Cheapest Electric Cars: రేంజ్ ఎక్కువ, రేటు తక్కువ - 400 km పైగా మైలేజ్ ఇచ్చే చవకైన EVలు ఇవి
Cheapest Electric Cars in India: డబ్బు ఆదా చేయడంతో పాటు స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్ల కారణంగా మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

2025 Cheapest Electric Cars In India: సంప్రదాయ ఇంధనాలైన పెట్రోల్ & డీజిల్ ధరలు అందుబాటులో లేకపోవడం, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండడం సంప్రదాయ ఇంధన వాహనాలకు పెద్ద మైనస్ పాయింట్. వీటితో పోలిస్తే.. తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించడం, నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉండడం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న ప్లస్ పాయింట్. పైగా.. కేంద్రం & వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి రాయితీల రూపంలో EVలకు సపోర్ట్ అందుతోంది. ఈ కారణంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌లో లాంగ్ రేంజ్ & ప్రీమియం ఫీచర్లు అందించే ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు హాట్ కేక్స్‌లా మారుతున్నాయి.
మన మార్కెట్‌లో, రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో లాంగ్ రేంజ్ ఇచ్చే మూడు చవక ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి, అవి - MG కామెట్ EV, TATA టియాగో EV & TATA పంచ్ EV.
ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)
భారతదేశంలో చవకైన ఎలక్ట్రిక్ కార్లలో MG కామెట్ EV ముందుంటుంది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (Battery-as-a-Service మోడల్ కింద) & స్టాండర్డ్ ప్రైస్ రూ. 6.99 లక్షలు. ఇది 17.3 kWh బ్యాటరీతో పవర్ తీసుకుంటుంది. ARAI (Automotive Research Association of India) ధృవీకరణ ప్రకారం, ఈ కార్ బ్యాటరీని ఒకసారి పుల్ ఛార్జ్ చేస్తే 230 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. అంటే, ఫుల్ ఛార్జ్‌తో హైదరాబాద్‌లో బయలుదేరితే దాదాపుగా విజయవాడ సమీపం వరకు వెళ్లవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఈ ఎలక్ట్రిక్ వెహికల్‌లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. హైవే జర్నీలో ముందు వరుస ప్రయాణీకుల భద్రత కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లు అమర్చారు. పార్క్ చేసే సమయంలో డ్రైవర్ తడబడకుండా రివర్స్ కెమెరా హెల్ప్ చేస్తుంది. సీట్ ఆక్యుపెంట్స్‌కు హాయినిచ్చే మరికొన్ని ఫీచర్లను కూడా యాడ్ చేశారు. నగరం లోపల & కాస్త దూరం ప్రయాణాలకు కాంపాక్ట్ & బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ 'ఎంజీ కామెట్ ఈవీ'.
టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)
టాటా టియాగో EV గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, దీనికి పాన్-ఇండియా లెవెల్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియాగో EV ఒకటి. బడ్జెట్ దాటని ధర, మంచి మైలేజ్ & నమ్మకమైన పనితీరు, సేఫ్టీ ఫీచర్లు వంటివి కస్టమర్ల గుండెల్లో ఈ EVని ప్రత్యేకంగా నిలిపాయి. టాటా టియాగో ఈవీ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు. దీనిలో రెండు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి - 19.2 kWh బ్యాటరీతో 223 కి.మీ. రేంజ్ & 24 kWh బ్యాటరీతో 293 కి.మీ. డ్రైవింగ్ రేంజ్ ఇవ్వగలవని కంపెనీ వెల్లడించింది. అంటే, 19.2 kWh బ్యాటరీ ఆప్షన్ బండిని కొంటే, సింగిల్ ఛార్జ్‌తో నమ్మకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లవచ్చు. ఈ కార్‌లో 7 అంగుళాల టచ్ స్క్రీన్, హర్మాన్ సౌండ్ సిస్టమ్, రెండు ఎయిర్ బ్యాగ్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 58 నిమిషాల్లో, అంటే గంటలోపే 80% వరకు ఛార్జ్ చేయగల ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. బెటర్ డ్రైవింగ్ రేంజ్ & సౌలభ్యం కోరుకునే వారికి నమ్మకమైన ఆప్షన్‌గా టాటా టియాగో ఈవీ నిలుస్తుంది.
టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
టాటా పంచ్ EV ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ఫీచర్ల పరంగానే కాకుండా భద్రత & రేంజ్ విషయంలోనూ ఇది పర్‌ఫెక్ట్‌గా పని చేస్తుంది. భారత్‌లో తయారైన ఈ EV, భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. టాటా పంచ్ ఈవీ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్‌ను రెండు బ్యాటరీ వేరియంట్లలో కొనవచ్చు - 25 kWh బ్యాటరీ ఆప్షన్‌తో 315 కి.మీ. & 35 kWh బ్యాటరీ ఆప్షన్‌తో 421 కి.మీ. ప్రయాణించవచ్చు. కార్ క్యాబిన్‌లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ & వైర్‌లెస్ అప్‌డేట్స్ వంటి ప్రీమియం ఫీచర్లను ఏర్పాటు చేశారు.





















