Fact Check: టాటా కంపెనీ కేవలం రూ.18 వేలకే హైబ్రిడ్ బైక్ తెచ్చిందా?, వైరల్ వార్తల వెనుకున్న నిజాలు బయటకు
Tata Hybrid Bike Facts: కేవలం 18 వేల రూపాయలకు టాటా హైబ్రిడ్ బైక్ వచ్చింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉంది? టాటా కంపెనీ అసలు స్పందన ఏమిటి?.

Tata Hybrid Bike News Update: టాటా అనే పేరు భారతదేశంలో నమ్మకం, బలం, భద్రతకు ప్రతీక. కార్ల నుంచి స్టీల్ వరకు, నానో వంటి సామాన్యుడి కారు నుంచి లగ్జరీ ప్రొడక్ట్స్ వరకు - టాటా గ్రూప్ ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగింది. అందుకే టాటాకు సంబంధించిన ఏ చిన్న వార్తయినా ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం అలాంటి వార్తే సోషల్ మీడియాను కుదిపేస్తోంది. “టాటా కంపెనీ కొత్త హైబ్రిడ్ బైక్‌ను విడుదల చేసింది... ధర కేవలం 18 వేల రూపాయలు మాత్రమే!” అనే పోస్టులు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
ఫోటోలు కూడా చక్కగా ఎడిట్ చేసి, టాటా లోగో పెట్టి షేర్ చేయడం వల్ల చాలామంది ఈ వార్తను నిజమని నమ్మేశారు. కొందరు అయితే బైక్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటూ ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో... ఈ వైరల్ వార్తలో నిజం ఎంత? టాటా నిజంగా ద్విచక్ర వాహన మార్కెట్లోకి అడుగు పెట్టిందా? ఇదిగో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వైరల్ వార్త ఏమంటోంది?
సోషల్ మీడియాలో తిరుగుతున్న పోస్టుల ప్రకారం, టాటా కంపెనీ 125cc సామర్థ్యం గల ఒక కొత్త హైబ్రిడ్ బైక్‌ను తయారు చేసింది. ఈ బైక్ సామాన్య ప్రజల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు & దాని ధర కేవలం 18,000 రూపాయలు మాత్రమే అని వైరల్ పోస్టులు చెబుతున్నాయి. పైగా, బలంగా ఉన్నట్లుగా కనిపించే బైక్ ఫోటోల్నీ అవే పోస్టుల్లో జత చేశారు. 'టాటా నానో' తరహాలో తక్కువ ధరలో ఈ బైక్‌ను విడుదల చేసినట్లు చెప్పడంతో ప్రజలు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఈ రూమర్ హైప్ పెరిగింది.
వైరల్ కథనాల వెనుక నిజం ఏమిటి?
ఈ వార్త పూర్తిగా తప్పుడు సమాచారం. టాటా కంపెనీ ఇలాంటి బైక్‌ను విడుదల చేయలేదు. ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళిక కూడా కంపెనీ వద్ద లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, బైక్ ఇమేజ్‌లు అన్నీ ఎడిట్ చేసిన ఫేక్ పోస్టులు అని వెల్లడైంది.
టాటా మోటార్స్ కూడా దీనిపై స్పష్టంగా స్పందించింది. అధికారికంగా ఇచ్చిన క్లారిటీ ఏంటంటే:
- టాటా ప్రస్తుతం ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి రావడం లేదు
- వైరల్ బైక్ పోస్టులు అవాస్తవాలు
- కంపెనీ ఏ హైబ్రిడ్ బైక్‌ను తయారు చేయలేదు
వైరల్ వార్తలన్నీ తప్పుడు ప్రచారం అని టాటా మోటార్స్ తన అధికారిక ప్రకటనతో ఖరారు చేసింది.
ఇలాంటి ఫేక్ వార్తలు ఎందుకు వస్తుంటాయి?
ప్రముఖ బ్రాండ్ల పేర్లను ఉపయోగించి తప్పుడు సమాచారం పంచడం కొత్త విషయం కాదు. సోషల్ మీడియాలో ఎవరైనా ఫోటో మార్చి, కొత్త డిజైన్ జత చేసి, ఆకర్షణీయమైన ధర చెబితే చాలామంది ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే షేర్ చేస్తారు. ఫేక్ న్యూస్ పెరగడానికి ఇదే ప్రధాన కారణం. టాటా వంటి నమ్మకమైన బ్రాండ్ పేరు ఉండటం ఈ రూమర్‌కి మరింత వేగం తీసుకొచ్చింది.
కేవలం 18 వేల రూపాయలకు టాటా హైబ్రిడ్ బైక్ వచ్చింది అనే వార్త పూర్తిగా అబద్ధం. సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు, పోస్టులు నిజమైనవి కావు. టాటా కంపెనీ కూడా ఈ వార్తలను ఖండించింది. అందువల్ల ఇలాంటి వైరల్ పోస్టులను చూసినప్పుడు అధికారిక సమాచారం వచ్చిన తర్వాతనే నమ్మడం మంచిది.
మీ సేఫ్టీ, మీ డబ్బు, మీ సమాచారం - ఇవన్నీ ముఖ్యం. కాబట్టి ఫేక్ న్యూస్‌కి బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.






















