టోల్‌గేట్ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్ ట్రావెల్స్!
NHAI డిజిటల్ లోకల్ టోల్ పాస్‌ను 121 ప్లాజాలకు విస్తరించింది. నెలకు రూ.350తో పొందే ఈ పాస్‌కు అర్హత, దరఖాస్తు విధానం, ప్రయోజనాలు తెలుసుకోండి.

How To Apply For NHAI's New Rs 350 Monthly Toll Pass: టోల్ ప్లాజాల నుంచి నిత్యం ప్రయాణించే వాహనదారులకు NHAI గుడ్‌న్యూస్ చెప్పింది. తరచూ టోల్ చెల్లించే స్థానిక ప్రయాణికుల కోసం అందుబాటులో ఉన్న డిజిటల్ లోకల్ పాస్ సదుపాయాన్ని దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాలకు విస్తరించింది. దీంతో, అర్హత ఉన్న వాహనదారులు ఇక టోల్ ప్లాజాకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో పాస్ పొందొచ్చు.
ఈ లోకల్ పాస్ ద్వారా, నిర్దేశిత టోల్ ప్లాజాల నుంచి నెల రోజుల పాటు ఎన్నిసార్లైనా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం నెలవారీ లోకల్ పాస్ కొనాలి, దీనికోసం రూ.350 చెల్లించాలి. అయితే ఈ సదుపాయం అన్ని వాహనాలకు వర్తించదు. కేవలం నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ పాస్ ఎవరికి ఇస్తారు?
టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానికులకు మాత్రమే ఈ పాస్ జారీ చేస్తారు, వాళ్లు మాత్రమే తమ వాహనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు నాన్ కమర్షియల్ వాహనాలను మాత్రమే ఉపయోగిస్తుండాలి. అలాగే సంబంధిత టోల్ ప్లాజా, 121 ప్లాజాల జాబితాలో ఉండాలి.
అర్హత ఉన్నవాళ్లు ఒక నెలలో అదే టోల్ ప్లాజా మీదుగా తరచూ ప్రయాణిస్తుంటే ఈ పాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగానికి వెళ్లేవాళ్లు, రోజువారీ పనుల కోసం ప్రయాణించేవాళ్లు, ఇతర సాధారణ అవసరాల కోసం టోల్ ప్లాజాను తరచూ దాటేవాళ్లకు ప్రయోజనం ఉంటుంది.
ఇది కూడా చదవండి: సిటీ రైడింగ్ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు
ఇప్పటివరకు, ఈ లోకల్ పాస్ పొందాలంటే సంబంధిత టోల్ ప్లాజాకు వెళ్లి పలు పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. కొత్త డిజిటల్ విధానంతో ఈ ప్రక్రియను NHAI సులభతరం చేసింది. అర్హత ఉన్నవారు రాజ్‌మార్గ్‌యాత్ర మొబైల్ యాప్ ద్వారా లోకల్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అవసరమైన వివరాలను డిజిటల్ విధానంలోనే ధ్రువీకరిస్తారు.
అడ్రస్, వాహన వివరాలు ఎలా చెక్ చేస్తారు?
దరఖాస్తుదారుడి అనుమతితో డిజిటల్ ప్రభుత్వ వేదికల నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారు. ఇందుకోసం డిజీలాకర్ & వాహన్ డేటాబేస్‌ను ఉపయోగిస్తారు. వాహనానికి అనుసంధానమైన ఫాస్టాగ్ వివరాలను కూడా పరిశీలిస్తారు. అంతేకాదు, GIS ఆధారిత ధ్రువీకరణ ద్వారా వాహనదారుడి రిజిస్టర్డ్ అడ్రస్ సంబంధిత టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉందో లేదో నిర్ధారిస్తారు. దీంతో చిరునామా రుజువు కోసం ప్రత్యేకంగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఇది కూడా చదవండి: యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
ఎక్కడ అందుబాటులో ఉంది?
డిజిటల్ లోకల్ పాస్ సదుపాయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల్లో అందుబాటులో ఉంది. ఇందులో హర్యానాలోని బర్తానా, ఉత్తరప్రదేశ్‌లోని భారత్‌కుండ్, ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాహ్మణపల్లి, తమిళనాడులోని బూతకుడి, మధ్యప్రదేశ్‌లోని చికాలికళ, బీహార్‌లోని దేవ్‌కులి వంటి టోల్ ప్లాజాలు ఉన్నాయి.
రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో, అందుబాటులో ఉన్న టోల్ ప్లాజాల పూర్తి జాబితాను చూసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు తమ టోల్ ప్లాజా ఈ సదుపాయం పరిధిలో ఉందో లేదో చెక్ చేసుకోవడం మంచిది.
ఈ ఏడాది జులైలో, ఢిల్లీలోని ముండ్కా-బక్కర్‌వాలా టోల్ ప్లాజా వద్ద ఈ డిజిటల్ విధానాన్ని తొలిసారిగా ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించారు. రానున్న నెలల్లో మరిన్ని టోల్ ప్లాజాలకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో దిశగా అడుగు
ఈ డిజిటల్ పాస్ విధానం, భారత్‌లో మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోల్ విధానం అమలుకు కూడా ఉపయోగపడనుంది. ఈ విధానంలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ఫాస్టాగ్ ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం మరింత సులభంగా మారుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















