Kia Carens Clavisలో ఏ వేరియంట్ ధర ఎంత? మిడ్ వేరియంట్లో ఏ ఫీచర్లున్నాయి? పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో పూర్తి వివరాలు
Kia Carens Clavisలోని 11 వేరియంట్లు, నాలుగు ఇంజిన్ ఆప్షన్లు, ధరలు, ఫీచర్లు, కలర్ ఆప్షన్ల గురించి తెలుసుకోండి. మీ అవసరానికి సరిపోయే బెస్ట్ వేరియంట్ ఏదో చూడండి.

Kia Carens Clavis Variants: కియా కారెన్స్ క్లావిస్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు నచ్చిన వేరియంట్‌ను ఎంచుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే, ఈ MPV మొత్తం 11 ట్రిమ్‌లలో, నాలుగు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో పెట్రోల్, టర్బో పెట్రోల్, CNG, డీజిల్ ఆప్షన్లు ఉన్నాయి. వీటికి అనుగుణంగా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను కూడా కియా అందిస్తోంది. ఇటీవల కంపెనీ ఈ MPV వేరియంట్లు, ధరల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం ప్రారంభ ధర రూ.11.39 లక్షలు. ఇప్పుడు.. ఏ వేరియంట్ కొనడం మంచిది? ధరకు తగ్గ ఫీచర్లు ఏ ట్రిమ్‌లో ఉన్నాయి? తెలుసుకుందాం.
కియా కారెన్స్ క్లావిస్ ఇంజిన్ ఆప్షన్లు
కియా కారెన్స్ క్లావిస్ ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.11.39 లక్షల నుంచి రూ.21.79 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, దాని ఆధారంగా రూపొందించిన CNG, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి.
1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 115hp పవర్, 144Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్లో 96hp పవర్, 123Nm టార్క్ లభిస్తాయి. ఈ రెండు ఇంజిన్లకు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు.
1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160hp పవర్, 253Nm టార్క్ అందిస్తుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ క్లచ్‌లెస్ మాన్యువల్ (iMT), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్‌లతో ఎంచుకోవచ్చు.
1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116hp పవర్, 250Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.
కలర్ ఆప్షన్లు, ఇంటీరియర్ థీమ్స్
కారెన్స్ క్లావిస్‌ను 8 మోనోటోన్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లలో కియా అందిస్తోంది. అవి.. అరోరా బ్లాక్ పెర్ల్, క్లియర్ వైట్, డార్క్ గన్ మెటల్, గ్లేసియర్ వైట్ పెర్ల్, గ్రావిటీ గ్రే, ఇంపీరియల్ బ్లూ, ఐవరీ సిల్వర్, ప్యూటర్ ఆలివ్. వీటిలో డార్క్ గన్ మెటల్ రంగు X-Line వేరియంట్‌కు మాత్రమే ప్రత్యేకం. మిగిలిన రంగులు అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
ఇంటీరియర్‌లో మొత్తం ఐదు కలర్ థీమ్స్ ఉన్నాయి. HTE, HTE (O), HTE (EX) వేరియంట్లలో బ్లాక్-బేజ్ డ్యాష్‌బోర్డ్, బ్లాక్-నేవీ సెమీ లెదరెట్ సీట్లు ఉంటాయి. HTK+, HTK+ (O) ట్రిమ్‌లలో పూర్తిగా బ్లాక్ సీట్లు లభిస్తాయి. HTX, HTX (O), HTX+ వేరియంట్లలో బ్లూ-బేజ్ క్యాబిన్, లెదరెట్ సీట్లు ఉంటాయి. GTX, GTX+ మోడళ్లలో ఆఫ్-వైట్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ ఉంటుంది. X-Lineలో గ్రీన్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ థీమ్ ప్రత్యేక ఆకర్షణ.
ఇది కూడా చదవండి: డీజిల్ కారు ఓనర్లు, డ్రైవర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. AdBlue ఎప్పుడు నింపాలి? ధర ఎంత?
వేరియంట్ల వారీగా ధరలు, ఫీచర్లు
HTE
ధర: రూ.11.39 లక్షల నుంచి రూ.12.39 లక్షలు
పెట్రోల్ MT, CNG MT ఆప్షన్లలో లభించే బేస్ వేరియంట్లో హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్, ఫాక్స్ మెటల్ ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రియర్ స్పాయిలర్ ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్లో 15-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, CNG వెర్షన్లో 16-అంగుళాల స్టైలిష్డ్ స్టీల్ వీల్స్ ప్లాస్టిక్ కవర్లతో వస్తాయి.
క్యాబిన్లో 4.2-అంగుళాల కలర్ MIDతో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మాన్యువల్ AC, రెండో, మూడో వరుసలకు ప్రత్యేక AC వెంట్స్, రియర్ డోర్ సన్‌షేడ్స్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉన్నాయి. కీ లెస్ ఎంట్రీ, ముందు 12V పవర్ అవుట్లెట్, ముందు, వెనుక USB Type-C పోర్టులు కూడా ఉంటాయి.
డ్రైవర్ సీటుకు మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, నాలుగు పవర్ విండోస్, రెండో వరుసకు వన్-టచ్ ఎలక్ట్రిక్ టంబుల్ ఫంక్షన్ అందించారు. రెండో వరుసలో సెంటర్ ఆర్మ్‌రెస్ట్, 60:40 స్ప్లిట్ సీట్లు, మూడో వరుసలో 50:50 స్ప్లిట్ సీట్లు ఉన్నాయి.
భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, హిల్ స్టార్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజెస్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ABS with EBD, ESC ఉన్నాయి.
HTE (O)
ధర: రూ.12.35 లక్షల నుంచి రూ.15.82 లక్షలు
పెట్రోల్ MT, CNG MT, టర్బో పెట్రోల్ MT, DCT, డీజిల్ MT, AT ఆప్షన్లలో లభిస్తుంది. HTEతో పోలిస్తే ఇందులో 8-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ Android Auto, Apple CarPlay, నాలుగు స్పీకర్లు, రెండు ట్వీటర్లతో కూడిన ఆడియో సిస్టమ్ ఉన్నాయి.
ఇంకా ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, పవర్డ్ ORVMలు, షార్క్ ఫిన్ యాంటెన్నా, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో రియర్ వ్యూ కెమెరా, ORVMలపై LED టర్న్ ఇండికేటర్లు అందించారు. టర్బో పెట్రోల్ DCT, డీజిల్ AT వేరియంట్లలో మాత్రమే పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, Eco, Normal, Sport డ్రైవ్ మోడ్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లభిస్తాయి.
HTE (EX)
ధర: రూ.12.86 లక్షల నుంచి రూ.14.88 లక్షలు
పెట్రోల్ MT, టర్బో పెట్రోల్ MT, డీజిల్ MT ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. HTE (O) కంటే అదనంగా సింగిల్ పేన్ సన్‌రూఫ్, LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సైడ్ విండోకు వన్-టచ్ అప్/డౌన్ ఫంక్షన్, LED క్యాబిన్ లైట్లు ఉంటాయి.
HTK+
ధర: రూ.16.44 లక్షల నుంచి రూ.17.57 లక్షలు
ఈ వేరియంట్ టర్బో పెట్రోల్ DCT, డీజిల్ MT, AT ఆప్షన్లలో లభిస్తుంది. HTE (EX) కంటే అదనంగా రియర్ వైపర్, వాషర్, కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్, ఆటో ఫోల్డింగ్ ORVMలు, సాటిన్ క్రోమ్ బెల్ట్‌లైన్ స్ట్రిప్, రూఫ్ రైల్స్ అందించారు.
క్యాబిన్లో బ్లాక్-బేజ్ థీమ్, బ్లాక్ సెమీ లెదరెట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
HTK+ (O)
ధర: రూ.16.42 లక్షల నుంచి రూ.17.86 లక్షలు
టర్బో పెట్రోల్ MT, DCT, డీజిల్ MT ఆప్షన్లలో లభిస్తుంది. HTK+ కంటే అదనంగా టర్బో పెట్రోల్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, LED హెడ్‌ల్యాంప్స్, LED DRLలలో ఇంటిగ్రేట్ చేసిన టర్న్ ఇండికేటర్లు, 17-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందు, వెనుక డ్యాష్‌క్యామ్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్ యాప్ సపోర్ట్ కూడా లభిస్తుంది.
HTX
ధర: రూ.19.01 లక్షలు
ఈ వేరియంట్ డీజిల్ MTలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. HTK+ (O)తో పోలిస్తే 12.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, బిల్ట్-ఇన్ మ్యాప్స్, 12.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. AQI డిస్ప్లేతో ఎయిర్ ప్యూరిఫైయర్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్‌తో 360-డిగ్రీ కెమెరా, ఆటో డిమ్మింగ్ IRVM, 64-కలర్ యాంబియంట్ లైటింగ్ కూడా ఉన్నాయి.
ఇతర ఫీచర్లలో మెటాలిక్ డోర్ గార్నిష్ ఇన్సర్ట్స్, సాటిన్ క్రోమ్ ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్ ఫినిష్, కార్ కీ, వాయిస్ కమాండ్లతో అన్ని విండోలను పైకి, కిందికి కదిలించే ఫంక్షన్ ఉన్నాయి. మొదటి, రెండో వరుస ప్రయాణికులకు కూల్డ్ కప్ హోల్డర్లు, లెదరెట్ స్టీరింగ్ వీల్, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, రెండో వరుసకు సీట్‌బ్యాక్ రిట్రాక్టబుల్ టేబుల్, విండ్‌షీల్డ్స్, విండోలకు UV-cut గ్లాస్ కూడా ఇచ్చారు. ఇంటీరియర్ బ్లూ-బేజ్ థీమ్‌లో, లెదరెట్ సీట్లతో ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్, AC కంట్రోల్స్ కోసం మార్చుకోగలిగే టచ్ ఎనేబుల్డ్ బటన్లు కూడా ఉన్నాయి.
HTX (O)
ధర: రూ.19.62 లక్షలు
టర్బో పెట్రోల్ DCTలో మాత్రమే లభిస్తుంది. HTXలోని ఫీచర్లకు అదనంగా 8-స్పీకర్ Bose సౌండ్ సిస్టమ్ ఉంటుంది.
GTX
ధర: రూ.20 లక్షలు
టర్బో పెట్రోల్ DCT ఆప్షన్‌తో వస్తుంది. HTX కంటే అదనంగా LED ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, లైమ్ కలర్ బ్రేక్ కాలిపర్లు, మెటల్ యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ ఆల్-బ్లాక్ థీమ్‌లో ఉంటుంది. బ్లాక్ లెదరెట్ సీట్లపై ఆఫ్-వైట్ యాక్సెంట్లు ఉంటాయి.
HTX+
ధర: రూ.19.04 లక్షల నుంచి రూ.21.07 లక్షలు
టర్బో పెట్రోల్ MT, iMT, DCT ఆప్షన్లలో లభిస్తుంది. HTX (O) కంటే అదనంగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 4-వే పవర్డ్ డ్రైవర్ సీట్, కో-డ్రైవర్ సీట్‌కు మాన్యువల్ బాస్ మోడ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి.
టర్బో పెట్రోల్ DCT వేరియంట్లలో మాత్రమే Level-2 ADAS, ప్యాడిల్ షిఫ్టర్లు లభిస్తాయి. ఆరు సీట్ల వేరియంట్లలో రెండో వరుసకు కెప్టెన్ సీట్లు, రియర్ డోర్ పుడిల్ ల్యాంప్స్ కూడా ఉంటాయి.
GTX+
ధర: రూ.21.79 లక్షలు
టర్బో పెట్రోల్ DCTలో మాత్రమే లభించే ఈ వేరియంట్లో HTX+ కంటే అదనంగా డిజిటల్ కీ అందించారు.
X-Line
ధర: రూ.21.79 లక్షలు
టర్బో పెట్రోల్ DCT ఆప్షన్‌తో వస్తుంది. GTX+ కంటే అదనంగా గ్రీన్ యాక్సెంట్లతో బ్లాక్ లెదరెట్ సీట్లు, ఆల్-బ్లాక్ ఇంటీరియర్, బెల్ట్లైన్పై డార్క్ సాటిన్ క్రోమ్ ట్రిమ్ ఉంటాయి.
ఏ వేరియంట్ కొనాలి?
కియా కారెన్స్ క్లావిస్లో ధరకు తగ్గ ఫీచర్లు, విలువను పరిగణనలోకి తీసుకుంటే HTX వేరియంట్ మంచి ఎంపికగా నిలుస్తుంది. ఇందులో ఆధునిక ఫీచర్లు చాలానే ఉన్నాయి. అయితే బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, Level-2 ADAS ఇందులో లేవు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే HTX వేరియంట్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది.
టర్బో పెట్రోల్ ఇంజిన్ కావాలనుకునేవారికి HTX (O) మంచి విలువను అందిస్తుంది. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయాలనుకునేవారికి HTE (O) వేరియంట్ సరైన ఎంపిక కావచ్చు.
గమనిక: కథనంలో పేర్కొన్న ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















