Speed 400 కంటే పవర్‌ఫుల్‌గా Triumph Tracker 400 - కొత్తగా ఏమేం ఇచ్చారు?
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్, 400సీసీ పోర్ట్‌ఫోలియోలో New Tracker 400ను ఆవిష్కరించింది. Speed 400 కంటే ఎక్కువ పవర్, ఫ్లాట్ ట్రాక్ స్టైల్ డిజైన్‌తో 2026 మోడల్‌గా యూకేలో లాంచ్ కానుంది.

Triumph Tracker 400 Price and Specs: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్, తన స్మాల్ కెపాసిటీ బైక్‌ల శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. తాజాగా, గ్లోబల్ మార్కెట్ల కోసం ట్రయంఫ్ ట్రాకర్ 400ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బైక్ 2026 మోడల్‌గా UKలో లాంచ్ కానుంది. ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ నుంచి ప్రేరణతో రూపొందిన ఈ ట్రాకర్ 400.. Triumph 400cc మోడర్న్ క్లాసిక్స్ లైనప్‌లో పూర్తిగా కొత్త బాడీ స్టైల్‌తో నిలుస్తోంది.
ట్రాకర్ 400, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Speed 400, Scrambler 400, అలాగే తాజాగా ఆవిష్కరించిన Thruxton 400 మోడళ్ల సరసన చేరింది. అయితే డిజైన్, ఇంజిన్ ట్యూనింగ్, రైడింగ్ పొజిషన్ పరంగా ఇది స్పీడ్ 400కు మరింత దగ్గరగా ఉంటుంది.
ఇంజిన్ & పనితీరు
ఈ బైక్‌లో ట్రయంఫ్ TR-సిరీస్ 398cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 9,000rpm వద్ద 42hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్పీడ్ 400తో పోలిస్తే ఇది 2hp ఎక్కువ పవర్ ఇస్తుంది. టార్క్ మాత్రం అదే స్థాయిలో 37.5Nmగా కొనసాగుతోంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
బరువు & చాసిస్
యూకే స్పెసిఫికేషన్ ప్రకారం ట్రాకర్ 400 కెర్బ్ వెయిట్ (ఫ్యూయల్, ఇతర ఆయిల్స్ లేకుండా) 173 కిలోలు. ఇది స్పీడ్ 400 కంటే సుమారు 3 కిలోలు ఎక్కువ. చాసిస్ జియోమెట్రీలో కూడా స్వల్ప మార్పులు చేశారు. ట్రాకర్ 400లో 24.4 డిగ్రీల రేక్ యాంగిల్ ఉండగా, స్పీడ్ 400లో ఇది 24.6 డిగ్రీలుగా ఉంటుంది. ఈ చిన్న మార్పు బైక్‌కు మరింత షార్ప్ హ్యాండ్లింగ్ ఇవ్వడంలో సహాయపడుతుంది.
వీల్స్, బ్రేకులు
ఈ బైక్ ముందు, వెనుక రెండింటికీ 17 ఇంచుల వీల్స్ ఉపయోగించారు. వెనుక వైపు 150 సెక్షన్ టైర్ అమర్చారు. బ్రేకింగ్ విషయంలో స్పీడ్ 400తో పోలిక ఉంది. ముందు వైపు 300 మిల్లీమీటర్ల డిస్క్, వెనుక వైపు 230 మిల్లీమీటర్ల డిస్క్ ఇస్తున్నారు.
సీటింగ్ & ఎర్గోనామిక్స్
ట్రాకర్ 400లో 805 మిల్లీమీటర్ల సీట్ హైట్ ఉంది. ఇది స్పీడ్ 400లోని 790 మిల్లీమీటర్ల కంటే కొద్దిగా ఎక్కువ. దీంతో రైడింగ్ పొజిషన్ స్పోర్టీగా ఉంటుంది.
డిజైన్ ప్రత్యేకతలు
డిజైన్ పరంగా ట్రాకర్ 400 పూర్తిగా ఫ్లాట్ ట్రాక్ స్పూర్తితో రూపొందింది. బాక్సీ ఫ్యూయల్ ట్యాంక్, చిన్న ఫ్లైస్క్రీన్, నంబర్ బోర్డ్ తరహా సైడ్ ప్యానెల్స్, కలర్ కోడెడ్ సీట్ కౌల్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో ఉన్న సింపుల్ రెక్టాంగ్యులర్ LED టెయిల్ లైట్, సీట్ డిజైన్ మాత్రం Thruxton 400కు దగ్గరగా ఉంటాయి.
భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది?
ట్రాకర్ 400ను యూకేలో ఆవిష్కరించినప్పటికీ, భారత్‌లో ఈ మోడల్‌ను లాంచ్ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం.. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400లపైనే ట్రయంఫ్ ఇండియా ఎక్కువగా దృష్టి పెట్టింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















