Hyundai Stargazer: హ్యుందాయ్ కొత్త మోడల్ ఫీచర్లు చూశారా, స్టన్నింగ్ స్టార్‌గేజర్ వచ్చేస్తోంది
మల్టీ పర్పస్ వెహికిల్ రేంజ్‌లో హ్యుందాయ్ సంస్థ కొత్త మోడల్‌ని పరిచయం చేయనుంది. అత్యాధునిక ఫీచర్లతో ఉన్న స్టార్‌గేజర్ టీజర్ లుక్‌ని విడుదల చేసింది.
కొత్త ఎంపీవీని తీసుకొస్తున్న హ్యుందాయ్
హ్యుందాయ్ కంపెనీ సరికొత్త మోడల్‌ని లాంఛ్ చేసింది. మల్టీ పర్పస్ వెహికిల్ స్టార్‌గేజర్ అంతర్జాతీయంగా అందుబాటులోకి రానుంది. ఇటీవలే ఈ వెహికిల్‌కి సంబంధించిన టీజర్ లుక్‌ని విడుదల చేసింది సంస్థ. ప్రీమియం మల్టీ పర్పస్ వెహికిల్స్‌లో స్టార్‌గేజర్ అత్యుత్తమంగా నిలుస్తుందని హ్యుందాయ్ ధీమాగా చెబుతోంది. ఇప్పటికే ఈ ఎంపీవీ మోడల్స్‌లో కియా సంస్థకు చెందిన క్యారెన్స్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీనికి పోటీగానే హ్యుందాయ్ ఈ స్టార్‌గేజర్‌ని తీసుకొస్తోంది. మారుతి ఎర్టిగానూ దృష్టిలో ఉంచుకుని అంత కన్నా అత్యాధునిక ఫీచర్లతో స్టార్‌గేజర్‌ను రూపొందించారు. క్యారెన్స్‌తో పోల్చి చూస్తే స్టార్‌గేజర్‌లో క్యాబ్ ఫార్వర్డ్ డిజైన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది కాకుండా ఇంటీరియర్‌లో అవసరమైనంత మేరకు స్పేస్‌ను పెంచుకునే వెసులుబాటూ ఉంది. లుక్ విషయంలోనూ ఏ మాత్రం రాజీ పడలేదు హ్యుందాయ్. చాలా స్టైలిష్‌గా ఉండేలా డిజైన్ చేసింది. ఈ కార్‌లో మరో హైలైట్ ఏంటంటే ముందు, వెనక డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయ్. కార్ కదులుతున్న సమయంలో ఇవి చాలా బ్రైట్‌గా వెలుగుతుంటాయి.
ఆ కార్లకు పోటీగా స్టార్ గేజర్
అంతకు ముందు తీసుకొచ్చిన మల్టీ పర్పస్ వెహికిల్ స్టారియాకి ఇది స్మాలర్ వర్షన్ అని చెబుతోంది సంస్థ. స్టార్‌గేజర్ పొడవూ ఎక్కువే. దాదాపు 4.5 మీటర్ల లెంత్ ఉంటుంది. సిక్స్, సెవెన్ సీటర్స్‌లో ఇది లభిస్తుంది. త్వరలోనే ఇండోనేషియాలో మొదట రిలీజ్ చేయనున్నారు. తరవాత భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. స్టార్‌గేజర్‌తో సుజుకీ ఎర్టిగాకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది హ్యుందాయ్. నిజానికి మార్కెట్‌లో ప్రసుత్తానికి మల్టీ పర్పస్ వెహికిల్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే టయోటా ఇన్నోవా క్రిస్టా ఆ డిమాండ్‌ని బాగానే అందుకుంది. తరవాత ఎర్టిగా, XL6కి కూడా క్రేజ్ వచ్చింది. వీటి బదులుగా మరిన్ని ఫీచర్లతో వచ్చి వాహనదారులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది హ్యుందాయ్ సంస్థ. త్రీ రో ఎస్‌యూవీలను ఇప్పటికే లాంచ్ చేసింది ఈ కంపెనీ. ఈ పరిస్థితుల్లో స్టార్‌గేజర్ మార్కెట్‌లో ఎలా నిలదొక్కుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వెన్యూ కార్‌తో క్రేజ్ తెచ్చుకున్న హ్యుందాయ్ ఇంకొన్ని రోజుల్లో టక్సాన్ మోడల్‌నీ విడుదల చేయాలని చూస్తోంది. వీటితోపాటు మరి కొన్ని మోడల్స్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతానికి కార్ కొనాలనుకునే వాళ్లు హై ఎండ్ వైపే మళ్లుతున్నారు. ఫీచర్లు బాగుంటే కాస్త కాస్ట్‌లీ అయినా కొనేందుకు వెనకాడటం లేదు. అందుకే కంపెనీలు కొత్త మోడల్స్‌ని ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ మార్కెట్‌లో నిలబడుతున్నాయి. ఇప్పుడు హ్యుందాయ్ కూడా ఇదే స్ట్రాటెజీ ఫాలో అవుతోంది.
Also Read: Hyundai Venue Facelift 2022: కొత్త వెన్యూ వచ్చేసింది - రూ.7.5 లక్షల్లోనే - మొదటిసారి ఆ ఫీచర్‌తో!