లేటెస్ట్ కార్ అయినా ఫీచర్ల లోటే! New Kia Seltos లో మిస్ అయిన ఫీచర్ల లిస్ట్
New Kia Seltos లేటెస్ట్ మిడ్‌సైజ్ SUV అయినా, ప్రత్యర్థి కార్లు ఇస్తున్న కొన్ని కీలక ఫీచర్లు ఇందులో లేవు. 3 స్క్రీన్ సెటప్ నుంచి పవర్డ్ టెయిల్‌గేట్ వరకు పూర్తి వివరాలు ఈ కథనంలో.

New Kia Seltos Features: 2025 చివరి భాగంలో మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్ హాట్ టాపిక్‌గా మారింది. Maruti Suzuki Victoris, Tata Sierra లాంచ్‌లు, కొత్త జనరేషన్ కియా సెల్టోస్ (new-generation Kia Seltos) ఆవిష్కరణతో ఈ సెగ్మెంట్‌పై అందరి దృష్టి పడింది. ఈ మూడింటిలో తాజాగా వచ్చిన SUV కియా సెల్టోస్... పూర్తిగా కొత్త ఎక్స్‌టీరియర్, కొత్త ఇంటీరియర్, ఆధునిక టెక్నాలజీతో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. కానీ… లేటెస్ట్ అయినప్పటికీ, ప్రత్యర్థి మోడళ్లు అందిస్తున్న కొన్ని ముఖ్యమైన కన్వీనియన్స్ ఫీచర్లు ఇందులో కనిపించవు.
1) నిజమైన 3-స్క్రీన్ సెటప్ లేదు
కొత్త కియా సెల్టోస్‌లో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉందని కంపెనీ చెబుతోంది. కానీ వాస్తవానికి ఇది పూర్తి స్థాయి 3-స్క్రీన్ అనుభూతిని ఇవ్వదు. ఇందులో 12.3 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 12.3 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే మధ్యలో 5 అంగుళాల చిన్న స్క్రీన్ ఉంది. ఈ చిన్న స్క్రీన్ క్లైమేట్ కంట్రోల్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే, అదే AC సెట్టింగ్స్‌ను మెయిన్ స్క్రీన్, డ్యాష్‌బోర్డ్ బటన్లతో కూడా మార్చుకోవచ్చు. దీంతో ఆ చిన్న స్క్రీన్ అవసరం లేదన్న భావన కలుగుతుంది.
దీనికి భిన్నంగా... టాటా సియెరా ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రత్యేక 12.3 అంగుళాల స్క్రీన్ ఇస్తోంది. అందులో వీడియో స్ట్రీమింగ్, గేమ్స్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.
2) పవర్డ్ కో-డ్రైవర్ సీటు లేదు
డ్రైవర్ సీటు విషయంలో సెల్టోస్ చాలా రిచ్‌గా ఉంది. 10-వే పవర్డ్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేషన్, మెమరీ ఫంక్షన్ ఉన్నాయి. కానీ కో-డ్రైవర్ సీటు మాత్రం మాన్యువల్ అడ్జస్ట్‌మెంట్‌తోనే వస్తుంది.
ఇదే సెగ్మెంట్‌లోని Hyundai Creta, Skoda Kushaq, Volkswagen Taigun లాంటి SUVలు పవర్డ్ కో-డ్రైవర్ సీటు ఇస్తున్నాయి.
3) బాస్ మోడ్ ఫీచర్ మిస్
హ్యుందాయ్ క్రెటా టాప్-స్పెక్ కింగ్ వేరియంట్లలో ఉన్న ఎలక్ట్రానిక్ బాస్ మోడ్ కొత్త కియా సెల్టోస్‌లో లేదు. ఈ ఫీచర్ ఉంటే వెనుక సీట్లో కూర్చున్నవారు ముందు ప్యాసింజర్ సీటును ఎలక్ట్రిక్‌గా ముందుకు జరిపి ఎక్కువ లెగ్‌రూమ్ పొందగలరు. టాటా సియెరాలో కూడా ఇలాంటి ఫీచర్ ఉంది, అయితే అది మాన్యువల్‌గా పని చేస్తుంది.
4) వెనుక ప్రయాణికులకు వైర్‌లెస్ ఛార్జర్ లేదు
క్రెటా కింగ్ వేరియంట్‌లో వెనుక సీట్లో కూర్చున్నవారికి వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఇస్తారు. అది రియర్ AC వెంట్స్ దగ్గర అమర్చారు. కానీ కొత్త సెల్టోస్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ముందు సీట్లకే పరిమితం. వెనుక ప్రయాణికులకు టైప్-C USB పోర్టులు మాత్రమే ఉన్నాయి.
5) పవర్డ్ టెయిల్‌గేట్ లేదు
ఇప్పుడిప్పుడే మిడ్‌సైజ్ SUVల్లో ట్రెండ్‌గా మారుతున్న "పవర్డ్ టెయిల్‌గేట్ విత్ జెశ్చర్ కంట్రోల్" సెల్టోస్‌లో లేదు. మారుతి విక్టోరిస్, టాటా సియెరా, టాటా కర్వ్ లాంటి మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
6) పడ్డిల్ ల్యాంప్స్ కూడా లేవు
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదటి జనరేషన్ సెల్టోస్‌లో ఉన్న పడ్డిల్ ల్యాంప్స్ కొత్త మోడల్‌లో కనిపించవు. 2023 ఫేస్‌లిఫ్ట్ తర్వాత ఈ ఫీచర్‌ను తొలగించారు. అయితే టాటా సియెరా, హ్యుందాయ్ క్రెటా లాంటి ప్రత్యర్థులు ఇప్పటికీ ఈ ఫీచర్‌ను అందిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే…
కొత్త కియా సెల్టోస్ డిజైన్, టెక్నాలజీ, బ్రాండ్ ఇమేజ్ పరంగా బలంగా ఉన్నా, కొన్ని చిన్న ఉపయోగకరమైన ఫీచర్ల లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఫీచర్లే మొదటి ప్రాధాన్యంగా చూసేవాళ్లు సెల్టోస్‌తో పాటు దాని ప్రత్యర్థి కార్లను కూడా పోల్చుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















