనేదే నా ఉద్దేశం, లేదంటే వచ్చే 25-30 ఏళ్లలో ఎవరూ వ్యవసాయం చేయాలనుకోరు.

ప్రస్తుతం, ప్రపంచ జనాభాలో మనది 17 శాతం. ప్రపంచంలో ఉన్న మరో 10-40 శాతం మందికి మనం సులభంగా ఈ నేల నుండి ఆహారం అందించగలము. ఇది అంతటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం ఆ సామర్థ్యాన్ని అన్వేషిస్తామా లేదా అనేది అతి పెద్ద ప్రశ్న, కానీ FPO అనేది అది చేయడానికి మార్గం.

భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన యాభై మంది వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంటున్న సద్గురు ఒక యోగి, ఆధ్యాత్మికవేత్త, దార్శనికుడు మరియు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత. అసాధారణమైన మరియు విశిష్టమైన సేవలు అందించినందుకుగానూ, భారత ప్రభుత్వం 2017లో సద్గురుకు, ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం - పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. 390 కోట్ల ప్రజల్ని తాకిన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమమైన ‘చైతన్యవంతమైన ప్రపంచం - మట్టిని రక్షించు’ ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు.

[ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు, ఫోరమ్ భాగస్వాములు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అభిప్రాయాలు, నమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపవు. ]

Published at : 01 Apr 2023 09:39 AM (IST) Tags: sadhguru India at 2047 Sadhguru column Breadbasket Of The World India agriculture

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు