(Source: Poll of Polls)
Tata Nexon సెన్సేషన్ - Creta, Dzire ను వెనక్కి నెట్టి దేశంలో నంబర్ 1 పొజిషన్
Most Selling Car September 2025: సెప్టెంబర్‌లో, దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి & హ్యుందాయ్‌లను అధిగమించి టాటా నెక్సాన్ నిలిచింది. టాప్ 10 కార్ల పూర్తి అమ్మకాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.

Tata Nexon Most Selling Car In September 2025: సెప్టెంబర్ 2025 నెల టాటా మోటార్స్‌కు ఒక చారిత్రాత్మక ఘట్టంలా నిలిచింది. ఈ కంపెనీ పాపులర్ SUV Tata Nexon, గత నెల (సెప్టెంబర్ 2025)లో అనూహ్యంగా వేగాన్ని అందుకుంది, 22,573 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది & దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. గత సంవత్సరం, సెప్టెంబర్ 2024లో, నెక్సాన్ 11,470 యూనిట్లను విక్రయించింది, ఇప్పుడు దానికి దాదాపు డబుల్ కార్లు అమ్ముడుపోయాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో నెక్సాన్ సేల్స్‌లో 97% వృద్ధి నమోదైంది. ఏ ఏడాదిలోనైనా, ఇది టాటా నెక్సాన్ అత్యుత్తమ నెలవారీ అమ్మకాలు నంబర్. ఇది టాటా మోటార్స్ మార్కెట్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసింది.
ప్రభావం చూపిన పండుగ సీజన్ & GST కోత
పండుగ సీజన్ ప్రారంభం & GST 2.0 పన్ను తగ్గింపు కారణంగా భారత ఆటో రంగం సెప్టెంబర్ 2025లో వృద్ధిని సాధించింది. మార్కెట్ మొత్తంలో వృద్ధి సంవత్సరానికి 5.5%. మొత్తం టోకు అమ్మకాలు 3,78,457 యూనిట్లు. గత ఏడాది, సెప్టెంబర్ 2024లో 3,58,879 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారతీయుల్లో SUVలు & కాంపాక్ట్ SUVలకు వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ను ఈ డేటా స్పష్టంగా చూపిస్తుంది. టాటా, మహీంద్రా & మారుతి ఈ విభాగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
పెరిగిన మారుతి డిజైర్ & హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు
టాటా నెక్సాన్ తర్వాత, Maruti Suzuki Dzire సెప్టెంబర్ 2025లో 20,038 యూనిట్లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే నెలలో డిజైర్ 10,853 యూనిట్లను విక్రయించింది, ఈసారి దాదాపు 85% వృద్ధిని నమోదు చేసింది. మూడో స్థానంలో Hyundai Creta ఉంది, దీని అమ్మకాలు 18,861 యూనిట్లు. ఈ సంఖ్య గత సంవత్సరం 15,902 యూనిట్ల నుంచి 19% పెరిగాయి. క్రెటా వరుసగా మూడో నెల కూడా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది, ఇది హ్యుందాయ్ బలమైన మార్కెట్ ఉనికిని ప్రదర్శిస్తుంది.
Mahindra Scorpio & Tata Punch పరిస్థితి
మహీంద్రా స్కార్పియో సెప్టెంబర్ 2025లో 18,372 యూనిట్లు అమ్ముడైంది. ఇది గత సంవత్సరం ఇదే నెల కంటే 27% పెరుగుదలను చూసింది. ఈ SUV ముఖ్యంగా గ్రామీణ & సెమీ-అర్బన్ మార్కెట్లలో అత్యంత ప్రజాదరణ పొందింది. టాటా పంచ్ కూడా దాని కాంపాక్ట్ సైజు & భద్రతా లక్షణాల కారణంగా బాగా పని చేసింది. కారు అమ్మకాలు సెప్టెంబర్ 2024లో 13,711 యూనిట్లతో పోలిస్తే ఈసారి 15,891 యూనిట్లుగా ఉన్నాయి - ఇది దాదాపు 16% వృద్ధి.
టాప్ 10లో మారుతి మోస్ట్ సెల్లింగ్ కార్లు
టాటా & మహీంద్రా SUV విభాగంలో పుంజుకుంటున్నప్పటికీ, మారుతి సుజుకి ఇప్పటికీ బలమైన పట్టును కొనసాగిస్తున్న విషయం గమనించాలి. ఈ కంపెనీకి చెందిన అనేక మోడళ్లు (స్విఫ్ట్ (15,547 యూనిట్లు), వ్యాగన్ఆర్ (15,388 యూనిట్లు), ఫ్రాంక్స్ (13,767 యూనిట్లు), బాలెనో (13,173 యూనిట్లు) & ఎర్టిగా MPV (12,115 యూనిట్లు)) టాప్ 10 సెల్లింగ్ కార్ల లిస్ట్‌లో ఉన్నాయి. ఫ్రాంక్స్ అమ్మకాలు 1% స్వల్పంగా తగ్గాయి & ఎర్టిగా అమ్మకాలు 31% తగ్గాయి, స్విఫ్ట్ & బాలెనో ఇప్పటికీ మారుతి నమ్మకమైన సిటీ కార్లుగా చెలామణీ అవుతున్నాయి.





















