టాటా మోటార్స్ 2026 లాంచ్ ప్లాన్: పంచ్ ఫేస్‌లిఫ్ట్ నుంచి నెక్ట్స్ జెన్ నెక్సాన్ వరకు
2026లో, టాటా మోటార్స్ భారత మార్కెట్‌లోకి పంచ్ ఫేస్‌లిఫ్ట్, సియెర్రా ఎలక్ట్రిక్, నెక్స్ట్ జెన్ నెక్సాన్ మోడళ్లను పంపబోతోంది. ధరలు, ఫీచర్లు, టైమ్‌లైన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Upcoming Tata Cars In 2026: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా మోటార్స్ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే కొత్త సియెర్రా SUVను ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్‌తో లాంచ్ చేసిన టాటా, 2026 కోసం కూడా భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాదిలో పంచ్ ఫేస్‌లిఫ్ట్ (Punch facelift), సియెర్రా ఎలక్ట్రిక్ (Sierra EV), నెక్స్ట్ జెనరేషన్ నెక్సాన్ (next-gen Nexon) వంటి కీలక మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ మూడు వాహనాలు వేర్వేరు సెగ్మెంట్లలో లాంచ్ కానున్నాయి.
2026 Tata Punch facelift
లాంచ్ టైమ్: 2026 ప్రారంభంలో
అంచనా ధర: ₹6 లక్షల నుంచి ₹9.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)
2026లో టాటా లాంచ్ లైనప్‌కు నాయకత్వం వహించేది పంచ్ ఫేస్‌లిఫ్ట్. 2024లో క్యామోఫ్లాజ్ రూపంలో కనిపించిన ఈ మోడల్, డిజైన్ పరంగా పెద్ద మార్పులతో రానుంది. పంచ్ ఎలక్ట్రిక్‌ను పోలిన కనెక్టెడ్ లైట్ బార్, ఆధునిక బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేసిన వెనుక భాగం ఇందులో ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి.
ఇంటీరియర్‌ను కూడా టాటా మరింత అప్‌గ్రేడ్ చేయనుంది. ప్రస్తుతం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌కు తోడు ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కూడా ALFA ప్లాట్‌ఫామ్‌పైనే కొనసాగుతుంది. 1.2 లీటర్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లలో మార్పులు ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
2026 Tata Sierra EV
లాంచ్ టైమ్: 2026 మొదటి త్రైమాసికం
అంచనా ధర: ₹16 లక్షల నుంచి ₹25 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)
టాటా సియెర్రాకు పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా త్వరలో రానుంది. కంపెనీ అధికారికంగా 2026 మొదటి త్రైమాసికంలో సియెర్రా ఎలక్ట్రిక్ లాంచ్‌ను నిర్ధారించింది. ఈ వాహనం రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
ఈ ఎలక్ట్రిక్ SUV, Argos ప్లాట్‌ఫామ్‌పై తయారవుతోంది. స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ కారణంగా డ్యూయల్ మోటార్ సెటప్‌కు మద్దతు లభిస్తుంది. డిజైన్ పరంగా ICE మోడల్‌ను పోలినప్పటికీ, ముందు భాగంలో బ్లాంక్‌డ్ ఆఫ్ గ్రిల్‌తో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 55kWh, 65kWh బ్యాటరీ ప్యాక్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
2026 next-generation Tata Nexon
లాంచ్ టైమ్: 2026 చివర్లో
అంచనా ధర: ₹8 లక్షల నుంచి ₹17 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)
టాటా నెక్సాన్ భారత మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన SUVలలో ఒకటి. ఇప్పుడు టాటా, ‘గరుడ్’ కోడ్ నేమ్‌తో నెక్స్ట్ జెన్ నెక్సాన్‌పై పని ప్రారంభించింది. ఈ మోడల్ 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో షోరూమ్‌లకు వచ్చే అవకాశం ఉంది.
ఈ కొత్త నెక్సాన్ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌కు మారనుంది, తద్వారా ప్రస్తుత మోడల్ చేసిన దాదాపు పదేళ్ల ప్రయాణానికి ముగింపు పలుకుతుంది. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ రెండింటిలోనూ భారీ మార్పులు ఉంటాయి. ఇంజిన్ విషయంలో 1.2 లీటర్ పెట్రోల్, CNG కొనసాగుతాయని అంచనా. డీజిల్ వెర్షన్‌పై మాత్రం స్పష్టత లేదు, ఎందుకంటే BS7 నిబంధనల కారణంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది.
ప్రారంభంలో నెలకు 12,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో మార్కెట్‌లోకి రావచ్చు. తర్వాత డిమాండ్ పెరిగితే ఉత్పత్తి మరింత పెంచే అవకాశం ఉంది. తగిన సమయంలో నెక్సాన్ ఎలక్ట్రిక్‌కూ అప్‌డేట్ ఇవ్వనున్నారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















