Toyota Urban Cruiser EV: టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ, మారుతి సుజుకి ఇ-విటారా - రెండిట్లో ఏది ముందు వస్తుంది?
Maruti Suzuki Vs Toyota: మారుతి సుజుకి ఇ-విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీల్లో ఏది ముందు లాంచ్ అవుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
Toyota Urban Cruiser EV vs Maruti Suzuki e Vitara: కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఒకదాని తర్వాత ఒకటి 2025లో లాంచ్ కానున్నాయి. వీటిలో టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ, మారుతి సుజుకి ఇ-విటారా కార్లు ఉన్నాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ కొంచెం చిన్నది. ఇది ఇటీవల లాంచ్ అయిన సుజుకి ఇ-విటారాతో చాలా పంచుకుంటుంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ, ఇ-విటారా ఒకే విధంగా ఉంటాయి. కానీ 2700 మిల్లీమీటర్ల వీల్‌బేస్‌తో విభిన్న ముఖాలను కలిగి ఉన్నాయి. వాటి ఇంటీరియర్లు కూడా చాలా సారూప్యంగా ఉంటాయి కానీ రంగులు భిన్నంగా ఉంటాయి. అయితే ఫీచర్లు మాత్రం ఒకే విధంగా ఉంటాయని భావిస్తున్నారు. మారుతి సుజుకి ఇ-విటారాను టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ కంటే ముందుగానే లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మారుతి సుజుకి ఇ-విటారా వచ్చే నెలలో జరిగే ఇండియా మొబిలిటీ షోలో విడుదల కానుంది. నివేదికల ప్రకారం మారుతి విటారా లాంచ్ తర్వాత టయోటా తన ఈవీని భారతదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
క్యాబిన్ డిజైన్ గురించి చెప్పాలంటే మనం ఇంతకు ముందు చూసిన ఇతర మారుతి, టయోటా కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్ నుంచి 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ వరకు రెండింటి క్యాబిన్ డిజైన్‌లో చాలా పోలికలు ఉన్నాయి.
ఇది కాకుండా టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీలో ఆటో హోల్డ్, డ్రైవ్ మోడ్‌లు, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లతో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అందించారు.
రెండిటిలో మరిన్ని పోలికలు
ఇది మాత్రమే కాకుండా టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్, మోటార్ కూడా ఇ-విటారా తరహాలోనే ఉంటుంది. అర్బన్ క్రూయిజర్ 49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ సెల్స్‌ను పొందుతుంది. చిన్న బ్యాటరీతో కూడిన అర్బన్ క్రూయిజర్ 144 హెచ్‌పీ పవర్‌ని, 189 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయగలదు. దీంతో పాటు కంపెనీ త్వరలో ఒక పెద్ద వేరియంట్‌ను లాంచ్ చేయనుంది. ఇది 61 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పవర్‌ని పొందుతుంది. ఇది 65 హెచ్‌పీ రియర్ యాక్సిల్ మౌంటెడ్ మోటార్‌ను పొందుతుంది. ఏడబ్ల్యూడీ రూపంలో అర్బన్ క్రూయిజర్ మొత్తం అవుట్‌పుట్ 184 హెచ్‌పీ, 300 ఎన్ఎం టార్క్‌గా ఉంది.