Skydrive: ఎయిర్ హెలికాప్టర్ లాంచ్ చేయనున్న మారుతి సుజుకి - స్కై డ్రైవ్ అనే పేరుతో!
Maruti Suzuki Skydrive: మారుతి సుజుకి స్కైడ్రైవ్ అనే పేరుతో ఎయిర్ కాప్టర్‌ను లాంచ్ చేయనుంది.
Suzuki Aircopter: ప్రముఖ భారతీయ కార్ల తయారీ సంస్థ మారుతీ ఇప్పుడు ఆకాశాన్ని కూడా అందుకునేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తన జపనీస్ మాతృ సంస్థ సుజుకీ సహాయంతో ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్‌ను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు డ్రోన్‌ల కంటే పెద్దవిగా ఉంటాయి కానీ సాంప్రదాయ హెలికాప్టర్‌ల కంటే చిన్నవిగా ఉంటాయి. పైలట్‌తో సహా కనీసం ముగ్గురు ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉంటుంది.
భారతదేశంలోకి విస్తరించే ముందు జపాన్, యూఎస్‌లోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కొత్త మొబిలిటీ సొల్యూషన్‌లో ముందస్తు ఆధిక్యాన్ని పొందడం దీని లక్ష్యం. భూమిపై ఉబర్, ఓలా కార్ల లాగా ఈ ఎయిర్ టాక్సీలు రవాణాలో విప్లవాత్మక మార్పులు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి.
భారతదేశంలో కూడా అందుబాటులోకి
అమ్మకాల కోసం భారత మార్కెట్‌ను అన్వేషించడమే కాకుండా, తయారీ ఖర్చులను తగ్గించుకోవడానికి భారతదేశంలో తయారీని కూడా మారుతిని పరిశీలిస్తోంది. సుజుకి మోటార్, గ్లోబల్ ఆటోమొబైల్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ కెంటో ఒగురా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కంపెనీ ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏతో చర్చలు జరుపుతోందని, దానిని నిజం చేయడానికి అధ్యయనాలు నిర్వహిస్తోందని చెప్పారు.
మేక్ ఇన్ ఇండియా మోడల్ కూడా...
మారుతీ సుజుకి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్‌ను స్కైడ్రైవ్ అని పిలుస్తారు. 12 యూనిట్ల మోటారు, రోటర్లతో అమర్చబడిన ఈ మోడల్ జపాన్‌లో 2025 ఒసాకా ఎక్స్‌పోలో డిస్‌ప్లే అవుతుందని భావిస్తున్నారు. ప్రారంభ అమ్మకాల్లో జపాన్, యూఎస్‌లపై దృష్టి పెట్టనున్నాయి. అయితే 'మేక్ ఇన్ ఇండియా' ఇనీషియేటివ్ ద్వారా ఈ టెక్నాలజీని భారతదేశానికి తీసుకురావాలని మారుతి యోచిస్తోంది.
సుజుకి ఏం చెప్పింది?
సుజుకి మోటార్ అసిస్టెంట్ మేనేజర్ కెంటో ఒగురా హెలికాప్టర్ల కంటే ఉత్పత్తిని చౌకగా తయారు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లోని తమ కస్టమర్లను గుర్తించేందుకు కంపెనీ మార్కెట్ పరిశోధనలు చేస్తోందని ఆయన చెప్పారు. భారతదేశంలో విజయవంతం కావాలంటే ఎయిర్ కాప్టర్లు చౌకగా ఉండాలి. టేకాఫ్ బరువు 1.4 టన్నులతో, ఎయిర్ కాప్టర్ సాంప్రదాయ హెలికాప్టర్‌లో సగం బరువు ఉంటుందని ఒక నివేదిక పేర్కొంది. దాని తక్కువ బరువు కారణంగా ఇది టేకాఫ్, ల్యాండింగ్ కోసం బిల్డింగ్ రూఫ్‌టాప్‌లను ఉపయోగించవచ్చు. విద్యుదీకరణ కారణంగా విమాన విడిభాగాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఫలితంగా తయారీ, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.
మరోవైపు ఇండియాలో రెండు అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలు, మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ సంవత్సరం కొన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నాయి. మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, నెక్స్ట్ జనరేషన్ డిజైర్‌లను 2024లో మొదటగా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్ కూడా రాబోయే నెలల్లో మార్కెట్లోకి రానుంది. ఈ కారు ఇటీవలే టెస్టింగ్ సమయంలో కనిపించింది. హ్యుందాయ్ ఈ సంవత్సరాన్ని అప్‌డేట్ చేసిన క్రెటాతో షురూ చేసింది. దీని తరువాత హ్యుందాయ్ 2024 మధ్య నాటికి క్రెటా ఎన్ లైన్, అల్కజార్ ఫేస్‌లిఫ్ట్‌లను లాంచ్ చేయనుంది.