బ్రేక్ వేయడం నుంచి లేన్ మార్చే వరకు.. కారులో ADAS ఉంటే భద్రత మరింత పెరుగుతుందా?
కార్లలో ADAS అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? ప్రమాదాల నివారణ, డ్రైవింగ్ సౌకర్యం & భవిష్యత్ కార్ల భద్రతలో దీని ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోండి.

What Is ADAS In Cars: కారు నడుపుతున్నప్పుడు డ్రైవర్ ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగొచ్చు. ఒక్క క్షణం నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్‌కు సహాయం చేసే టెక్నాలజీనే ADAS. దీని పూర్తి పేరు "అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్" (Advanced Driver Assistance Systems). ఆధునిక కార్లలో భద్రతను పెంచేందుకు ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.
ADAS సూట్
ADAS అనేది ఒకే ఫీచర్ కాదు. ఇందులో అనేక సాంకేతిక వ్యవస్థలు కలిసి పని చేస్తాయి, దీనిని ADAS సూట్ అని కూడా పిలుస్తారు. కారులో ADAS ఉంటే.. రోడ్డుపై ఉన్న వాహనాలు, పాదచారులు, ట్రాఫిక్ గుర్తులు, లేన్లు వంటి వాటిని గుర్తించేందుకు సెన్సర్లు పని చేస్తాయి. సేకరించిన సమాచారాన్ని సాఫ్ట్వేర్ విశ్లేషిస్తుంది. అవసరమైనప్పుడు డ్రైవర్‌కు హెచ్చరిక ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో కారు బ్రేకింగ్, స్టీరింగ్ వంటి చర్యల్లోనూ సహాయపడుతుంది.
ఈ వ్యవస్థలో కెమెరాలు, రాడార్ వంటి సెన్సర్లు కీలకంగా పనిచేస్తాయి. ప్రాసెసర్లు వాటి నుంచి వచ్చే సమాచారాన్ని వెంటనే విశ్లేషిస్తాయి. మ్యాపింగ్ వ్యవస్థలు కూడా వాహనం ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. వీటి నుంచి వచ్చే సమాచారాన్ని కలిపి కారు చుట్టూ ఉన్న పరిస్థితిని అంచనా వేస్తుంది.
ADASలో పాదచారులను గుర్తించే వ్యవస్థ ఒకటి. రోడ్డుపై వ్యక్తి ఎదురుగా వస్తే డ్రైవర్‌ను అప్రమత్తం చేయొచ్చు. ట్రాఫిక్ గుర్తులను గుర్తించే ఫీచర్ కూడా ఉంటుంది. లేన్ నుంచి కారు బయటకు వెళ్తే హెచ్చరించే వ్యవస్థ మరో ముఖ్యమైన ఫీచర్. ముందున్న వాహనంతో ఢీకొనే ప్రమాదం కనిపిస్తే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కొన్ని పరిస్థితుల్లో పని చేస్తుంది.
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కూడా ADASలో భాగమే. ముందున్న వాహనాన్ని బట్టి కారు వేగాన్ని సర్దుబాటు చేయడంలో ఇది సహాయపడుతుంది. ఆటోమేటిక్ పార్కింగ్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సులభం చేస్తాయి.
భద్రతతో పాటు డ్రైవింగ్ సౌకర్యం కూడా ADAS ద్వారా పెరుగుతుంది. డ్రైవర్‌పై ఉండే ఒత్తిడి కొంత తగ్గుతుంది. అయితే ADAS పూర్తిగా డ్రైవర్‌కు ప్రత్యామ్నాయం కాదు. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. వ్యవస్థ ఇచ్చే హెచ్చరికలను గమనిస్తూ వాహనాన్ని నియంత్రించాలి.
టెక్నాలజీ ఇంకా మారొచ్చు!
ప్రస్తుతం, లెవెల్ 2 ADAS ఉంది. భవిష్యత్తులో ADAS మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కారు, మరో కారు, రహదారి మౌలిక వసతుల మధ్య సమాచార మార్పిడి పెరగవచ్చు. రోడ్డుపై ట్రాఫిక్, ప్రమాదాలు, వాతావరణ పరిస్థితుల వంటి సమాచారాన్ని వేగంగా పొందే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: లెవెల్ 2 ADAS ఫీచర్లున్న కార్లు మిడిల్‌క్లాస్ బడ్జెట్లోనే! ఈ 10 మోడళ్లలో మీకు ఏది నచ్చింది?
కృత్రిమ మేధస్సు (AI) & మెషిన్ లెర్నింగ్ (ML) కూడా ఈ వ్యవస్థల అభివృద్ధిలో కీలకంగా మారుతున్నాయి. పెద్ద మొత్తంలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా సహాయక వ్యవస్థలు మరింత అధునాతనంగా మారవచ్చు. కెమెరా, రాడార్, లైడార్ వంటి సెన్సర్ల సమాచారాన్ని కలిపి విశ్లేషించే సెన్సర్ ఫ్యూజన్ టెక్నాలజీ కూడా మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ & హైబ్రిడ్ కార్లలోనూ ADAS ఫీచర్లు పెరుగుతున్నాయి. గతంలో ఖరీదైన కార్లలో ఎక్కువగా కనిపించిన ఈ టెక్నాలజీ ఇప్పుడు ఇతర వాహన విభాగాల్లోకీ వస్తోంది. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా కొన్ని భద్రతా ఫీచర్లను మెరుగుపరిచే అవకాశం కూడా ఉంటుంది.
ADAS కారణంగా కారు సర్వీసింగ్ విధానంలోనూ మార్పులు వస్తున్నాయి. సాధారణ మెకానికల్ పనులతో పాటు సెన్సర్లు, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ప్రమాదం తర్వాత లేదా కొన్ని భాగాలను మార్చినప్పుడు ADAS సెన్సర్లను సరిగ్గా అమర్చడం, అవసరమైతే కాలిబ్రేషన్ చేయడం చాలా ముఖ్యం.
మొత్తంగా చూస్తే.. ఆధునిక కార్ల భద్రతలో ADAS ఒక కీలక టెక్నాలజీగా మారుతోంది. డ్రైవర్‌కు అదనపు సహాయం అందిస్తూ ప్రమాదాల ముప్పును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో కార్లు మరింత సురక్షితంగా మారే క్రమంలో ADAS పాత్ర మరింత పెరగవచ్చు.
ఇది కూడా చదవండి: రూ.9 లక్షల నుంచే హ్యుందాయ్ కొత్త SUV.. ప్రీమియం కారును తలపించే ఫీచర్లు!
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















