Tata Nexon EVని ఎందుకు ఎగబడి కొంటున్నారు? ఈ కారులో జనానికి నచ్చిన 5 కారణాలు
2020లో ప్రారంభమైన Tata Nexon EV ఒక లక్ష అమ్మకాల మైలురాయిని దాటింది. భద్రత, రేంజ్, ధర, డిజైన్, పయనీర్ అడ్వాంటేజ్ వంటి అంశాలు దీనిని భారత మార్కెట్లో సక్సెస్ చేశాయి.

Tata Nexon EV Price And Features: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో Tata Nexon EV ఒక చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. 2020లో మార్కెట్లోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV, ఇప్పటివరకు 1 లక్షకు పైగా యూనిట్లు అమ్మింది. భారత్‌లో ఈ ఘనత సాధించిన మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్‌గా ఇది నిలిచింది. టాటా మోటార్స్ మొత్తం EV అమ్మకాల్లో నెక్సాన్ ఈవీది కీలక పాత్ర.
ప్రస్తుతం టాటా మోటార్స్ భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 66 శాతం వాటా కలిగి ఉంది. అంటే భారత్‌లో అమ్ముడయ్యే ప్రతి మూడు ఎలక్ట్రిక్ కార్లలో రెండు టాటా కంపెనీకి చెందినవే. Tiago EV, Tigor EV, Punch EV, Nexon EV, Curvv EV, Harrier EVలతో టాటా దేశంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల లిస్ట్‌ను నిర్వహిస్తోంది. వీటిలో అమ్మకాల పరంగా Nexon EV నంబర్ వన్‌గా నిలుస్తోంది.
Tata Nexon EV ఒక లక్ష అమ్మకాలు దాటడానికి టాప్ 5 కారణాలు ఇవే:
1. పయనీర్ అడ్వాంటేజ్
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ చాలా తక్కువగా ఉన్న సమయంలో, 2020లోనే Nexon EVను టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది దేశంలోనే తొలి దేశీయంగా అభివృద్ధి చేసిన మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ SUV. టాటా గ్రూప్ కంపెనీలతో కలిసి uniEVerse ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసి, ఛార్జింగ్ నెట్‌వర్క్, సపోర్ట్ సర్వీసులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచింది.
2. భద్రతపై సంపూర్ణ నమ్మకం
Tata Nexon EVకు Global NCAP, Bharat NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. హై స్ట్రెంగ్త్ స్టీల్ బాడీ షెల్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ESC వంటి ఫీచర్లు కుటుంబ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఎలక్ట్రిక్ అయినా భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదనే భావన దీనికి భారీ అమ్మకాలు తెచ్చింది.
3. రేంజ్ భయం తగ్గింది
ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రధాన ఆందోళన రేంజ్. Nexon EV ఈ సమస్యను చాలా వరకు తగ్గించింది. 30 kWh బ్యాటరీతో 325 కి.మీ, 45 kWh బ్యాటరీతో 489 కి.మీ. వరకు రేంజ్ అందిస్తోంది. నగరంలో ప్రయాణాలకు, నగరాల మధ్య ప్రయాణాలకు ఇది అనువైన ఎంపికగా మారింది.
4. డిజైన్, టెక్నాలజీ ఆకర్షణ
నెక్సాన్ EV డిజైన్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్, 10.25 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, JBL ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ప్రీమియం ఫీల్‌ను ఇస్తాయి. V2L, V2V వంటి ఆధునిక టెక్నాలజీలు దీనిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
5. ధరకు తగ్గ విలువ
Tata Nexon EV ధర రూ.12.49 లక్షల నుంచి రూ.17.19 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ ధరలో అందించే ఫీచర్లు, తక్కువ రన్నింగ్ ఖర్చు (కిలోమీటర్‌కు సుమారు రూ.1–1.5), తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు దీనిని విలువైన ఎంపికగా మార్చాయి.
భద్రత, రేంజ్, టెక్నాలజీ, ధర, పయనీర్ అడ్వాంటేజ్ కలిసి Tata Nexon EVను భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో ఒక లక్ష అమ్మకాల మైలురాయిని దాటించాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















