చూపులకు SUV రఫ్‌నెస్.. క్యాబిన్లో టెక్నాలజీ హంగామా.. హ్యుందాయ్ బేయాన్‌లో ఇవే హైలైట్స్!
హ్యుందాయ్ బేయాన్ SUV డిజైన్ స్కెచ్లను విడుదల చేసింది. H Edge లైటింగ్, SUV డిజైన్, టెక్నాలజీ ఆధారిత ఇంటీరియర్‌తో వస్తున్న ఈ కారు వివరాలివే.

Hyundai BAYON Details In Telugu: హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త SUVతో భారత కార్ల మార్కెట్లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ త్వరలో తీసుకురానున్న బేయాన్ SUV డిజైన్ స్కెచ్లను విడుదల చేసింది. దీంతో ఈ కొత్త వాహనం ఎలా ఉండబోతోందనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. ఇప్పటికే మోడల్ పేరును ప్రకటించిన హ్యుందాయ్.. ఇప్పుడు తొలిసారి దీని బాహ్య & అంతర్గత డిజైన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
బేయాన్‌ను గ్లోబల్ మోడల్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా నగరాల్లో కారును ఉపయోగించేవారిని దృష్టిలో పెట్టుకుని దీనిని డిజైన్ చేస్తున్నారు. SUV తరహా రూపంతో పాటు, సిటీలో తిరగడానికి అనువుగా ఉండేలా రూపొందిస్తున్నారు.
బయటి డిజైన్
డిజైన్ విషయంలో హ్యుందాయ్ కొత్తగా అనుసరిస్తున్న 'ఆర్ట్ ఆఫ్ స్టీల్ డిజైన్'ను బేయాన్‌లో చూడొచ్చు. షార్ప్ లైన్స్, స్పష్టమైన ఆకృతులు & సమతుల్యమైన నిష్పత్తులతో కారు రూపాన్ని తీర్చిదిద్దారు. ముందు భాగంలో ఉబ్బెత్తుగా కనిపించే బానెట్, వెడల్పుగా ఉన్న ఫెండర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ముందు భాగంలో H Edge లైటింగ్ సిగ్నేచర్ ప్రధాన హైలైట్‌గా ఉంటుంది. ఇది బేయాన్కు ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వనుంది. సన్నని గీతలతో కూడిన లైటింగ్ డిజైన్ ఉండనుంది. దిగువ భాగంలో బలమైన ఆకృతులు SUV రూపాన్ని మరింత స్పష్టంగా చూపిస్తాయి.
బేయాన్ సైడ్ డిజైన్‌పై హ్యుందాయ్ పెద్దగా వివరాలు వెల్లడించలేదు. అయితే విడుదల చేసిన స్కెచ్లను బట్టి వాహనం దృఢమైన రూపంతో కనిపిస్తోంది. బానెట్ ఆకృతి & ఫెండర్ల పరిమాణం SUV తరహా రూపాన్ని నిర్దారిస్తున్నాయి.
ఇంటీరియర్
కేవలం బయటి రూపానికే పరిమితం కాకుండా ఇంటీరియర్పైనా హ్యుందాయ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. క్యాబిన్‌ను ఆధునిక నగర జీవనశైలికి అనుగుణంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, సులభమైన నియంత్రణలు & కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇచ్చింది.
ఇది కూడా చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 460km దూరం జర్నీ.. 7 ఎయిర్‌బ్యాగ్స్‌తో కియా కొత్త PV7 ఎలక్ట్రిక్ వ్యాన్!
విడుదల చేసిన ఇంటీరియర్ స్కెచ్‌లో ఆధునిక డ్యాష్‌బోర్డ్ కనిపిస్తోంది. డ్రైవర్‌కు అవసరమైన సమాచారం సులభంగా అందేలా క్యాబిన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే స్క్రీన్ పరిమాణం, సీటింగ్ సామర్థ్యం, ఇతర పరికరాలపై హ్యుందాయ్ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
కంపెనీ డిజైన్ విభాగం ప్రకారం బేయాన్‌లో బయటి భాగంలో SUV తరహా బలమైన రూపాన్ని చూపించడంపై దృష్టి పెట్టారు. అదే సమయంలో లోపల టెక్నాలజీ & నగర వినియోగానికి అనుగుణమైన సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కారులో ఎలాంటి ఇంజిన్ ఉంటుంది? హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వెర్షన్ ఉంటుందా? ఇంధన సామర్థ్యం ఎంత? ధర ఎంత? వంటి అంశాలపై కంపెనీ ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
భారత్‌లో బేయాన్‌ను ఏ విభాగంలో ప్రవేశపెడతారనే అంశంపైనా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. విడుదలకు ముందు మరిన్ని వివరాలను హ్యుందాయ్ వెల్లడించే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే.. బేయాన్‌లో SUV రూపానికి ప్రాధాన్యత ఇస్తూనే ఆధునిక టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్‌ను అందించేందుకు హ్యుందాయ్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా H Edge లైటింగ్, బలమైన ఫెండర్లు & చెక్కినట్లుగా కనిపించే బానెట్ దీని డిజైన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇది కూడా చదవండి: గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్-10 కార్ల లిస్ట్
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















